నరకకూపం నుంచి బయటపడేందుకు ఆమె పెద్ద పోరాటమే చేసింది.. 30 మందిని కాపాడింది.. మరో 50 మంది ఆ ఊబిలోకి వెళ్లకుండా ఆపగలిగింది

బాల్య వివాహం... అత్తారింట్లో వేధింపులు... వాటి నుంచి బయటపడాలని అయిదు నెలల పసిపాపతో పుట్టింటికి చేరడం... పరిచయస్తులే ఆమెను వంచించడం... సినిమాకని చెప్పి... వ్యభిచార గృహానికి అమ్మేయడం... ఇలా ఆమె జీవితంలో అన్నీ కష్టాలే. ఆ నరకకూపం నుంచి బయటపడేందుకు ఆమె పెద్ద పోరాటమే చేసింది. ఇప్పుడు తనలాంటివాళ్లను బయటపడేసేందుకు పోరాడుతోంది. అలా 30 మందిని కాపాడింది కూడా. మరో 50 మంది ఆ ఊబిలోకి వెళ్లకుండా ఆపగలిగింది. ఆమే అనంతపురం జిల్లా కదిరికి చెందిన కె.రమాదేవి మీడియా కి తెలిపిన సత్యాలు ఇవి.

పదమూడేళ్లకే నా పెళ్లి చేశారు. సంసారమంటే ఏంటో తెలియని వయసులో అత్తారింట్లో అడుగుపెట్టా. అక్కడకు వెళ్లింది మొదలు రోజూ వేధింపులే. ఆ పరిస్థితుల్లోనే గర్భం. పుట్టింటికి వెళ్లా. పాప పుట్టిన మూడు నెలల తరువాత అత్తింట్లో అడుగుపెట్టిన నాకు మళ్లీ నిరాశే. అవే వేధింపులు, సూటిపోటి మాటలు. ఇక అక్కడ ఉండలేనని నిర్ణయించుకుని పుట్టింటికి తిరిగొచ్చేశా. పూటగడవక అమ్మానాన్నలు ఉపాధి కోసం రాయచోటికి బయలుదేరారు. వారితో పాటు నేనూ. అక్కడే నా జీవితం పూర్తిగా తలకిందులైపోయింది. మా ఇంటికి దగ్గర్లోనే రమణమ్మ, సుబ్బలక్ష్మీ, నాగలక్ష్మీ అనే ముగ్గురు మహిళలు ఉండేవారు. నాతో చనువుగా, అభిమానంగా ఉండేవారు. అమ్మానాన్నలు లేని సమయం చూసి నాతో కబుర్లు చెప్పేవారు. ఒక రోజు సినిమాకని చెప్పి నన్ను, పుష్ప అనే మరో దివ్యాంగురాలైన అమ్మాయిని తీసుకెళ్లారు. హాల్లో మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చారు. కళ్లు తెరిచి చూసేసరికి ఏదో రైళ్లో ఉన్నాం. పూర్తిగా స్పృహ వచ్చేసరికి మహారాష్ట్రలోని భివండీలోని ఓ వ్యభిచార గృహంలో తేలాం. ఎక్కడ రాయచోటి? ఎక్కడ భివండీ? అసలు అక్కడికి ఎలా వెళ్లామో మాకే తెలియని అయోమయ స్థితి. గట్టిగా అడుగుదామంటే భాష రాదు. వారెవరో తెలియదు. కానీ రాయచోటిలో మమ్మల్ని సినిమాకు తీసుకెళ్లిన మహిళలే నన్ను, పుష్పను రూ.లక్షకు వ్యభిచార గృహానికి అమ్మారని అక్కడున్న తెలుగు మహిళల ద్వారా తెలుసుకోగలిగాం.
