జీన్స్ ప్యాంటు వేసుకునే ఆడవాళ్ళ కడుపున నపుంసకులు పుడతారంట..

ఏయ్.., ఎవడ్రా వాడు..? ఏం కూశాడు..? మహిళలు జీన్స్ వేసుకుంటే నపుంసకులు పుడతారా..? ఎక్కడుంటాడో చెప్పు, కోసేయాలి వాడిని.. అనిపిస్తున్నదా..? ఈమధ్య అక్కడక్కడా బీజేపీ నేతలు, మంత్రులు ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు కదా, మళ్లీ ఎవరైనా ఇలా వాగాడేమో అని సందేహిస్తున్నారా…? ఇలా కూసిన వాడు… సారీ, ఇలా ప్రవచించినది డాక్టర్ రజిత్ కుమార్ అనే ఓ ప్రొఫెసర్…! అదేమిటీ..? ఓ ప్రొఫెసర్ ఐఉండీ, అంత చదువుకునీ, అంత మూర్ఖంగా ఎలా చెబుతున్నాడు..? మైండ్ ఏమన్నా ఖరాబయిందా..? లేదు, లేదు, తను నిక్షేపంలా ఉన్నాడు… అంతేనా..? కొన్ని సంవత్సరాలుగా ఆయన కేరళలో ‘ఆరోగ్య చైతన్య పాఠాల్ని’ బోధిస్తున్నాడు కూడా..! ‘నిజమే, నిజమే… తన వ్యాఖ్యలు ఛండాలంగా, నీచంగా ఉన్నాయి, మరీ ట్రాన్స్‌జెండర్లను, మానసిక వైకల్యం ఉన్న పిల్లల్ని, వాళ్ల జననాల్ని కూడా అవమానిస్తున్నట్టుగానే ఉన్నాయి’ అని కేరళ ప్రభుత్వం తనకు ఏయే చర్యల ద్వారా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తున్నది…
ఇదుగో, ఆ సారు ఈ సారు గారే… తన తలతిక్క వ్యాఖ్యలకు కాసర్‌గోడ్‌లో ఓ కౌన్సలింగు సెషన్‌లో మాట్లాడుతూ ఓ శాస్త్రీయ ప్రాతిపదికనూ చెప్పే ఓ పిచ్చి ప్రయత్నం కూడా చేశాడు… ‘సింపుల్… జీన్స్ ధరించడం ద్వారా, తమ స్త్రీత్వాన్ని తామే దిగజార్చుకోవడమే కారణం’ అంటాడు తను… ఇంకా తన అజ్ఞాన చీకట్లను మరింతగా వ్యాప్తి చేస్తూ… ‘పురుషుడిలాగా స్త్రీ వస్త్రధారణ చేయడం వల్ల… పుట్టే పిల్లలు కూడా ఈ ద్వంద్వ లక్షణాలను పుణికిపుచ్చుకుంటారు… అసలే కేరళలో 6 లక్షల మందికిపైగా ఇలాంటి వాళ్లు పుట్టారు’ అని వివరించాడు… అక్కడ ఈ బోధనలు విన్నవాళ్లు తెల్లమొహాలు వేశారు…

నిజానికి పుట్టుకతో ఎవరూ హిజ్రాలు కారు అనే బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది ఈ ప్రొఫెసర్‌కు..! పుట్టుక సమయంలో మేల్, ఫిమేల్… అంతే… సంపూర్ణ ఆడ, సంపూర్ణ మగ గాకుండా ఉభయలింగత్వం (Intersex) అనేవి చాలా అరుదైన కేసులు… సరే, ఈ చర్చలోకి ఇప్పుడెందుకు లెండి గానీ, నీ వ్యాఖ్యలు పొద్దుపోక చేస్తున్నవా..? ఏమైనా అధ్యయనమో, పరిశీలనో, పరిశోధనో చేశావా అని అడిగితే… ‘దీనికి పెద్ద అధ్యయనం అక్కర్లేదండీ… సంపూర్ణ మహిళగా, సంపూర్ణ పురుషుడిగా బతికే వాళ్లకు పిల్లలు మంచిగా పుడతారు… తమ పురుషత్వాన్ని దిగజార్చుకునే పురుషులు, స్త్రీత్వాన్ని దిగజార్చుకునే మహిళలకు ఇలాంటి వాళ్లు పుడతారు…’ అంటూ ఉల్టా అడిగినవారికే జ్ఞానబోధ చేస్తున్నాడు… విచ్చలవిడితనం ఉండే దంపతులకు ఆటిజం ఉన్న పిల్లలు పుడతారు అని మరో మైండ్ క్రాక్ వ్యాఖ్య కూడా చేశాడు… కొన్ని టీవీలు ఇవి ప్రసారం చేయడం మరో విషాదం…

అబ్బే, ఎవడో పిచ్చోడు ఏదో వాగితే దానికి ఇంత పెద్ద కథనం అవసరమా అని తేలికగా తీసుకోవద్దు సుమా… !ఈయన కొన్ని సంవత్సరాలుగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వాఫీసుల్లో చైతన్య సదస్సులు పెడుతున్నాడు… ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ప్రచారాలు చేస్తున్నాడు… అందుకే కేరళ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సి వచ్చింది… వైద్య, ఆరోగ్య మంత్రి కేకే శైలజ వెంటనే ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది… ఇకపై సదరు ప్రొఫెసర్ రజిత్‌ ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా నిషేధం విధించింది… ఇలాంటి నిర్హేతుకమైన, అశాస్త్రీయ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నందుకు చట్టపరంగా చర్యలు కూడా తీసుకోబోతున్నాం అని వివరించింది… గత వారం మాతృభూమి టీవీ చానెల్ తనను కూర్చోబెట్టి ఓ చాట్ షో నిర్వహించింది… నా వ్యాఖ్యలను నేను కట్టుబడే ఉన్నాను, అనేక అనుభవాల్ని పరిశీలించాక శాస్త్రీయ కోణంలోనే చెబుతున్నాను ఈ విషయాల్ని అంటూ వాదించాడు… ఈ షోలో తిరువనంతపురానికి చెందిన ఓ సైకియాట్రిస్టు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డు సభ్యులు శీతల్ శ్యాం, శ్రీమయి కూడా పాల్గొన్నారు… ఓ దశలో వీళ్లు సదరు ప్రొఫెసర్‌ను కొట్టినంత పనిచేశారు… వెంటనే సమాజానికి క్షమాపణ చెప్పు అనే డిమాండ్‌ను కొట్టిపారేసిన ఈయన ఇక సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నాడు… ఓ 7 నిమిషాల వీడియో పోస్టు చేస్తూ, నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు… కేరళలో పుట్టే ప్రతి పిల్లాడు ఆరోగ్యంగా పుట్టాలని, అలాగే పెరగాలని కోరుకోవడం తప్పా..? 4 గంటలపాటు షో నడిస్తే, అందులో కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించే కొన్ని పాయింట్లే ప్రసారం చేశారు… అంటూ ఎదురుదాడికి దిగాడు…! ద్యా వు డా…!!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)