రోజుల తరబడి ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వాటిని వేడిచేసి విక్రయిస్తున్నారన్న భయంకర నిజం చాలా మందికి తెలియదు.

కర్రీ పాయింట్లలో రోజు రోజుకూ శుచీ శుభ్రత కనుమరుగవుతోంది. వంట చేసుకునే సమయంలేని ఉద్యోగులు, బ్యాచిలర్లకు ఉపయోగకరంగా ఉన్న ఈ కేంద్రాల్లో చాలామటుకు లాభార్జనే ధ్యేయంగా మారి అనారోగ్యాన్ని పంచుతున్నాయి. వ్యాపారులు మిగిలిన ఆహారాన్ని రోజుల తరబడి ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వాటిని వేడిచేసి విక్రయిస్తున్నారన్న భయంకర నిజం చాలా మందికి తెలియదు. కస్టమర్లకు తాజాగా ఉన్నట్లు నమ్మించేందుకు రుచి కోసం నూనెలు, కారం మసాలాలు దట్టించి వండి విక్రయిస్తున్నారు. చాలా కేంద్రాల్లో ఇలాంటి తంతు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొనేటప్పుడు ఉన్న వాసన తినేటప్పుడు ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. ఇది కూడా ఆ కర్రీ తాజాది కాదనడానికి ఓ ఇండికేషన్ గా ఆహార నియంత్రణా అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్ మహా నగరం సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి చిన్న పట్టణంలో కూడా గల్లీ గల్లీకి కర్రీ పాయింట్లు కొదవ లేదు. కొద్ది పాటి పెట్టుబడితోనే ఏరోజు సంపాదన ఆరోజే ఉంటుండడంతో చాలామంది ఈ వ్యాపారం నిర్వహించేందుకు ముందుకొస్తున్నారు. కష్టపడి పనిచేసుకుని సంపాదించుకుంటే తప్పులేదు. అందరూ లాభార్జనే ధ్యేయంగా నిల్వ ఉన్న కర్రీస్ ను అమ్ముతున్నారని కూడా చెప్పడం లేదు. కాని చాలా మంది తినేది మనం కాదు కదా… అన్నట్టుగా కూరలను అమ్మకాలు సాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం శుచి శుభ్రత పాటిస్తూ వ్యాపారం నిర్వహిస్తున్న కేంద్రాలు వందల సంఖ్యలో ఉంటే నిబంధనలను గాలికి వదిలివేసినవి వేలల్లోనే ఉంటాయని ఫుడ్ ఇన్ స్పెక్టర్లు మీడియా ప్రతినిధులకు వెల్లడించే పచ్చినిజం. వండిన ఆహార పదార్థాలపై ఎలాంటి మూతలు పెట్టకపోవడంతో ఈగలు దోమలు ముసురుతున్నా వాటినే విక్రయిస్తున్నారు. అంతేకాదు..

వంటలు చేసే కిచెన్‌ల నుంచి మొదలుకుని కర్రీలను విక్రయించే షాపుల వరకు ఎలాంటి పరిశుభ్రతను పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంట చేసే వారు మొదలుకుని కర్రీలను ప్యాకెట్ల కట్టి ఇచ్చే వారి వరకు వ్యక్తిగత శుభ్రత పాటించడం లేదు. కారుతున్న చెమటలు తుడుచుకుని అవే చేతులతో కూరలు కట్టి ఇస్తున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. వండిన పాత్రలను సక్రమంగా శుభ్రం చేయకుండా వాటిల్లోనే వంట చేస్తున్నారు.

మాంసాన్ని పారవేయకుండా మిగిలిన మాంసం ముక్కలను మరుసటి రోజు విక్రయించేందుకు అదేరోజు తయారు చేసిన సూప్‌ను వేడి వేడిగా మిగిలిన మాంసంతో కలిపి ఫ్రెష్‌గా ఉన్న కర్రీలా వినియోగదారులను భ్రమింప చేస్తున్నారు. వంట కోసం బోరు, రోజుల తరబడి నిల్వ ఉంచిన నీటిని ఉపయోగిస్తున్నారు.

కర్రీ పాయింట్లలో రుచి కోసం ఆరోగ్యానికి హాని కరిగించే మసాలాలు, నూనెలు, రసాయన రంగులు, కారం అధిక మొత్తంలో వాడుతున్నారని కొందరు మహిళలు, భోజన ప్రియులు ఆరోపిస్తున్నారు. మాంసాహారంలో అయితే ఈ పరిమాణం మోతాదుకు మించి ఉంటోందంటున్నారు. తరచూ ఇలాంటి కర్రీలను తింటున్న కస్టమర్లు కొందరు వారికి తెలయకుండానే జీర్ణకోశ వ్యాధుల బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నారని డాక్టర్లు అంటున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)