10 రూపాయలకే బిర్యానీ అందిస్తూ రోజుకి 2500 మంది ఆకలి తీరుస్తున్న మహానుభావుడు

ఘుమఘుమలాడే బిర్యానీ.. వేడివేడిగా పొగలు కక్కుతూ ఉండగానే అమ్మకం.. పరిశుభ్రమైన పళ్లెంలో.. మిలమిల మెరిసే మెరుపు కాగితంపై.. సన్న బియ్యంతో తయారు చేసిన వెజ్‌ బిర్యానీ.. ప్లాస్టిక్‌ స్పూన్‌.. ఉచితంగా పరిశుభ్రమైన తాగునీరు.. 15 ఏళ్లుగా తక్కువ ధరకే అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు షేక్‌ అలీం. పాతబస్తీలో నివాసం ఉంటున్న ఆయన ఇంటర్‌ వరకు చదువుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులు జోలికిపోలేదు. ఎవరి దగ్గరా కూలీగా పనిచేయడం ఆయనకు ఇష్టం లేదు. సొంతంగా జీవిస్తూ ఇతరులకు ఉపాధి చూపాలనే సంకల్పంతో చిరు వ్యాపారాన్ని ప్రారంభించారు. అఫ్జల్‌గంజ్‌ బస్టాండు ఆవరణలో రూ.5కే బిర్యానీ అమ్మేందుకు పదిహేనేళ్ల క్రితం దుకాణాన్ని తెరిచారు. ఆ ధరకే సుమారు పదేళ్లపాటు అమ్మకాలు సాగించారు. అన్నింటి ధరలు బాగా పెరగడంతోపాటు నాణ్యమైన బియ్యంతో బిర్యానీ సరఫరాను రూ.5కే చేయాలంటే సాధ్యం కావట్లేదని బిర్యానీ ధరను రూ.10 చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు అఫ్జల్‌గంజ్‌ బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులకు, సమీప వ్యాపారులకు, ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే రోగులతోపాటు వారి బంధువులకు తక్కువ ధరకే బిర్యానీ అందిస్తూ ఆకలిబాధలు తీరుస్తున్నారు. రోజుకు సుమారు 2,000 నుంచి 2,500 మంది వరకు ఇక్కడ కడుపు నింపుకొంటున్నారు. కొందరైతే పొట్లాలు కట్టించుకొని ఇళ్లకు తీసుకెళుతున్నారు.

ఒకమాదిరి హోటల్‌కి వెళ్లినా బిర్యానీ రూ.100 తక్కువ ఉండట్లేదు. అలాంటిది రూ.10కే బిర్యానీ అమ్ముతుంటే నాణ్యత ఉండదేమో అనే అనుమానం అందరికీ వస్తుంది. బిర్యానీకి ఉపయోగించిన సన్నబియ్యం, దుకాణం దగ్గర పరిసరాలు, వడ్డించే విధానం, వంటపాత్రలు, పరిశుభ్రంగా ఉన్న స్టీల్‌ కంచం, ప్లాస్టిక్‌ కాగితం, స్పూన్‌, ఉచితంగా శుభ్రమైన మంచినీరు... ఇవన్నీ చూస్తే ఆ అనుమానం పటాపంచలవుతుంది. నగరంలో ఏ హోటల్‌కి వెళ్లినా మంచినీటికే రూ.20 నుంచి రూ.30 తీసుకుంటున్న ఈ రోజుల్లో వెజ్‌ బిర్యానీ రూ.10కే వస్తుందంటే నమ్మకం కలుగదు. అందుకే ‘రూ.10కే బిర్యానీ’ అనే ప్రచార బోర్డులు కనిపిస్తుంటాయి. ఆ పరిసరాల్లోకి వెళ్లిన వారి అందరికీ బిర్యానీ సువాసన స్వాగతం పలుకుతుంది.

ఉస్మానియా ఆసుపత్రికి నిత్యం వందలాది నిరుపేదలు వస్తుంటారు. పాతబస్తీ, బేగంబజార్‌ పరిసర ప్రాంతాల్లో వందలాది దుకాణాల్లో చాలామంది తక్కువ వేతనానికే పని చేస్తున్నారు. వీరందరికీ తక్కువ ధరకే బిర్యానీ అందిస్తూ ఆకలి తీరుస్తున్నట్లు షేక్‌ అలీం వెల్లడించారు. తక్కువ లాభం వచ్చినా నిరుపేదల కడుపు నింపుతున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తక్కువ చదువుకోవడంతో ఎక్కడకు తిరిగినా ఉద్యోగం దక్కక పోవడంతో ఏదైనా సొంతంగా పనిచేసుకొని జీవనం సాగించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగి... చాలామంది నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నిత్యం వేలాది మందికి తక్కువ ధరకే ఆకలి తీరుస్తూ, మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్న అలీం ఆదర్శప్రాయుడని స్థానికులు కొనియాడుతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)