పెరుగుతున్న విడాకులు.. చిన్న కారణాలతోనే విడిపోతున్నారు.. తేడా వస్తే చాలు.. బ్రేకప్‌

‘‘రాత్రంతా ఒకటే గురకపెడతాడు. ఆయనతో బతకడం నా వల్ల కాదు. విడాకులు ఇప్పించండి’’... పెళ్లయిన రెండో ఏడాదే కోర్టుకెక్కిన గుర్గావ్‌ యువతి!

‘‘నా భార్య టూత్‌ పేస్ట్‌ను మధ్యలో నొక్కి బ్రష్‌ మీద వేసుకుంటుంది. ఆ పేస్ట్‌ పట్టుకోవాలంటే నాకు అసహ్యం. క్రమశిక్షణ లేని ఈ భార్య నాకొద్దు!’’.. విడాకుల కోసం ఇండోర్‌ ఉద్యోగి చూపిన కారణం!

‘‘నా భార్య తెల్లార్లూ మేలుకుని కంప్యూటర్ మీద పని చేస్తుంది. శృంగారం మాటెత్తితే చాలు నాకు నిద్ర వస్తోందంటూ ముసుగేస్తుంది. ఆమెతో జీవితం నా వల్ల కాదు’’ అంటూ ఓ భర్త.. లాయర్‌ను కలిశాడు.

మూడు ముడులు, ఏడు అడుగులు, పెళ్లినాటి ప్రమాణాలు... ఇవన్నీ ఘనమైనవి, బలమైనవి! ఏ మతమైనా, ఏ సంప్రదాయంలోనైనా పెళ్లి అనేది నూరేళ్ల పంటే. పెళ్లయిన క్షణం నుంచి తుది శ్వాస దాకా తోడుగా ఉండే నేస్తంగా జీవిత భాగస్వామిని భావిస్తారు. ఇప్పుడు పరిస్థితి మారింది. లక్షలు, కోట్లు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరుపుతున్నారు. కానీ... ఇటీవలి కాలంలో విడాకుల కేసులు బాగా పెరిగిపోతున్నాయి. విడాకుల కోసం కోర్టులను ఆశ్రయించడం ఆన్‌లైన్‌లో సినిమా టికెట్‌ బుక్‌ చేసుకున్నంత ఈజీ అవుతోంది. చివరికి... ‘ఆమె చదివే పుస్తకాలు వేరు. నేను చదివే పుస్తకాలు వేరు. మేం ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడం సాధ్యం కావడం లేదు. మాకు విడాకులు కావాలి’ అని కోర్టు మెట్లెక్కుతున్న వారూ ఉన్నారు. విడాకులకు భర్త వేధింపులకు గురిచేయడమో, భాగస్వామి వివాహేతర సంబంధం పెట్టుకోవడం వంటి సీరియస్‌ కారణాలే ఉండక్కర్లేదు! చూడటానికి, వినడానికీ సిల్లీగా ఉండే కారణాలతోనూ నవ దంపతులు విడాకులు కోరుతున్నారని న్యాయవాదులు చెబుతున్నారు.

సర్దుకుపోం...
కాపురం అన్నాక చిన్నపాటి కలతలు సహజం. పెళ్లయిన తర్వాత ఇద్దరి మనసులు కలిసేందుకు, ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. గతంలో అయితే భార్యాభర్తల్లో ఎవరో ఒకరిలో ఆ సహనం ఉండేది. సంసారం ఒక గాడిన పడేదాకా వారు పోయేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒకరికొకరు అర్థమయ్యేలోపే ‘నీకూ నాకు పొసగదు’ అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ‘సర్దుకుపోదాం రండి’ అనే సూత్రాన్ని మరిచిపోతున్నారు. ఆధునిక కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. సంపాదిస్తున్నారు. స్వేచ్ఛ నిండిన వాతావరణంలో పెరుగుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భాగస్వామిని అర్థం చేసుకునే విషయంలో మాత్రం విఫలం అవుతున్నారు.

అహం.. అంతరం.. భార్యాభర్తల మధ్య అంతరాన్ని పెంచే పెనుభూతం.. ‘ఇగో’ (అహం). ‘‘భార్య ఉద్యోగం చేయాలి. డబ్బు సంపాదించాలి. కానీ... నా మాట కాదనకుండా అణకువగా ఉండాలి’’ అని యువకులు కోరుకుంటున్నారు. ‘‘అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదు. ప్రపంచాన్ని చుట్టి వస్తూ కూడా భర్త దగ్గరకు వచ్చేసరికి కుక్కిన పేనులా ఉండటం ఎలా సాధ్యం?’’ అని యువతులు ప్రశ్నిస్తున్నారు. అలాగే.. ఇటీవలికాలంలో ఆఫీస్‌ స్పౌజ్‌ అనే కొత్త తరహా బంధం వెలుగుచూస్తోంది. ఇంట్లో కన్నా ఆఫీసులో ఎక్కువ సమయం ఉండేవారు.. తమ సహోద్యోగులతో బంధం ఏర్పడుతోంది. అయితే అవి చాలావరకూ మానసిక సంబంధాలు మాత్రమే. లైంగిక సంబంధాలు కావు. ఇలాంటివి కూడా కాపురాల్లో అనుమానపు చిచ్చు పెట్టి విడాకులకు దారితీస్తున్నాయి. కలతలకు దారితీసే అవకాశమున్న చిన్న చిన్న అంశాలను గతంలో దాచిపెట్టేవారు. ‘‘ఈ దాపరికాలకు ఇప్పుడు అవకాశం లేకుండా పోతోంది. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన నేపథ్యంలో ఏదీ దాగడంలేదు. ఇది చాలామంది నవ దంపతుల మధ్య అగ్గి రాజేస్తోంది’’ అని ఓ మానసిక నిపుణుడు పేర్కొన్నారు.