కళ్లల్లో కారం పెట్టారు... ఒక్కసారిగా మా శరీరాలు కంపించాయి. ఎలా బయటపడాలో అర్థం కాలేదు. ప్రయత్నించిన ప్రతిసారీ విఫలమయ్యాం. అసలు మా శరీరాల్ని అమ్మడానికి వాళ్లెవరూ... కొనడానికి వీళ్లెవరు... అనే ప్రశ్న నన్ను నిరంతరం వెంటాడేది. దాంతో నాలాగే అక్కడ నరకకూపంలో మగ్గిపోతున్న బాధిత మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశా. ఎలాగైనా అక్కడ నుంచి పారిపోదామని చెప్పా. ఈలోగా విషయం ఆ నిర్వాహకురాలికి తెలిసిపోయింది. దాంతో నా కాళ్లూ చేతులు కట్టేసి... కళ్లల్లో కారం ముద్దలు పెట్టారు. ఓ గదిలో బంధించేశారు. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా నరకయాతన చూపించారు. అయినా అక్కడి నుంచి బయటకు రావాలన్న నాలోని తపన చచ్చిపోలేదు సరికదా.. మరింత ఎక్కువైంది. ఎప్పటికప్పుడు నేను ప్రయత్నాలు చేయడం, అక్కడ ఉన్న మిగతావారూ నాతో చేతులు కలపడం... ఇదే పని. దాంతో తమ వ్యాపారం పోతుందన్న భయంతో నిర్వాహకులు నన్నూ, పుష్పను దాదాపు ఏడాది తరువాత అక్కడి నుంచి పంపించేశారు. అలా మా సొంతూరు వచ్చాం. తీరా వస్తే మా వారు రెండో పెళ్లి చేసుకున్నాడు. బిడ్డను దగ్గరకు తీసుకుంటే.. నువ్వెవరు? అని అడిగింది. అమ్మ అని అంటే... ఎప్పుడో చనిపోయిందని చెప్పింది. కన్నీళ్లు ఆగలేదు. ఊళ్లో అంతా నా చాటున ఏవేవో మాట్లాడుకునేవారు. విన్నప్పుడు ఎందుకు బతుకుతున్నానా అని అనిపించేది.
నాలాగా మరొకరు కాకూడదని... నా లాంటి కష్టాలు మరొకరు పడకూడదనుకున్నా. అందుకే వారిని చట్టానికి పట్టించాలనే ఆలోచనతో రెడ్స్‌ అనే ఎన్జీఓ సాయంతో... పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టా. మొదట పోలీసు అధికారులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఉన్నతాధికారులూ, మీడియా సాయం తీసుకున్నా. తీరా కేసు పెడితే ఉపసంహరించుకోమంటూ మహిళల అక్రమ రవాణా ముఠాల సభ్యులు బెదిరించేవారు. చివరకు న్యాయస్థానంలో న్యాయవాది కూడా ‘కూల్‌డ్రింక్‌లో కలిపిన మత్తుమందు తాగి అంతదూరం వెళ్లిపోయావంటే మేము నమ్మాలా...’ అని కూడా అన్నారు. నా స్థానంలో మీ కుమార్తె ఉంటే ఇలాగే అడుగుతారా... అని ఆయన్నే తిరిగి ప్రశ్నించా. చివరకు నేనే గెలిచా. దాదాపు ఐదేళ్ల తరువాత నన్ను భివండీలో అమ్మిన వారికీ, కొన్నవారికీ, వ్యభిచార గృహ నిర్వాహకులకు న్యాయస్థానం ఏడేళ్లు జైలు శిక్ష వేసింది. ఆ రోజు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు.
30 మందిని కాపాడా... భివండీ నుంచి నేనైతే వచ్చేశా. కానీ ఆ నరకకూపంలో మగ్గిపోతున్న వందల మంది మహిళల పరిస్థితి ఏమిటీ... అందుకే వారిని కాపాడేందుకు పోలీసులకు ఆ సమాచారమిచ్చా. ఇద్దరు అమ్మాయిల్ని అమ్మే మహిళలాగా బురఖా వేసుకుని భివండీలోని అదే వ్యభిచార గృహానికి వెళ్లా. లోపల సెల్‌ఫోన్‌ను ఆన్‌ చేసి పెట్టుకున్నా. బయట పోలీసులు ఉన్నారు. వ్యభిచార గృహ నిర్వాహకులతో సంభాషణ జరుపుతున్న సమయంలో అదును చూసి వచ్చి దాడి చేశారు. అక్కడున్న బాధిత మహిళలను కాపాడారు. అలా 30 మంది తెలుగు మహిళలను ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి రప్పించగలిగాను.
కుటుంబంతో ఆనందంగా... అక్రమ రవాణాకు గురయ్యానని నాలో నేను కుంగిపోలేదు. మరింత శక్తికూడగట్టుకున్నా. అందుకు కారణమైన వారికి శిక్షపడేలా పోరాడా. ఇవన్నీ గమనించిన నా భర్త నాకు మళ్లీ చేరువయ్యారు. చేయని తప్పునకు శిక్ష అనుభవించిన బాధితురాలిగా గుర్తించగలిగారు. ఇద్దరం కలిసి మళ్లీ కాపురం మొదలుపెట్టాం. గతం కంటే నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు మాకు ముగ్గురు పిల్లలు. అక్రమ రవాణా బారిన పడి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు కలిగారు. వారిని ఉన్నతంగా చదివించాలనేది నా లక్ష్యం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)