నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా కరిగిపోయే మటన్‌ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ? నిప్పులపై కాల్చే పొట్టేలు మాంసాన్ని ఒక్కసారి రుచి చూస్తే..

కర్నూలు జిల్లా కోసిగిలో దొరికే నిప్పులపై కాల్చే పొట్టేలు మాంసాన్ని ఒక్కసారి రుచి చూస్తే చాలు మళ్లీ మర్చిపోలేరు. ప్రత్యేకమైన మసాలాతో తయారుచేసే ఈ వంటకాన్ని రుచి చూడ్డం కోసం మారుమూలన ఉన్న కోసిగికి కర్నూలు జిల్లావాసులతోపాటు కర్ణాటకలోని రాయచూర్‌, బళ్లారి, శిరుగుప్ప, మాన్వి, తెలంగాణలోని గద్వాల్‌ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారంటే ఆ రుచి ఎంతగా వెంటాడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క చుక్క కూడా నూనె వాడకుండా పచ్చి బొప్పాయి గుజ్జు, ఇతరత్రా సుగంధద్రవ్యాలతో తయారుచేసిన మసాలని ఈ వంటకం తయారీలో ఉపయోగిస్తారు. ఏటా వేసవికాలం ప్రారంభంలో వారం రోజులపాటు నిర్వహించే రేణుకా ఎల్లమ్మ జాతరలో ఈ కాల్చిన కడ్డీల మాంసాన్ని పెద్ద ఎత్తున్న విక్రయిస్తారు. సుమారు కోటి రూపాయల వరకూ వ్యాపారం జరుగుతుంది. గత పాతికేళ్లుగా జిల్లాలోని ఎమ్మిగనూరు, దేవనకొండ మండలం, ఈదలదేవరబండ, తెలంగాణలోని గద్వాల్‌ జిల్లా తుంగభద్ర తీరంలోని కొన్ని గ్రామాల్లో ఈ తరహ మాంసం లభిస్తుంది. కొందరైతే ఇక్కడ మాంసం తయారీని నేర్చుకుని బయటకు వెళ్లి దుకాణాలు ప్రారంభిస్తుంటారు.

తయారీ విధానం.. కిలో బొప్పాయి గుజ్జుకి 150 గ్రాముల ఎండు మిరపకాయలు, 50 గ్రాముల వెల్లుల్లి, 50 గ్రాముల అల్లం, 25 గ్రాముల శొంఠి, 10గ్రాముల సోంపు, 5 గ్రాముల లవంగాలు, 5 గ్రాముల దాల్చినచెక్క, 5 గ్రాముల యాలకులతో పాటు తగినంత ఉప్పు కలిపి ఈ మసాలాని తయారుచేస్తారట. పైన చెప్పిన పదార్థాలన్నింటిని రుబ్బురోలులో వేసి మెత్తగా రుబ్బుతారు. రుబ్బురోలులో చేసుకున్న ఈ మసాల ఎక్కువరోజులు నిల్వ ఉంటుంది.. మిక్సీలో చేసినదానికంటే ఎక్కువ రుచిగా ఉంటుంది.

ఇంట్లో చేసుకోవాలంటే... కిలో పొట్టేలు మాంసానికి నూరిన ఈ మాసాలాని 150గ్రాముల నుంచి 180 గ్రాముల వరకు పట్టించాలి. నూనె అవసరం ఉండదు. మసాలా పట్టించిన మాంసం ముక్కల్ని పావుగంటపాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మాంసం ముక్కలను ఇనుప కడ్డీకి గుచ్చుకోవాలి. ఈ కడ్డీలను నిప్పులపై ఉంచి ... నిప్పుల వేడిని బట్టి 20 నుంచి 30 నిమిషాలు కడ్డీలను చక్కని సెగపైన చుట్టూ తిప్పుతూ దగ్గరుండి కాల్చాలి. పూర్తిగా కాలిన తరువాత తక్కువ వేడిపై ఐదు నిమిషాలు మగ్గించాలి. ఇలా పూర్తిగా కాలిన మాంసం ముక్కలను కడ్డీల నుంచి తీసి ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో వడ్డించి ఇస్తారు. ఈ కాల్చిన మాంసం వేడి దాదాపు మూడు గంటల పాటు ఉండటం విశేషం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)