ముఖ్యమైన సమాచారం మరియు జాగ్రతలు :- ఆన్ లైన్ లో పేమెంట్ చేసేటప్పుడు చివరలో " s " ఉందో లేదో చూసుకోండి.. గ్రీన్ కలర్ లో ఉంటేనే పేమెంట్ చేయండి

ఆయన భారతదేశానికి ప్రభుత్వం నియమించిన సైబర్‌ సెక్యూరిటీ చీఫ్‌.. ‘నేను అసలు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వాడను, అత్యవసరమైతే 25 వేలు రూపాయలు వేరే బ్యాంక్‌ ఎకౌంట్‌ లో వేసుకొని డెబిట్‌ కార్డు మాత్రమే వాడతాను’ అని ఇటీవల సెలవిచ్చారు. ఏకంగా సైబర్‌ సెక్యూరిటీ కీలకమైన అధికారిగా ఉన్న అలాంటి వ్యక్తే అంతగా భయపడుతున్నారంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? మన లాంటివాళ్ళు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యుపిఐ చెల్లింపులు ఎలాంటి భయాలు లేకుండా చేసుకోగలిగిన సురక్షితమైన వాతావరణం అసలు మన దేశంలో వుందా? ఇలాంటి సందేహాలు ప్రతీ ఒక్కరికి తలెత్తున్నాయి.

అధికశాతం ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌లు ఫిషింగ్‌ అటాక్‌ల వల్ల తలెత్తుతున్నాయి. బ్యాంకులు పంపించినట్లు మీ మెయిల్‌ ద్వారానూ, ఎస్‌ఎంఎస్‌ల ద్వారానూ కొన్ని లింకులు వస్తాయి. మీ క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతున్నామనీ, లేదా మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ సెక్యూరిటీ వెరిఫై చేస్తున్నామని ఈ లింక్‌ క్లిక్‌ చేసి వెంటనే మీ ఎకౌంట్‌ నిర్ధారించుకోమనీ ఇలా వచ్చే మెసేజ్లకు వెనకా ముందు ఆలోచించకుండా చాలామంది స్పందిస్తుంటారు. లింకు క్లిక్‌ చేసిన వెంటనే స్ర్కీన్‌ మీద ప్రత్యక్షమయ్యే వెబ్‌సైట్‌ మీ బ్యాంక్‌కి సంబంధించిన వెబ్‌ సైటు మాదిరిగానే ఉంటుంది. మీ డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లు టైప్‌ చేయడం ఆలస్యం స్ర్కీన్‌ మీద ఓ ఎర్రర్‌ మెసేజ్‌ చూపించబడి అంతటితో నిలిచిపోతుంది. పైకి మనకు కనిపించేది అదే, కానీ మనకు తెలియకుండానే మనం ఎంటర్‌ చేసిన వివరాలు మొత్తం హ్యాకర్‌కి చేర్చబడతాయి. దీంతో కొన్ని రోజుల తర్వాత మన అకౌంట్‌ లో బ్యాలెన్స్‌, క్రెడిట్‌ కార్డు లిమిట్‌ ఖాళీ అయిపోతుంది. అందుకే మెయిల్స్‌కు వచ్చే అన్ని లింకులను గుడ్డిగా క్లిక్‌ చేయకూడదు.

ఆఫర్ల పేరిట - ఈమధ్య పలురకాల ఆఫర్ల పేరిట వాట్సప్‌లోనూ, ఫేస్‌బుక్‌లోనూ అనేక లింకులు షేర్‌ అవుతున్నాయి. కేవలం 10 రూపాయలు చెల్లిస్తే ఫలానా డిటిహెచ్‌ సర్వీస్‌ జీవితాంతం అన్‌లిమిటెడ్‌ ఛానల్స్‌ చూడొచ్చు అని ఓ మెసేజ్‌ ఓ లింక్‌ చూపిస్తుంది. చాలామంది ఆశపడి వెంటనే ఓపెన్‌ చేసి పేమెంట్‌ చేద్దామని చూస్తే మన డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ఎంటర్‌ చేయమని కన్పిస్తుంది. 10 రూపాయలు ఖర్చుపెడుతున్నామన్న ఆలోచనలో మాత్రమే చాలామంది ఉంటారు తప్పించి అది పేమెంట్‌ గేట్‌వే కాదనీ, తాము ఎంటర్‌ చేసే వివరాలు హ్యాకర్లకి చేర్చబడుతుంటాయని గ్రహించేవారు చాలా తక్కువమంది. ఇలాంటివే చాలా రకాల ప్రలోభాలు.. వెయ్యి రూపాయలకే ఐఫోన్‌ వస్తోందనీ.. తక్కువ ధరకే రేబాన్‌ గ్లాసులనీ ఇలా ఏది పడితే అది చెబుతూ ఉంటారు. మీ కార్డుల వివరాలు తస్కరించి, అకౌంట్లు ఖాళీ చేయడానికి వేసే ఎత్తుగడ ఇది. ఇలాంటి ఆఫర్లు నమ్మకండి, మీ మిత్రులకు షేర్‌ చేయకండి.

