కల్తీ వ్యాపారుల వెన్నులో వణుకుపుట్టించిన ఈ IAS ఆఫీసర్ కి సెల్యూట్. ఇలాంటి అధికారులని మన తెలుగు ప్రభుత్వాలయితే ఉండనిస్తాయా ?

15 నెలలు అంటే, ఏడాదికన్నా మూడు నెలలు ఎక్కువ సమయం.. ఒక్క ఏడాదిలో ఒక రాష్ట్రంలో ఏ విషయంలో అయినా సమూలంగా మార్పులు తేవడం సాధ్యమా? దాదాపు అసాధ్యం అయిన ఈ అద్భుతాన్ని ఒక మహిళా IAS అధికారి సుసాధ్యం చేసి చూపారు. కేవలం 15 నెలల్లో కేరళ ప్రజల ఆహారం లో విప్లవాత్మక మార్పు తెచ్చారు.

2010 సివిల్స్ పరీక్షలలో జాతీయస్థాయిలో 4 వ ర్యాంక్ సాధించిన T.V అనుపమ, కేరళలో ఆహార కల్తీలపై ఉక్కుపాదం మోపారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న ఏడాది కాలంలో ఆరువేల ఆహార సాంపిల్స్ సేకరించి, పరీక్షలకి పంపడంతో పాటు, 750 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేయించారు. దీనితో కల్తీ వ్యాపారుల వెన్నులో వణుకుపుట్టింది. ఆహార కల్తీలు దాదాపుగా ఆగిపోయాయి. అంతేకాదు కూరగాయల్లో ప్రమాదకర స్థాయిలో పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని అనుపమ కనుక్కున్నారు. దాదాపు 300% అధికమోతాదులో పెస్టిసైడ్ అవశేషాలు ఉన్నాయని అనుపమ వెలుగులోకి తెచ్చారు.

కేవలం సమస్యలని హైలైట్ చేయడమే కాదు, పరిష్కారం దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు అనుపమ. కేరళ ప్రజలకి అవసరమైన కూరగాయల్లో 70% తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఈ రాష్ట్రాలలో కూరగాయల సాగులో క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడటంతో పాటు, కూరగాయలు మంచి రంగు రావడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి రసాయనాలు వాడుతున్నారు. అందుకే మన కూరగాయలు మనమే పండించుకుంటే ఆరోగ్యం బాగుండడంతో పాటు బోలెడు డబ్బు ఆదా అవుతుందని అనుపమ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు.

సోషల్ మీడియా ద్వారా అనుపమ చేసిన ఈ ప్రచారానికి అద్భుత స్పందన లభించింది. అనుపమ మొదలు పెట్టిన ఈ ప్రచారాన్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్ళింది. కూరగాయలు పండించేందుకు అవసరమైన విత్తనాలు, నార్లు(సాప్లింగ్స్) ఉచితంగా ఇవ్వడంతో పాటు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీపై అందించింది. దీనితో కేరళ ప్రజలు తమ ఇళ్ళ పెరడు, ఇంటి ముందున్న ఖాళీ స్థలాలలో కూరగాయలు పండించడం మొదలు పెట్టారు. ఈ మార్పు కేవలం కొన్ని వందలు, వేల మందిలో కాదు, లక్షల మందిలో ఈ మార్పు వచ్చింది.

ఒకప్పుడు 70% కూరగాయలు దిగుమతి చేసుకున్న కేరళ, ఇప్పుడు 70% కూరగాయలని సొంతంగా పండించుకుంటోంది. ఇది కేవలం 15 నెలలలో వచ్చిన మార్పు. మొక్కవోని దీక్షతో అనుపమ సాధించిన మార్పు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఆహార కల్తీలు భారీ స్థాయిలో ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అనేక సందర్భాలలో ఆహార కల్తీలపై ఆవేదన వ్యక్తం చేసారు. తెలుగు రాష్ట్రాల అధికారులు కూడా అనుపమని స్ఫూర్తిగా తీసుకుని కల్తీలపై ఉక్కుపాదం మోపాలని కోరుకుందాం.

కొసమెరుపు: సోషల్ మీడియా ద్వారా ఇంత పెద్ద మార్పు సాధించిన అనుపమ కి ట్విటర్ అకౌంట్ లేదు, పర్సనల్ ఫేస్ బుక్ పేజ్ లో యాక్టివ్ గా కూడా ఉండరు. కేవలం ప్రభుత్వ వెబ్ సైట్స్, ఫేస్ బుక్ పేజ్ లలో ఆసక్తికర సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేయడం ద్వారా ఆమె ఈ మార్పు సాధించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)