పొరపాటున డబ్బులు వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తే పరిస్థితి ఏంటి ? ఆ డబ్బులు వెనక్కొస్తాయా ? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయాలి



బ‌్యాంకింగ్ రంగంలో ఒక్కోసారి పొర‌పాట్లు దొర్లుతుంటాయి. అయితే, ఇది డ‌బ్బుతో ముడిప‌డింది కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త కావాలి. ఒకప్పుడు ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే బ్యాంకు బేరర్ చెక్ ఇచ్చేవాళ్లం. కానీ, నేడు దాదాపుగా అందరూ నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ మనీ ట్రాన్స్‌ఫర్ సమయాల్లో ఒక్క డిజిట్ తేడా వచ్చినా నగదు వేరే వారి ఖాతాకు బదిలీ అయిపోతుంది. ఒకవేళ వేరే ఖాతాకు బదిలీ అయిపోతే పరిస్థితి ఏంటి? మన నగదు వెనక్కి వస్తుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఒకవేళ పొరపాటుగా భారీ మొత్తంలో నగదు వచ్చి మన ఖాతాలో జమ అయితే… మూడో కంటికి తెలియకుండా ఉంచేసుకోవాలా? లేక బ్యాంకుకు తెలియజేసి నిజాయతీ చాటుకోవాలా?

అకౌంట్ నంబర్, ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌తో నెట్ బ్యాంకింగ్‌లో బెనిఫీషియరీ వివరాలను యాడ్ చేసుకుంటామని తెలిసిందే. అకౌంట్ నంబర్, పేరు మ్యాచ్ అవకపోతే లావాదేవీ ఫెయిల్ అవుతుందని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం నగదు ట్రాన్స్‌ఫర్‌కు ఖాతా నంబరే ముఖ్యం. ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్సీ నంబర్ అనేవి బ్యాంకు తరఫున చెక్ చేసుకునేందుకు ఇచ్చే అదనపు సమాచారం మాత్రమే. ప్రతీ లావాదేవీ సమయంలో ఖాతాదారుని పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను కూడా మ్యాచ్ చేసి చూడాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. కానీ ఇది సూచన మాత్రమే. తప్పనిసరి కాదు.

జమ చేసేవారిదే బాధ్యత - ఆర్బీఐ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయంటే… ఖాతా నంబర్, ఖాతాదారుని పేరు, నగదు మొత్తం సహా అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నగదు పంపిస్తున్నవారి పైనే ఉంటుంది. పొరపాటుగా వెళ్లి ఆ నగదు వేరొకరి ఖాతాలో జమ అయితే బాధ్యత అవతలి వారిపై ఉండదు. ఇలా పొరపాటుగా పంపించిన వారు తిరిగి తమ నగుదును వెనక్కి పొందడం అన్నది చాలా కష్టమైన ప్రక్రియ.

ఎందుకంటే… మనీ ట్రాన్స్‌ఫర్ సమయంలో ఖాతా వివరాలను చెక్ చేసుకోవాల్సిన బాధ్యత పంపించే వారిపైనే ఉంటుంది. అయితే, పొరపాటుగా వేరొక ఖాతా నంబర్ ఎంటర్ చేసినట్టయితే నిజానికి ఆ నంబర్ పైన ఎలాంటి ఖాతా లేకుంటే మాత్రం ఆ నగదు వెనక్కి వస్తుంది. ఒక్కోసారి ఐఎఫ్ఎస్సీ కోడ్లో తప్పు ఉన్నా లావాదేవీ ఫెయిల్ అయ్యి నగదు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఫెయిల్ అయిన లావాదేవీల నగదును బ్యాంకులు తిరిగి ఖాతాలో జమ చేస్తాయి. ఒక్కోసారి ఆర్టీజీఎస్ సస్పెన్స్ అకౌంట్లో కూడా ఉంచవచ్చు. అప్పుడు ఖాతాదారులే స్వయంగా ఫిర్యాదు ద్వారా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.

