ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అంతా బాగానే ఉంది అనుకునే టైం లో మాకు భయంకర నిజం తెలిసింది

ప్రశ్న:- నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మాది ఒకే కులమైనా ఆయనకు ఆస్తిలేకపోవడంతో మా ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పారు. మాపెళ్లై రెండేళ్లు. సంతోషంగా సాగిపోతున్న మాకు ఇప్పుడో చిక్కు వచ్చిపడింది. మాకు ముందే బంధుత్వం ఉందనీ అతడు నాకు వరుసకు బాబాయ్‌ అవుతాడంటున్నారు. దాన్ని కారణంగా చూపించి విడాకులు తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు మా ఇంట్లోవాళ్లు. అత్తింటివాళ్లు మాకు అండగా ఉన్నారు. కానీ అంతా మమ్మల్ని దోషుల్లా చూస్తుంటే మానసికంగా చాలా ఒత్తిడిగా ఉంది? పరిష్కారం ఎలా?

జవాబు:- హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్‌ 5 ప్రకారం వివాహ బంధానికి కొన్ని షరతులు నిర్దేశించారు. అందులో సబ్‌ క్లాజ్‌ 2 ప్రకారం వధువూ, వరుడూ నిషేధిత బంధుత్వాల జాబితాలో ఉంటే ఆ వివాహం చెల్లదు. సెక్షన్‌ 3(జి) ప్రకారం నిషేధిత బంధుత్వాలు అంటే.. పెళ్లి చేసుకునే వ్యక్తులు రక్తసంబంధీకులు కాకూడదు. అంటే కొడుకూ, కూతురూ, కోడలూ, అల్లుడూ, వదినా, సవతితల్లీ తండ్రీతోపాటు వారి పిల్లలు అమ్మమ్మాతాతయ్యలూ వారి అన్నదమ్ములూ, మేనమామ, మేనత్త, అన్నా చెల్లెళ్లు వారి పిల్లలు వంటి వరుసలన్నీ ఈ జాబితాలో ఉన్నాయి. మీ ఉత్తరంలో మీ భర్త మీకు ఏ విధంగా బాబాయ్‌ వరుస అవుతారో చెప్పలేదు. ఒకవేళ మీది రక్త సంబంధం అయితే మీ వివాహం రద్దుచేయమని కోరుతూ కోర్టుని ఆశ్రయించాల్సి వస్తుంది.. మీ భర్త ఈ విషయంలో ఎలా స్పందిస్తారనేది కూడా ఈ సందర్భంగా ముఖ్యమే. ఆయనకు కూడా ఈ సంబంధం కొనసాగడం ఇష్టం లేకపోతే ఇద్దరూ కలిసి సెక్షన్‌ 13(బి) ఆఫ్‌ హిందూ వివాహచట్టం ప్రకారం విడాకులకు దరఖాస్తు చేసుకోండి. లేదా కేవలం దూరపు బంధుత్వమే కానీ రక్తసంబంధం లేదు అనుకున్నప్పుడు మీ ఇద్దరూ డాక్టర్‌ని సంప్రదించి పుట్టబోయే బిడ్డకు ఎలాంటి సమస్యలూ రావని వైద్య పరీక్షలు చేయించుకోండి. తరువాత మీ ఇరు కుటుంబాల అభ్యంతరాలను తీర్చండి. వారు అర్థంచేసుకోగలుగుతారు. దూరపు బంధుత్వమే అయినా ఆ వరుస తెలిశాక ఇద్దరిలోనూ తప్పు చేశామనే భావన ఉంటే విడాకులు తీసుకోవడమే మేలు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)