పెళ్ళికి ముందు ఖచ్చితంగా తెలుసుకోవలసిన 10 విషయాలు

పెళ్ళంటే నూరేళ్ళ పంట అన్నారు పెద్దలు. సుదీర్ఘకాలం ఒకే గూటిలో కలిసి కాపురం చేయాల్సినవారు పెళ్ళికి ముందే కొన్ని విషయాల పట్ల స్పష్టతతో ఉండాలి. నూరు అబద్ధాలడయినా ఒక పెళ్ళి చేయాలన్నారు ఒకనాటి పెద్దలు. ఇది కాలం చెల్లిన మాట. పెళ్ళికి ముందు ఓ పది సంగతులయినా తెలుసుకుంటేనే మంచిది.
పరస్పరం ఒకరి కుటుంబం గురించి ఒకరు తెలుసుకోవడం మంచిది. పెళ్ళి తర్వాత అబ్బాయి తల్లిదండ్రులతోనే ఉండాలనుకుంటున్నాడా? వేరే ఇల్లు తీసుకొని కాపురం పెట్టాలను కుంటున్నాడా? అతని తల్లిదండ్రులతో కలసి ఉండడానికి తనకు ఇష్టమో లేదో పెళ్ళికూతురు ముందుగానే తెలియజెప్పాలి. అలాగే కుటుంబ సభ్యుల మనస్తత్వం, అభిరుచులు తెలుసుకోవాలి.
ముందుగానే ఇద్దరి సంపాదనల గురించి, అప్పుల గురించి తెలుసుకోవాలి. ఆరోగ్యపాలసీలు, బీమా పాలసీలు గురించి కూడా తెలుసుకోడం మంచిది.
అబ్బాయికి లేదా అమ్మాయికి గురక పెట్టే అలవాటుందా? చూయింగ్‌ గమ్‌ నమలడం, గుట్కా అలవాట్లు, పాన్‌ తినే అలవాటు ఉందా? ముందుగానే తెలుసుకోవాలి. అలవాట్లను ఎవరూ మార్చలేరు. అందుకని అలాంటి వ్యక్తిని పెళ్ళాడాలో లేదో ముందే నిర్ణయించుకోవచ్చు.
పిల్లల్ని ఎప్పుడు కనాలో, ఎంతమంది ఉండాలో, వాళ్ళని ఎలా పెంచాలో ముందే మాట్లాడుకోవాలి. ఒక్కరు లేదా ఇద్దరుంటే చాలనుకుంటే ఆ ఒక్కరో ఇద్దరో ఆడపిల్లలయినా పరవాలేదా అనేది ముందుగానే అనుకోవాలి.
తల్లిదండ్రుల గురించే కాదు, స్నేహితుల గురించి తెలుసుకోవాలి. వాళ్ళ ఉద్యోగాలు, అభిరుచుల గురించి తెలుసుకోడం మరీ మంచిది. దీనిని బట్టి వాళ్ళు ఎలాంటి వ్యక్తులో నిర్థారించుకోవచ్చు.
అభిరుచుల గురించి తెలుసుకోవాలి. సినిమాలంటే ఇష్టమా? పుస్తకాలు చదువుతారా? ఫేస్‌బుక్‌లో ఎక్కువసేపు చాటింగ్‌ చేస్తారా? తెలుగు సినిమాలే చూస్తారా? ఇతర భాషల సినిమాలయినా ఇష్టపడతరా? తెలుసుకుంటే మంచిది. ఇది వారి అభిరుచి స్థాయిని తెలియజేస్తుంది.
ప్రయాణాలంటే ఇష్టమా? ఎలాంటి ప్రదేశాలు చూడాలనుంది? హనీమూన్‌కు ఎక్కడికెళితే బావుంటుందనే విషయాలు కూడా మాట్లాడుకోవాలి.
ఏ విషయంపైనైనా ఎదుటివారిని నొప్పించకుండానే వాదించవచ్చు. సహేతుకంగా తన పాయింట్‌ ఎలా కరెక్టో చెప్పగలిగే వాదనలు చేయడం బలమైన వ్యక్తిత్వం. దీన్ని ఆమోదించే సుగుణం ఎదుటివారికి ఉన్నదో లేదో వాదనల్లో తెలిసిపోతుంది.
మీరు ఎలాంటి ఇంటిలో ఉండాలనుకుంటున్నారో, ఇప్పుడు అద్దెకు ఉండేట్టయితే భవిష్యత్తులో ఎటువంటి ఇల్లు సమకూర్చుకోవాల నుకుంటున్నారో మాట్లాడుకోవాలి.
వీటితో పాటు లైంగిక విషయాలు కూడా మాట్లాడుకోవాలి. తమ వాంఛల స్థాయిని, దేహభాషను అర్థం చేసుకోగల మనస్తత్వం ఎదుటి మనిషికి ఉన్నదో లేదో మాట్లాడుకుంటే తెలుస్తుంది. కనుక ఎదుటివారికి తమలో నచ్చే క్వాలిటీస్‌ ఏమిటో తెలుసుకోవాలి. ఎంత రోమాంటిక్‌గా ఉండగలరో మాటల్ని బట్టి అర్థం చేసుకోవాలి.

Popular Posts

Latest Posts