మొదట ఒప్పుకోలేదు కానీ అతను చూపించే ప్రేమకి పడిపోయాను.. కొన్నాళ్లకి శారీరకంగా తొందరపడ్డా...

ప్రశ్న:- నేను ఎంబీఏ చదువుతున్నా. మా సీనియర్‌ ఒకతను నేను కోర్సులో చేరిన కొత్తల్లోనే నాకు ప్రపోజ్‌ చేశాడు. మొదట ఒప్పుకోలేదు కానీ.. అతడిని గమనించడం మొదలుపెట్టా. ఈ క్రమంలో అతడి కేరింగ్‌, మాటతీరు నచ్చాయి. అచ్చంగా మా అమ్మానాన్నలు చూసుకున్నట్టే బాధ్యతగా ఉంటున్నాడు అనిపించి ప్రేమకి ఓకే చెప్పేశా. కొన్నాళ్లకి మానసికంగానే కాదు శారీరకంగానూ దగ్గరయ్యాడు. ప్రేమతో నేనూ కాదనలేదు. ఆ తరువాత అతని ఆలోచనా విధానమే మారిపోయింది. తనతో తప్ప మిగతా మగవారితో మాట్లాడినా ఒప్పుకోడు. చివరికి మా బంధువుల్నీ దూరం పెట్టేలా చేశాడు. వాళ్ల ఫంక్షన్లకి వెళ్లినా గొడవ చేయడం మొదలుపెట్టాడు. ఒకవేళ వెళ్లాలనుకున్నా... బతిమాలి అనుమతి తీసుకోవాలని కోరుకుంటాడు. రాన్రాను అతని ప్రవర్తన వికృతంగా మారుతోంది. వదిలేద్దామనిపిస్తుంది.. అదే సమయంలో అతనితో సన్నిహితంగా ఉన్నందుకు అపరాధ భావం కలుగుతోంది. చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాను. - ఓ సోదరి

జవాబు:- మీరెంత మానసికంగా నలిగిపోతున్నారో మీ ఉత్తరమే సూచిస్తోంది. ప్రేమించడం ఎప్పుడూ తప్పుకాదు. కానీ ముందూ వెనకా ఆలోచించకుండా.. హద్దులు తెలియకుండా అడుగులు వేసినప్పుడే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. మీరు మొదట అతనిలో ఏ లక్షణాలను చూసి ప్రేమలో పడ్డారో ఇప్పుడు అవే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొదట్లో మీమీద పూర్తి హక్కు రాలేదు. ఎప్పుడైతే ప్రేమలో హద్దుల్ని చెరిపేశారో అప్పుడే ఈ అమ్మాయి నా ఒక్కడికే సొంతం అనే పొసెసివ్‌ భావజాలాన్ని అతను పెంచుకున్నట్టు అర్థమవుతోంది. అంటే సాన్నిహిత్యం పెరిగాక మీ పట్ల అధికార ధోరణిని అతనే పెంచుకున్నాడు. అందుకే మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మిమ్మల్ని కమాండ్‌ చేస్తున్నాడు.

మీరు ఈ సమస్య పట్ల ఓ స్పష్టత తెచ్చుకోండి. అతడి వల్ల ఏ విషయంలో ఇబ్బంది కలుగుతోందో వివరించండి. మీరెంత బాధపడుతున్నారో కళ్లకి కట్టండి. మీరు ప్రేమా, పెళ్లి, భవిష్యత్తు విషయంలో ఎలాంటి అందమైన కలలు కన్నారో చెప్పండి. వాస్తవంలో అతని తీరు ఎంత వేదనాభరితంగా ఉందో అర్థమయ్యేలా చెప్పండి. ఒకవేళ అతను ఎంత చెప్పినా మారకపోతే బీటలు వారిన మీ బంధం మరింత సమస్యాత్మకంగా మారిపోతుందని తెలియజేయండి. పెళ్లికి ముందే ఉక్కిరిబిక్కిరి అవుతూ.. అతనికి చేరువుగా ఉండాల్సిన పరిస్థితిని మనసు అంగీకరించట్లేదనే విషయమూ తనకి అర్థం కావాలి. పొసెసివ్‌ లవ్‌ అనేది కథల్లోనో, సినిమాల్లోనో చూడ్డానికి ఆసక్తిగా ఉంటుంది కానీ వాస్తవ జీవితంలో బాధపెడుతుందని స్పష్టం చేయండి. ఇప్పటికైనా ఏం కాదు... మీరు మీ స్వేచ్ఛని కాపాడుకునే ప్రయత్నం చేయండి.

పెళ్లికి ముందే ఇన్ని ఆంక్షలు ఉంటే.. ఆ తరవాత ఇంకెలా ఉంటాడో ఆలోచించుకోండి. మనసును దృఢంగా ఉంచుకోండి. అన్ని తట్టుకునే శక్తీ, ఆత్మవిశ్వాసం సొంతం చేసుకోండి. జీవితంలో ఇదొక చిన్న విషయంగానే తీసుకోండి. మీకింకా చాలా భవిష్యత్తు ఉంది. విద్యార్థిని అయిన మీరు ఇప్పుడు చదువుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం. ఆ తరవాత ఉద్యోగం, లక్ష్యాల దిశగా అడుగులు వేయడానికి ప్రణాళిక వేసుకోండి. మీ గురించి మీరు ఆలోచించేంత తీరిక లేకుండా చూసుకోండి. దాంతో తప్పు చేశాననే అపరాధభావం వంటివి దరి చేరకుండా ఉంటాయి. అన్ని విషయాల్లో రాణిస్తుంటే అందరూ మిమ్మల్ని గౌరవంగా చూస్తారు. కేవలం మీరు జీవితంలో స్థిరపడ్డాకే అప్పటి పరిస్థితిని బట్టి పెళ్లి నిర్ణయం తీసుకోవడం మంచిది. కొంత కాలం ప్రేమా, పెళ్లి గురించిన ఆలోచనలు పక్కన పెట్టండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)