చక్కగా 7 రోజుల్లో బరువు తగ్గిపోయి సన్నబడిపోవచ్చని ప్రాణాలే పోగొట్టుకున్నాడు

కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు ఊబకాయం తగ్గించుకునేందుకు లేహ్యం తిన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అస్వస్థతకు గురై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆవడి సమీపం అయ్యపాక్కంలో నివసిస్తున్న ప్రదీప్ కుమార్‌ (27) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. కొంతకాలంగా అతడు ఊబకాయంతో అవస్థలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగు రోజులకు ముందు అయ్యపాక్కంలో రోడ్డు పక్కగా నాటు మందుల వ్యాపారం చేస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లి బరువు తగ్గేందుకు మందులు కావాలని కోరాడు.

అతడు తన వద్దనున్న లేహ్యాన్ని వాడితే వారంలోపు సన్నబడతారని తెలిపాడు. ప్రదీప్ వారానికి సరిపడా లేహ్యపు వుండలు తీసుకుని ఇంటికి వెళ్లాడు. రాత్రి ఓ లేహ్యపు వుంటను మింగి నిద్రించాడు. కాసేపటికల్లా అతడు వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే కుటుంబీకులు అతడిని అంబత్తూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రోజంతా ఆ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుని ఇంటికి చేరుకున్నాడు.

మరుసటి రోజు ప్రదీప్‌కు వాంతులకు తోడు విరేచనాలు కూడా అధికమై సొమ్మసిల్లిపడ్డాడు. వెంటనే అతడిని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని లేహ్యం అమ్మిన రోడ్‌సైడ్‌ వ్యాపారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)