తన అత్తగారు భర్తకి రాసిన లెటర్ అది.. అది చదివిన కోడలు ఒకసారిగా కన్నీటి పర్యంతమైంది

ఇద్దరు దంపతులు ఒక హోట‌ల్లో కూర్చొని టిఫిన్ తింటున్నారు. ఎప్పుడు చూసినా బిజీ బిజీగా తిరిగే భర్త ప్రవర్తనలో కొంతకాలంగా మార్పు వచ్చింది. అదే విషయాన్ని అతన్ని అడగాలనుకుంది.. ఇదే సరైన సంధర్బం అని భర్తను అదే విషయం అడిగింది… ఈ మ‌ధ్య మీలో చాలా మార్పు వ‌చ్చింది. మ‌మ్మ‌ల్ని త‌ర‌చూగా బ‌య‌ట‌కు తీసుకొస్తూ.. మాతో హాయిగా గ‌డుపుతున్నారు. నిజం చెప్పండి మీ మొహంలో, ప్రవర్తనలో తేడా క‌నిపిస్తోంది అని భర్తని అడిగేసింది.. దానికి సమాధానం చెప్పడానికి కాసేపు తటపటాయించినప్పటికీ చివరికి చెప్పక తప్పదన్నట్టు తన డైరీలోంచి ఒక లెటర్ తీసి భార్యకిచ్చాడు.. తన అత్తగారు భర్తకి రాసిన లెటర్ అది.. దాన్ని తెరిచి చదవసాగింది ..

ప్రియ‌మైన కుమారుడికి..

ఎప్పుడో ఒక రోజు ఈ ఉత్త‌రం నీ చేతికి దొరుకుతుంద‌ని ఆశ‌తో రాస్తున్నాను. కాస్త ఓపిక చేసుకుని ఈ ఉత్త‌రాన్ని పూర్తిగా చ‌దువి, ఈ త‌ల్లి మ‌న‌సును అర్థం చేసుకుంటావ‌ని ఆశిస్తున్నాను. మీ నాన్న‌ను పెళ్లి చేసుకోకముందు నేనొక లెక్చ‌ర‌ర్‌ని.. పెళ్ళి తర్వాత కూడా ఉద్యోగం చేసాను.. నువ్వు పుట్టాక మీ నాన్నకు బిజినెస్ లో అదృష్టం కలిసివచ్చింది. మీ చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం మానేశాను. మరోవైపు వ్యాపారంతో మీ నాన్నా చాలా బిజీ అయిపోయారు. వివాహం అయిన అనంత‌రం సంవ‌త్స‌రంలో ఎలాంటి బాధ లేకుండా ఉంది. ఆ త‌రువాత అన్నీ ఎదురు చూపులే. మీ నాన్న కోసం ఎదురు చూపులు. ఆదాయం మీద మోజుతో మీ నాన్న స‌మయానికి ఇంటికి వ‌చ్చే వారు కాదు. నువ్,చెల్లే నాకు దిక్కు. మీతోనే నా సంతోషం. ఉద‌యం లేవ‌గానే మీరు తయారై స్కూలుకు వెళ‌తారు. మీ రాక‌కోసం ఎదురు చూపు.

ఇలా మీరు పెద్ద‌వారై పోయారు. నాతో మాట్లాడేందుకు కూడా మీకు స‌మ‌యం ఉండేది కాదు. అవ‌స‌రానికి మాత్రమే మాట కలిపేవారు. పిల్ల‌లైనా నాతో మాట్లాడుతారేమోన‌ని ఎదురు చూపు.కానీ మీకు ఉద్యోగాలు వచ్చాక మీ హడావిడి మీది. మీరు ఆఫీసు నుంచి ఇంటికి వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూపు.. ఇంటికి వ‌చ్చి రాగానే భోజ‌నం చేసి ప‌డుకుంటారు. వంట బాగుంద‌ని కానీ.. బాగాలేద‌ని కానీ చెప్ప‌డానికి కూడా మీకు స‌మ‌యం ఉండ‌దు. కనీసం అమ్మా తిన్నావా అని అడుగుతారేమో అని ఎన్ని సార్లు ఆశగా ఎదురుచూసానో.. కానీ ప్రతిసారి నిరాశే నన్ను వెక్కిరించేది. మీ నాన్న వ్యాపారాన్ని నీకు అప్ప‌చెప్పారు. నీవు కూడా బిజీ అయిపోయావు.చెల్లి పెళ్లి చేసుకుని భర్తతో విదేశాలకు వెళ్లిపోయింది.తన భర్త తన కుటుంబం.తన జీవితం. వారానికి ఒక‌సారి రెండు నిమిషాలు మాత్ర‌మే ఫోన్‌లో మాట్లాడేది.. ఆమె ఫోన్ కోసం ఎదురు చూపు. మీ నాన్న‌కు ఆరోగ్యంపాడై ఇంట్లో ఉంటే ఆయ‌న‌కు స‌మ‌యానికి మందులు అందించేందుకు ఎదురు చూస్తూ గ‌డిపేదాన్ని.చూశావా నా బ్ర‌తుకంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది.

