ఇప్పటి వరకు 10,000 అనాథ శవాలకు అంత్యక్రియలు జరిపించిన మహానుభావుడు

ఈ రోజుల్లో చాలా మంది కని,పెంచిన తల్లిదండ్రులను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నారు. వాళ్లను వృద్ధాశ్రమాలకు పంపించి తమ బాధ్యత వదిలిపోయిందని చేతులు దులుపుకొంటున్నారు. అమ్మనాన్నలు భారమయ్యారని భార్యతో కలిసి హత్యచేసిన సందర్భాలూ లేకపోలేదు. గుజరాత్‌లో మొన్నటికి మొన్న కన్న తల్లినే భవనంపై నుంచి తోసి హతమార్చిన కసాయి కొడుకు ఉదంతమే దీనికి నిదర్శనం. అలాంటిది.. వారెవరో తెలీదు.. ఎక్కడ నుంచి వచ్చారో, ఏ ప్రాంతమో అసలే తెలీదు. విధి వక్రించి ప్రాణాలు కోల్పోయారు. అనాథ శవాలుగా మిగిలారు. వారందరినీ దత్తత తీసుకుంటున్నాడు మైసూర్‌కు చెందిన ఆయుబ్‌ అహ్మద్‌ అనే 38 ఏళ్ల వ్యక్తి. అందరూ ఇతడిని ముద్దుగా ‘బాడీ మియాన్‌’ అని పిలుస్తుంటారు. అనాథ శవాలకు అంత్యక్రియలు జరిపించి ‘మానవసేవే.. మాధవ సేవ’ అనే మాటను ఆచరించి చూపిస్తున్నాడు. ఒకటి, రెండేళ్లు కాదు.. గత 19 సంవత్సరాలుగా ఆయన దైనందిన జీవితంలో ఇది భాగమైపోయింది.

శవాలను ఏం చేస్తాడంటే.. అనాథ శవాలను ఆయుబ్‌ తనబంధువుల్లా భావిస్తాడు. సొంత కారులోనే శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తాడు. ఎక్కడైనా శవంకనిపిస్తే.. అక్కడి ఆధారాలతో వారి బంధువులకు సమాచారంఅందించి, శవాన్ని వారికి అప్పగిస్తాడు. లేదంటే సదరు ఫొటోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేస్తాడు. దానిని గుర్తించిన వారు అతడికి ఫోన్‌ చేస్తారు. ఇప్పటి వరకు దాదాపు 10,000 మందికి అంత్యక్రియలు నిర్వహించి ఉంటానని ఆయుబ్‌ ఓ పత్రికా సంస్థకు వెల్లడించారు.

ఆ ఆలోచన వచ్చిందిలా.. ఒక రోజు ఆయుబ్‌ మైసూర్‌లోని గుండుల్‌పేట్‌కు వెళుతుండగా హృదయవిదాకరమైన దృశ్యాన్ని చూశాడు. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ శవం చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. దాదాపు 10 గంటల తర్వాత మళ్లీ ఆదే తోవలో వెనక్కి వచ్చి చూస్తే.. శవం అక్కడేఉంది.. జనాలు మాత్రం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.దాంతో ఆయుబ్‌ హృదయం కకావికలమైంది. అప్పటి నుంచి అనాథ శవాలను గుర్తించి వారికి అంత్యక్రియలు చేయడం మొదలు పెట్టాడు. ఏదైనా ప్రమాదం జరిగినపుడు అక్కడికి చేరుకుంటాడు. పోలీసుల విచారణలో అనాథ శవమని తేలిన తర్వాత తన వెంట తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తాడు. కొన్నిసార్లు మృతుల బంధువుల ఇళ్లకు శవాన్ని తీసుకెళ్లి అప్పగిస్తాడు.

కుటుంబ సభ్యుల సహకారంతోనే..
 కేవలం తన తల్లిదండ్రలు, కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇలాంటి సాంఘిక సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాని ఆయుబ్‌ అంటున్నారు. ఇలా చేసినందుకు చాలా సార్లు చీత్కారాలు కూడా ఎదుర్కొన్నాడు. ప్రారంభంలో తన తండ్రి వద్దని మందలిస్తే ఇంటి నుంచి పారిపోయి బెంగళూరులోని ఓ నీటి శుద్ధి కేంద్రంలో పనికి కుదిరాడు. ఆయుబ్‌ పనితనాన్ని, సేవా గుణాన్ని మెచ్చి యజమాని నగదు బహుమతి కూడా ఇచ్చాడు. ఆ సొమ్ముతో లాల్‌బాగ్‌ సందర్శనకు బయలు దేరాడు. అప్పుడు కూడా ఓ అనాథ శవం కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించి, వారికి అప్పగించాడు. తిరిగి మైసూరు వచ్చి ఉద్యోగం చేసుకుంటూ తన సేవాకార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయుబ్‌ ఆలోచన..సేవా ధాతృత్వం ఎంత ఉన్నతమైనదో కదూ..!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)