ఎన్‌క్రిప్టెడ్‌ పేజీనా కాదా ? - ఒక బిల్లు చెల్లించడానికి కావచ్చు, మొబైల్‌ రీఛార్జి చేయటానికి కావొచ్చు, ఇంక వేరే ఏదైనా అవసరానికి డబ్బులు చెల్లించాల్సి వచ్చినప్పుడు మీరు పేమెంట్‌ చేసే పేజీ హెచ్‌టిటిపిఎస్‌ అని చివర్లో ‘ఎస్‌’ అనే అక్షరం ఉండేలా, అదికూడా రెడ్‌ కలర్‌లో కాకుండా మొత్తం గ్రీన్‌ కలర్‌లో ఉండేలా జాగ్రత్త వహించండి. మామూలు హెచ్‌టిటిపి పేజీల ద్వారా మీరు చేసే చెల్లింపులు, సర్వర్‌కి పంపించే డేటా ‘మేన్‌ ఇన్‌ మిడిల్‌ అటాక్‌’ అని పిలవబడే పాకెట్‌ స్నిఫ్ఫింగ్‌ వంటి పద్ధతుల ద్వారా హ్యాకర్ల చేత దొంగిలించబడతాయి. ఆర్థికపరమైన లావాదేవీలు చేసేటప్పుడు వెబ్‌సైట్‌ అడ్రస్‌బార్‌పై ఓ కన్నేసి ఉంచడం తప్పనిసరి.

అంతర్జాతీయ లావాదేవీలు - తమకు తెలియకుండానే అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి భారీ మొత్తంలో క్రెడిట్‌ కార్డు లావాదేవీలు జరుగుతున్నాయని ఈ మధ్య కాలంలో చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం, ఓటిపి అవసరం లేకపోవడం. అవును, మీరు బయట ఎక్కడైనా రెస్టారెంట్లకు, పెట్రోల్‌ బంకులకు వెళ్లినప్పుడు బిల్‌ తీసుకురమ్మని క్రెడిట్‌ కార్డును అక్కడ ఉండే సర్వర్‌కి ఇస్తుంటారు. కొన్ని కార్డ్‌ క్లోనింగ్‌ ముఠాలు దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు ఇన్ని కార్డుల డేటా సేకరిస్తే ఇంత మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపి మన క్రెడిట్‌ కార్డుల డేటా తస్కరించడానికి స్కెచ్‌ వేస్తున్నారు. ఇండియాలో జరిగే లావాదేవీలకైతే ఓటిపి అవసరమవుతుంది గానీ అంతర్జాతీయ లావాదేవీల విషయంలో అలాంటిది ఏదీ అవసరం లేదు. కేవలం మీ క్రెడిట్‌ కార్డు నెంబరు, దాని ఎక్స్‌పయిరీ డేట్‌, కార్డు మీద ఉన్న పేరు, సివివి నెంబర్‌ ఉంటే సరిపోతుంది. ఇక ఓటిపి పనిలేకుండా ప్రపంచంలో ఎక్కడ నుండైనా మీ క్రెడిట్‌ కార్డు మీద అంతర్జాతీయ లావాదేవీలు చేయటానికి అవకాశముంటుంది. కాబట్టి మీరు అర్జంటుగా చేయవలసిన పని మీ క్రెడిట్‌ కార్డు వెనుక భాగంలో చివర్లో రాయబడి ఉన్న సివివి నెంబర్‌ని కొట్టివేయడం. అలాగే బయట ఇతరులకు మీ కార్డు చేతికిచ్చి ఆ సివివి నెంబర్‌ చెప్పకుండా ఉండడం. మనం నేరుగా ఇలా ఫిజికల్‌గా మాత్రమే కాదు, ఆన్‌లైన్‌లో కూడా ఇలాంటి సమాచారాన్ని ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సైట్లో పడితే ఆ సైట్లో ఈ అతి ముఖ్యమైన సమాచారం ఇచ్చామంటే గనుక మన డబ్బులు గోవిందా!

