భార్య లేని లోకంలో ఉండలేనని.. అంత్యక్రియలు చేసొచ్చి భర్త ఆత్మహత్య

పోలీసు కుటుంబాలకు చెందిన వారిద్దరికీ రెండేళ్ల కిందటే వైభవంగా వివాహం జరిగింది. ఒకరంటే మరొకరి ఎనలేని ప్రేమ. ఆ అన్యోన్న కాపురంలో పిల్లలు కలగలేదనే చిన్న కారణం చిచ్చు రేపింది. ఇరుగుపొరుగువారి సూటిపోటి మాటలకు కలత చెంది ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియలు పూర్తి చేసిన కొద్ది గంటలకే అతడు కూడా ఉరేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదం మహబూబ్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది.

మహబూబ్ నగర్‌లోని పాత పాలమూరుకు చెందిన రవి (27) ఎస్పీ కార్యాలయంలో ఫింగర్‌ ప్రింట్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. రవి తండ్రి హెడ్‌కానిస్టేబుల్‌. అదే పట్టణానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ ఆంజనేయులు కూతురు రజితతో రవికి రెండేళ్ల కిందట పెళ్లి జరిగింది. బీటెక్ చేసిన రజిత జీవితంలో స్థిరపడ్డ తర్వాతే పిల్లల్ని కనాలని భావించింది. కానీ, ఇరుగుపొరుగువారు, బంధువుల మాటలతో తీవ్రంగా కలత చెందింది.

పిల్లలు కలగడం లేదనే మనస్థాపం, ఇరుగుపొరుగు వారి మాటలకు మనస్తాపం చెందిన రజిత గురువారం (మార్చి 22) ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూనే భార్యకు తలకొరివి పెట్టి ఇంటికొచ్చిన రవి రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు.

కుటుంబ సభ్యులతో పాటు రాత్రి బాగా పొద్దుపోయేవరకూ రవి మెలకువతోనే ఉన్నాడు. అనంతరం ఇంట్లో పైఅంతస్తు గదిలో సోదరుడితో కలిసి పడుకున్నాడు. సోదరుడు నిద్రలోకి జారుకున్న కొద్ది సేపటికే, శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించాడు. కూతురు, కొడుకును కోల్పోయిన ఆ రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)