మీ నాన్న‌గారు ఆరోగ్యం బాగాలేక మాత్ర‌లు ఇస్తావా.. అన్నం పెడ‌తావా..? అంతే.. పేప‌ర్ చ‌దివేందుకు స‌మ‌యం ఉంటుంది. నాతో మాట్లాడేందుకు స‌మ‌యం ఉండేది కాదు మీ నాన్న‌కు. మీ సంగ‌తి స‌రే స‌రి. వ‌య‌సులో సంపాద‌న మోజులోప‌డి నాతో మాట్లాడేందుకు కూడా స‌మ‌యం ఉండ‌దు మీకు. ఇక ఈ వ‌య‌సులో మాట్లాడేందుకు ఏముంటుంది.. ఎదురు చూపు.. ఎదురు చూపు.. ఎదురు చూపు.. ఇప్పుడు చావు కోసం నా ఎదురు చూపు. నీకు ఓ విష‌యం బ‌తికి ఉన్న‌ప్పుడు చెప్ప‌లేక పోయాను. నాలా నీ కూతురో.. కొడుకో ఉత్త‌రం రాయ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో చనిపోయే ముందు ఈ ఉత్త‌రం రాస్తున్నాను. ఇంట్లో ఉండే వారి ఆడ‌వారికి కూడా మ‌న‌సు ఉంటుంద‌ని, మ‌న కోస‌మే బ‌తుకుతుంద‌ని గ్ర‌హించు. నేను ఎదురు చూసిన‌ట్టు నీ భార్య ను కూడా ఎదురు చూసేలా చేయ‌కు. మ‌న‌సు విప్పి అన్నింటిని ఆమెతో షేర్ చేసుకో.. నీ భార్య‌తో నీ పిల్ల‌ల‌తో కొద్ది సేపైనా గ‌డుపు. ధ‌నార్జ‌న‌తో వారిని నిర్ల‌క్ష్యం చేయ‌కు. . నా కొడ‌లుకు నాలాంటి ప‌రిస్థితి రాకుండా చూసుకో.. త‌న‌కూ నాలాంటి మ‌న‌సే ఉంటుంద‌ని గుర్తించు. అందులో నేనే ఉంటాన‌ని గ‌మ‌నించు. త‌ను కూడా నాలా ఎదురు చూపుల‌కు బ‌లి కానివ్వొద్దు. మీ కుటుంబంతో హాయిగా గ‌డుపు. వారి మ‌న‌స్సును బ్ర‌తికి ఉన్న‌ప్పుడే గెలుచుకో. నీ కుటుంబమే నీకు అన్నింట్లో తోడుంటుంద‌ని మ‌ర‌వొద్దు. కోడ‌లు, మ‌న‌వ‌డు, మ‌న‌వ‌రాలు జాగ్ర‌త్త‌..

ఇట్లు..

మీ అమ్మ..

అది చదివిన కోడలు ఒకసారిగా కన్నీటి పర్యంతమైంది.. అత్తగారి జీవితం కళ్లముందు కదలాడింది.. భర్త ప్రేమ కోసం, పిల్లల ప్రేమ కోసం తను పడిన ఆవేదన అర్దం అయింది.. ఒక అత్త అయ్యుండి కూడా తన కోడలి గురించి, మనుమల గురించి అంతగా ఆలోచించిన ఆ తల్లి మనసుకు మనసులోనే పాదాభివందనం చేసింది.. ప్రేమగా దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడుస్తున్న తన భర్తకు మరింత దగ్గరగా చేరి తన హృదయంపై ఒదిగిపోయింది.. ఆ భర్త ఎప్పుడు తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడు.. ఎందుకంటే తల్లి అంత ఆర్ద్రతతో చెప్పాక కూడా ఎలా చేస్తాడూ…
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)