కొత్తగా పెళ్ళైన జంటలు ఈ ఐదు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

Loading...
ఎన్నో కలలు. ఆశలు. ఆకాంక్షలు. తన భర్త ఇలా ఉండాలి... అలా ఉండాలని చాలామంది అమ్మాయిలు లెక్కలేసుకుంటూ ఉంటారు. అబ్బాయిలు కూడా అంతే. తన భార్య సంతోషంగా ఉండాలని... సంతోషాన్ని పంచాలని ఆశిస్తారు. అయితే ఈ రెండు విషయాల్లో ఇద్దరి అభిప్రాయాలు కలిస్తే పెళ్లి తర్వాత కూడా వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. ఇద్దరిలో ఎవరి లెక్క తప్పినా కలహాల కాపురం చేయక తప్పదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు సంతోషంగా ఉండొచ్చని మానసకి నిపుణులు చెబుతున్నారు. ఈ ఐదు విషయాల్లో భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటే దాంపత్య జీవితంలో ఎలాంటి కలహాలు రావని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

1. ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. అనుమానం ఒక్కసారి మెదడును తొలిచేస్తే పట్టి పీడించక మానదు. ఆ అనుమానం పెనుభూతంగా మారి అశాంతికి దారితీస్తుంది. నమ్మకం దాంపత్య జీవితానికి పునాది.

2. జీవిత భాగస్వామిని వెంటాడొద్దు ! భార్యపై నమ్మకం లేని భర్త, భర్తపై నమ్మకం లేని భార్య. ఈ కోవకు చెందిన జంటలు ఒకరినొకరు వెంబడిస్తూ డిటెక్టివ్‌లా వ్యవహరిస్తుంటారు. అలాంటి అపనమ్మకంతో లేనిపోని అపోహలతో అనునిత్యం బాధపడుతూనే ఉంటారు. ఈ లక్షణం ఉంటే మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

3. చాలా జంటల్లో అశాంతికి ప్రధాన కారణం అపార్థం. చిన్నచిన్న విషయాలకు కూడా అపార్థం చేసుకుని కోపగించుకోవడం... బాధపెట్టడం లాంటి లక్షణాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది. ‘పెళ్లయిన కొత్తలో మా ఆయన నేను ఏది మాట్లాడినా సంతోషించేవారు. ఇప్పుడా ఆప్యాయత ఆయనలో కనిపించడం లేదు’ ఇది చాలామంది భార్యల్లో కనిపించే అసంతృప్తి. మాట్లాడినంత సేపు విసుగు కలిగించే విషయాలేవీ అందులో రాకుండా ఉండటమే అసంతృప్తికి విరుగుడని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

4. భార్యాభర్తలిద్దరికీ సహనం అతి ముఖ్యం. కొత్తగా పెళ్లయినప్పుడు జీవితం రంగులమయంలా కనిపిస్తుంది. భార్య మాటలు భర్తకు.... భర్త మాటలు భార్యకు ప్రతినిత్యం కొత్తగానే అనిపిస్తాయి. కొన్ని నెలలు గడిచాక ఆ మాటలే గొడవలకు కారణమవుతాయి. దీనికి కారణం అసహనం. తన చిన్నచిన్న కోరికలు కూడా తీర్చలేడని భర్తపై కోపం పెంచుకోవడం, పెళ్లయిన తర్వాత తనకు ప్రశాంతత కరువైందని భర్త బాధపడడం. సహనం కోల్పోయి ఇద్దరూ తిట్టుకోవడం, ఆ గొడవ ముదిరితే ఘర్షణకు దిగడం. భార్యాభర్తలు ఈ విషయంలో సహనంతో వ్యవహరించి ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే వీటన్నింటికీ చెక్ పెట్టొచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు.

5. ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించడం. పెళ్లయినంత మాత్రాన ఇష్టాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆ ఇష్టాలు సమాజం సమ్మతించదగినవిగా ఉండాలి. అప్పుడు ఎవరికీ ఏ సమస్య రాదు. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరికీ పూర్తి స్వేచ్ఛ ఉంది.
Loading...

Popular Posts