పొరపాటుగా పంపిస్తే పరిష్కారం ఏంటి ? 
ఒకవేళ పొరపాటుగా వేరే ఖాతా నంబర్‌కు నగదు వెళ్లినట్టు గుర్తిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం అందించాలి. అప్పుడు బ్యాంకు సిబ్బంది బెనిఫీషియరీతో మాట్లాడి జరిగిన తప్పిదాన్ని వివరిస్తారు. పొరపాటుగా జమ అయిన ఆ మొత్తాన్ని రివర్ట్ చేసుకునేందుకు అనుమతి కోరతారు. వారు సరేనంటే సమస్య పరిష్కారమైనట్టే. ఒకవేళ మీ సొంత బ్యాంకు శాఖ మేనేజర్ సరిగా స్పందించకుంటే ఆ నగదు పొరపాటుగా క్రెడిట్ అయిన బ్యాంకు శాఖను సంప్రదించాలి. అకౌంట్ స్టేట్‌మెంట్, పాస్‌బుక్, ఐడీ, అడ్రస్ ప్రూఫ్ అన్నీ వెంట తీసుకెళ్లి జరిగిన సందర్భాన్ని వివరించడం ద్వారా సాయం పొందవచ్చు. కానీ, కొంతమంది మాత్రం డబ్బును వెనక్కి ఇచ్చేందుకు ఒప్పుకోరు. అప్పటికే ఖర్చు కూడా చేసి ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మొత్తాల్లో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఖాతాదారుడు డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు బ్యాంకులు కూడా ఏమీ చేయలేవు. పొరపాటుగా పంపిన వారికి నగదు వెనక్కి రావడం దుర్లభం.

అయినా మీకు న్యాయం లభించకుంటే - న్యాయపరమైన ప్రక్రియను అనుసరించడమే మిగిలి ఉన్న మార్గం. కానీ న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కారం అంటే ధన వ్యయం, కాల వ్యయంతో కూడుకుని ఉంటుందన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. పైగా కోర్టులో లావాదేవీ మీ తప్పిదం కారణంగానే జరిగిందని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ మీ ఖాతాలోనే పొరపాటుగా నగదు జమ అయితే?- పైన చెప్పుకున్నట్టు మీ ఖాతాకు వేరెవరో పొరపాటుగా నగదు జమ చేస్తే ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నది మీ ఇష్టమే. కానీ, పంపిన వారు కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. జమ ఎవరి నుంచి, ఎందుకు వచ్చిందన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సమర్పించలేకపోతే నగదును వెనక్కి తిరిగి ఇవ్వడంతోపాటు జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నగదు మీదే అని చెబితే ఆదాయపన్ను కట్టాల్సి ఉంటుంది. రూ.50 వేలకు మించి నగదు లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ యంత్రాంగం కన్నేసి ఉంచింది. వారు నోటీసు ఇస్తే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.

నగదు పంపే ముందు ఇలా చేస్తే బెటర్! - మనవైపు పొరపాటు ఉంచుకుని నెపం బ్యాంకులపైన, మన నగదును అందుకున్న అజ్ఞాత వ్యక్తిపైన మోపితే లాభం లేదు. ముందు జాగ్రత్తలు అవసరం. నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి బెనిఫీషియరీ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ నంబర్లను యాడ్ చేసుకునే సమయాల్లో ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. సాధారణంగా ఖాతా నంబర్‌ను ఎడమవైపు నుంచి కుడి వైపునకు చదవడం మనకు అలవాటు. అయితే, నగదు లావాదేవీల సమయంలో ఖాతా నంబర్లను ఒకసారి కుడిచేతి వైపు నుంచి ఎడమవైపునకు చదివి క్రాస్ చెక్ చేసుకోవడం మంచి విధానం. దీనికంటే ఉత్తమమైనది ఏమంటే…? ముందు అకౌంట్ డిటైల్స్ యాడ్ చేసుకుని ఎన్ఈఎఫ్టీ లావాదేవీలో కేవలం ఒక రూపాయిని మాత్రమే మొదటిసారి ట్రాన్స్ ఫర్ చేసి చూడాలి. అది అవతలి వ్యక్తి ఖాతాను చేరిందా? లేదా? చూసుకుని అప్పుడు అసలు మొత్తాన్ని కావాలనుకుంటే ఎన్ఈఎఫ్టీలోనూ లేదంటే ఆర్టీజీఎస్ లోనూ పంపించుకుంటే సరి.
Loading...

Latest Posts