ప్లెయిన్‌ టెక్ట్స్‌లో - ఇప్పటికీ చాలామంది తమ పాస్‌వర్డ్‌లు,, డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలు తమకు తాము మెయిల్‌ పంపించుకోవడం ద్వారాగానీ, లేదా తమ ఫోన్లో ప్లెయిన్‌ టెక్ట్స్‌ గానీ సేవ్‌ చేసుకుంటూ ఉంటారు. అవసరమైనప్పుడు సులభంగా అందుబాటులో ఉంటాయి అన్నది వీరి భావన. అయితే ప్రతిరోజూ మనం కొత్తగా ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసే పలు రకాల అప్లికేషన్లు మన ఫోన్‌ స్టోరేజ్‌ పర్మిషన్‌ కోరుతూ ఉంటాయి. ఇలా ఏదైనా ప్రమాదకరమైన అప్లికేషన్‌కి మీరు పర్మిషన్‌ ఇచ్చారంటే, అది మీ ఫోన్లో భద్రపరచుకున్న యూజర్‌నేమ్‌ పాస్‌వర్డ్‌లు, క్రెడిట్‌ కార్డు నంబర్లు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలు అన్నింటినీ హ్యాకర్లకి చేరవేస్తూ ఉంటుంది. దాంతో అవి దుర్వినియోగం చేయబడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకూ ఫోన్లోనూ, మెయిల్‌ మెసేజ్‌లలోనూ ముఖ్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రపరచుకోకండి. ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని స్టోర్‌ చేసుకోవాలంటే లాస్ట్‌పాస్‌ వంటి ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ మేనేజర్‌ అప్లికేషన్లను ప్రయత్నించడం మంచిది. అవి ఎన్‌క్రిప్ర్టెడ్‌ పద్ధతిలో మీ డేటాని సురక్షితంగా భద్రపరుస్తాయి. మన ముఖ్యమైన డేటాని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఎప్పుడూ మనదే. మనం అశ్రద్ధ చేస్తే గనుక ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

వీటితోపాటు కుకీలను దొంగిలించటం, సెషన్‌ హైజాకింగ్‌, కార్డ్‌ స్కిమ్మింగ్‌ వంటి ఎన్నో రకాల పద్ధతులు మన బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేయడం కోసం వాడబడుతున్నాయి. కీలకమైన ఆర్థిక లావాదేవీలు చేసే తమ ఫోన్లలో ఇప్పటికీ చాలామంది పైరేటెడ్‌, అశ్లీల సమాచారం ఉన్న వెబ్‌సైట్లను ఓపెన్‌ చేస్తున్నారు. వాటిలో అంతర్గతంగా పొందుపరచబడే ప్రమాదకరమైన స్ర్కిప్ట్‌లు మన కీలకమైన డేటాని సేకరించి వారికి వారు స్వయంగా వాడుకోవడం గానీ, లేదా డార్క్‌వెబ్‌ వంటి ప్రదేశాల్లో విచ్చలవిడిగా అమ్మేయడం గానీ చేస్తుంటారు. కాబట్టి ఆన్‌లైన్‌ లావాదేవీలు డివైజ్‌లను నిరంతరం సెక్యూర్డ్‌గా ఉంచుకోవటం మన బాధ్యత. తప్పనిసరిగా శక్తివంతమైన యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. అలాగని యాంటీవైరస్‌ ఒకటే మిమ్మల్ని పూర్తిగా రక్షించలేదు. పైన చెప్పుకున్న అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే మీరు సేఫ్‌ అని గుర్తుంచుకోండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)