అక్రమ సంబంధాల భయంతో ప్రైవేటు డిటెక్టివ్ లను ఆశ్రయిస్తున్నా భార్యలు భర్తలు.. దీంతో విపరీతంగా పెరిగిపోతున్న డిటెక్టివ్ బిజినెస్

దేశంలో ఎవరి ఫోన్‌ డేటాను సేకరించవద్దని, అసలు ఫోన్‌ డేటానే కోరవద్దని, అలా చేసినట్లయితే సంఘంలో సభ్యత్వం రద్దవుతుందని ‘అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రైవేట్‌ డిటెక్టివ్స్‌ అండ్‌ ఇన్వెస్టిగేటర్స్‌–ఇండియా’ ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న తమ సభ్యులను హెచ్చరించింది. కాల్‌డేటా రికార్డులను అక్రమంగా సేకరించి వాటిని విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ముంబైలో ఇటీవల ప్రైవేట్‌ డిటెక్టివ్‌లను వరుసగా పోలీసులు అరెస్ట్‌ చేస్తున్న నేపథ్యంలో అసోసియేషన్‌ ఈ హెచ్చరిక జారీ చేసింది. దేశంలో తొలి మహిళా ప్రైవేటు డిటెక్టివ్‌ రజనీ పండిత్‌ను, కంగనా రనౌత్, నవాజుద్దీన్‌ సిద్ధికీ లాంటి బాలీవుడ్‌ తారలను క్లైంటులుగా కలిగిన లాయర్‌ రిజ్వాన్‌ సిద్ధికీని ఇవే ఆరోపణలపై పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే.

భారత దేశంలో ప్రైవేటు డిటెక్టివ్‌ వ్యవస్థ రోజు రోజుకు పుంజుకుంటోంది. ఏడాదికి 30 శాతం చొప్పున పెరుగుతోంది. 2020 నాటికి ఈ వ్యవస్థ 1700 కోట్ల రూపాయలకు చేరుకుంటుందన్నది ఓ అంచనా. దేశంలో పోలీసు వ్యవస్థతోపాటు పలు దర్యాప్తు సంస్థలు ఉన్నప్పటికీ ప్రైవేటు డిటెక్టివ్‌ల అవసరం ఎందుకు పెరుగుతోంది? ఈ డిటెక్టివ్‌లు టార్గెట్‌ వ్యక్తులను అనుసరించి వారు ఎక్కడెక్కడికి వెళుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వారి ఫోన్‌ కాల్స్‌ సమాచారాన్ని సేకరించడం నేరమా? వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌ సమాచారాన్ని వారి అనుమతి లేకుండా సేకరించడం మాత్రం చట్ట ప్రకారం నేరమే. క్రిమినల్‌ కేసుల్లో, అది డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి ఆదేశంతో పోలీసులు ఫోన్‌ కాల్స్‌ డేటాను సేకరించవచ్చు. ప్రైవేటు డిటెక్టివ్‌లకు ఆ అనుమతిలేదు. అయినా వారు తమ పలుకుబడిని ఉపయోగించి లేదా టెలికమ్‌ కంపెనీల ఉద్యోగులను ప్రలోభపెట్టి కాల్‌ డేటాను సేకరిస్తుంటారు.

ఎవరు, ఎవరితో మాట్లాడారు? ఎక్కడి నుంచి మాట్లాడారు? ఎంత సేపు మాట్లాడారు? ఎక్కడి నుంచి మాట్లాడారు? అన్న సమాచారం టెలికమ్‌ సంస్థల వద్ద రికార్డయి ఉంటుంది. సాధారణంగా పోలీసులు టేకప్‌ చేయని కేసులను ఈ ప్రైవేట్‌ డిటెక్టివ్‌లు టేకప్‌ చేస్తారు. భార్య లేదా భర్త ఎవరెవరితో తిరుగుతున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఎవరెవరితో మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో, వారి మధ్య అక్రమ సంబంధం ఉందా, లేదా? అన్న విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ మంది ప్రైవేటు డిటెక్టివ్‌లను ఆశ్రయిస్తారు. పెళ్లి చేసుకోబోయే యువకుడు లేదా యువతి నడతను తెలుసుకునేందుకు కూడా వీరు ఉపయోగపడుతున్నారు. కాలేజీ కెళుతున్న తమ పిల్లలు ఏ సమయానికి, ఏం చేస్తున్నారో, వారి స్నేహితులు ఎలాంటి వారు? వారికి చెడు అలవాట్లు ఏమైనా అబ్బాయా? అన్న అంశాలను తెలుసుకోవడానికి ఈ మధ్య తల్లిదండ్రులు తమ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని ముంబైలోని మరాఠా డిటెక్టివ్‌ ఏజెన్సీ అధిపతి జిగ్నేష్‌ ఛెడ తెలిపారు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో భాగస్వాములు ఏమైనా మోసం చేస్తున్నారా? ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారు? అన్న విషయాలతోపాటు వివిధ రకాల ప్రాజెక్టుల్లో ఎవరి ఎంత బిడ్డింగ్‌ వేస్తున్నారో కూపీ లాగడం కోసం కూడా డిటెక్టివ్‌ల సేవలను ఉపయోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. వ్యక్తులను ఫాలో అవడం, వారి ఫొటోలను తీయడం, వారి కాల్‌ డేటాను సేకరించడం చట్ట విరుద్ధం కాదా ? అని ప్రశ్నించగా, పోలీసులు టేకప్‌ చేయని కేసులే తమ వద్దకు వస్తాయని, ఆ కేసులను పరిష్కరించడంలో తాము ఈ పద్ధతులను అనుసరించక తప్పదని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఢిల్లీ డిటెక్టివ్‌ ఒకరు చెప్పారు. క్లైంట్‌ భార్య లేదా భర్తకు అక్రమ సంబంధం ఉందని రుజువు చేయాలంటే ఫొటోలు, వారి కాల్‌డేటా అవసరం అవుతుందని ఆయన అన్నారు. కొందరు కాబోయే భార్య లేదా భర్త మెడికల్‌ హిస్టరీని తెలుసుకునేందుకు కూడా వీరి సేవలను వాడుకుంటున్నారు.

దేశంలో ప్రైవేటు డిటెక్టివ్‌ల ఏజెన్సీలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 2007లో ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. అయితే దాన్ని ఇంతవరకు ఆమోదించకుండా పక్కన పడేసింది. పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా భారత్‌లో బలమైన ‘ప్రైవసీ’ చట్టాలు లేవుగానీ, ఉంటే డిటెక్టివ్‌ల ఏజెన్సీల మనుగడ ఉండేది కాదు. తమ ప్రొఫెషన్‌ను క్రమబద్ధీకరించేందుకు ఓ చట్టం ఉండాలని హైదరాబాద్‌లోని ‘థర్డ్‌ ఐ ఇన్వెస్టిగేషన్‌’ సీఈవో పీ. దామోదర్‌ అభిప్రాయపడ్డారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)