తండ్రి మరణించడంతో తాపీ పనికి వెళ్ళాడు.. పట్టు వదలకుండా చదివి రాష్ట్ర స్థాయిలో 29వ స్థానంలో నిలిచి DSP (డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌) అయ్యాడు

కుటుంబ కష్టాలను గట్టెక్కించడానికి చదువుకు స్వస్తిచెప్పి భవననిర్మాణ పనికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందించిన సహకారంతో మళ్లీ చదువును పట్టాలెక్కించాడు. తాను చిన్న ఉద్యోగిగా ఉంటే అంధుడైన కుమారుడి భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయం అతన్ని వెంటాడింది. గ్రూపు-1 లక్ష్యంగా ఎంచుకున్నాడు. రెండేళ్లపాటు భార్యా పిల్లలకు దూరమై అహర్నిశలూ శ్రమించాడు. తొలి ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించిన గ్రూపు-1 (ఎస్‌.సి.) జాబితాలో సునీల్‌ రెండో స్థానంలో, రాష్ట్ర స్థాయిలో 29వ స్థానంలో నిలిచాడు. డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ కాబోతున్నాడు.

కూలీ కుటుంబానికి చెందిన సునీల్‌(28) స్వస్థలం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బూధవాడ. బూడిద కొండ, రాహేల్‌ల పెద్దకుమారుడైన సునీల్‌ ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేశాడు. పదో తరగతిలో 548, ఇంటర్‌(బైపీసీ)లో 95% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. డిగ్రీలో చేరే సమయంలో తండ్రి మరణించడంతో చదువుకు స్వస్తిపలికి భవన నిర్మాణాల పనికెళ్లాడు. కూలిపనితో కుటుంబాన్ని పోషిస్తున్న తల్లి ఇచ్చిన భరోసాతో 2007లో 87% మార్కులతో డిగ్రీ పూర్తిచేశాడు. అనంతరం ఓ సిమెంట్‌ కంపెనీలో కెమిస్ట్‌గా ఉద్యోగంలో చేరాడు. శ్యామలను వివాహం చేసుకున్నాడు. ప్రథమ సంతానం రాహుల్‌ పుట్టుకతో అంధుడు కావడంతో సునీల్‌ కుటుంబం వేదనకు గురైంది. చిన్నవేతనంతో కుటుంబానికి..ముఖ్యంగా రాహుల్‌కు న్యాయం చేయలేనన్న బాధ సివిల్స్‌పై దృష్టిపెట్టేలా చేసిందని మీడియాతో పేర్కొన్నాడు.

‘స్నేహితుడు నరసింహారావు అండతో హైదరాబాద్‌కు పయనమై ఓ శిక్షణ కేంద్రంలో చేరా. పలు శిక్షణ కేంద్రాల్లో పార్ట్‌టైమ్‌గా రీజనింగ్‌ బోధిస్తూ అవసరాలను తీర్చుకున్నా. స్వీయసాధనతో సబ్జెక్టుపై పట్టుసాధించా. వార్త పత్రికలు చదువుతూ, టీవీలో వచ్చే చర్చా వేదికలను వింటూ సొంతంగా నోట్స్‌ను తయారుచేసుకున్నా. చరిత్ర, రాజనీతి శాస్త్రాల్లోని అంశాలను సమగ్రంగా చదివా. గ్రూపు-2 ప్రధాన పరీక్షలో వెనుకబడినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. శిక్షణకు ఫీజు చెల్లించడంతోపాటు నా స్నేహితుడు నాకోసం బ్యాంకు ఉద్యోగాన్ని హైదరాబాద్‌ బదిలీ చేయించుకున్నాడు. వాడి ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించా. మా అమ్మ, నా భార్య శ్యామల సహకారం అంతా ఇంతా కాదు. భవిష్యత్‌లో సివిల్స్‌కు సన్నద్ధమవుతా’ అంటూ మీడియాకు తెలిపాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)