జగపతిబాబు తన నట విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి.. ఏదైనా ప్రత్యేక పాత్ర ఉన్నపుడు జగపతి వైపు చూస్తే బెటర్

తెలుగులోనే గొప్ప గొప్ప నటులున్నా.. మన దర్శక నిర్మాతలు మాత్రం పొరుగు భాషల వైపు చూస్తుంటారు. సరైన పాత్ర ఇవ్వాలే కానీ.. మన వాళ్లు కూడా అదరగొట్టేయగలరని అప్పుడప్పుడూ రుజువవుతుంటుంది. ఇందుకు కోట శ్రీనివాసరావు లాంటి వాళ్లు రుజువు. ఆయన ఇదే విషయంపై తరచుగా ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు జగపతిబాబును చూసినా ఈ విషయంపై మాట్లాడాలని అనిపిస్తుంది.  ‘రంగస్థలం’ సినిమాలో జగపతిబాబు నటనకు జనం ఫిదా అయిపోతున్నారు. ఆశ్చర్యపోతున్నారు. ప్రెసిడెంటు పాత్రలో జగపతిబాబు తన నట విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి. మామూలుగా ఇలాంటి పాత్రలకు వేరే భాషల వాళ్ల వైపే చూస్తుంటారు దర్శకులు. కానీ సుకుమార్ మాత్రం జగ్గూ భాయ్ మీద నమ్మకం పెట్టాడు.

విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక కొన్ని ప్రత్యేక పాత్రల్లో మెరిశాడు జగపతి. వాటిలో మరింత ప్రత్యేకంగా నిలిచిపోయేది ‘రంగస్థలం’లోని ప్రెసిడెంట్ పాత్ర. బాడీ లాంగ్వేజ్.. హావభావాలు.. డైలాగ్ డెలివరీ.. చివరికి చిన్న కదలికలోనూ వైవిద్యం చూపించి.. కొత్తగా కనిపించి.. చాలా ఆసక్తికరంగా ఆ పాత్రను పండించాడు జగపతిబాబు. సుకమార్ ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రథమార్ధంలో జగపతి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ద్వితీయార్ధంలోనూ ఈ పాత్రను సరిగ్గా ఉండి ఉంటే.. ఇది చరిత్రలో నిలిచిపోయే పాత్ర అయ్యుండేది. కానీ దీనికి ప్రాధాన్యం తగ్గించేశాడు. అయినప్పటికీ ఈ పాత్రను తక్కువ చేయలేం. జగపతి నటనను పొగడకుండా ఉండలేం. జగ్గూ భాయ్ రేంజ్ ఏంటో చెప్పడానికి ఈ పాత్ర మరో రుజువు. కాబట్టి మిగతా దర్శకులు కూడా కోలీవుడ్.. బాలీవుడ్ వైపు చూడకుండా ఏదైనా ప్రత్యేక పాత్ర ఉన్నపుడు జగపతి వైపు చూస్తే బెటర్.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)