తీసుకుంటే తప్పేంటి ?
- ఒకప్పుడు విడాకులు తీసుకోవడమంటే ఏదో తప్పు పనిలాగా.. నామోషీలాగా భావించేవారు. ఇరుగుపొరుగు ఏమనుకుంటారో అని భయపడేవారు. భర్త లేదా భార్య వల్ల ఎన్ని కష్టాలున్నా సహనంతో భరిస్తూ మిన్నకుండిపోయేవారు. కానీ, ఇప్పుడు విడాకులకు సామాజిక ఆమోదం ఉంది. డైవోర్స్‌ తీసుకోవడాన్ని ఇప్పుడెవరూ చిన్నతనంగా భావించట్లేదు. దాంప త్యంలోపరస్పరంపొసగనప్పుడు కలిసుం డేకన్నా విడిపోవడమే మంచిదనే నిర్ణయానికి సులువుగా వస్తున్నారు. అదీ చిన్నచిన్న కారణాలకే విడిపోవాలనుకుంటున్నారు.

తల్లిదండ్రుల బాధ్యత... ఇదివరకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. యువజంటల మధ్య ఏవైనా పొరపొచ్చాలు వస్తే ఇంట్లో ఉండే పెద్దవాళ్లు సర్దిచెప్పి మళ్లీ కలిపేవారు. ఇప్పుడన్నీ చిన్నకుటుంబాలే. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు పల్లెలకే పరిమితమైపోవడంతో వారి కౌన్సెలింగ్‌ కరువైపోయింది. దీనికితోడు.. పిల్లలను పేరెంట్స్‌ స్వేచ్ఛగా పెంచుతున్నారు. స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉన్న సంబంధాలకే ఓటేస్తున్నారు. దీనికి అలవాటు పడిన యువతీయువకులు వివాహ బంధంలో స్వేచ్ఛకు ఏ మాత్రం భంగం కలిగినా జీర్ణించుకోలేకపోతున్నారు. జీవితభాగస్వామి ఆలోచనల్ని గౌరవించడంలో అబ్బాయిలు ఇంకా వెనుకబడే ఉన్నారని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం పెరగడం కూడా వివాహాలకు ఒక కారణం. అయితే.. ‘‘వివాహ బంధం విలువైనది. దాన్ని పదిలంగా కాపాడుకోవాలనే సంకల్పం ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. నవతరానికి వివాహ బంధం విలువ తెలియకపోవడం వల్లే ఎడబాట్లు పెరిగిపోతున్నాయి. వారికి ఆ విలువ తెలియచెప్పాల్సిన బాధ్యత పెద్దలదే అని’’ సంప్రదాయవాదులు పేర్కొంటున్నారు.

అమ్మలా అణకువగా లేదని.
. దివ్య బీటెక్‌ చదివింది. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న నవీన్‌తో పెళ్లయి అమెరికా వెళ్లారు. నెల రోజులు గడవక ముందే గొడవలు మొదలయ్యాయి. ‘‘మా అమ్మ ఎంతో అణకువగా, ఒద్దికగా వుండేది. నీలో ఆ ఛాయలు కొద్దిగా కూడా కనిపించవు. నువ్వు నాకు వద్దు’’ అన్నాడు నవీన్‌. పెళ్లయిన రెండో నెల నుంచే ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. దివ్య ఒంటరిగా అమెరికాలోనే ఉద్యోగం చేసుకుంటోంది.

విడాకుల లెక్కలు...
 గతంలో వెయ్యిలో ఒకరు మాత్రమే విడాకులు తీసుకునేవారు. ఇప్పుడు వెయ్యికి 13 మంది విడాకులు తీసుకుంటున్నారు. కోర్టులను ఆశ్రయించకుండానే విడిపోతున్న దంపతుల శాతం అధికం.

1980లో 5 శాతం మంది దంపతులు విడిపోయేవారు. ఇప్పుడది 14 శాతానికి పెరిగినట్లు ఒక అధ్యయనంలో తేలింది. 2001 లెక్కల ప్రకారం భారత్‌లోని మహిళల్లో 3,67,32,659 మంది విడాకుల ద్వారాగానీ, భర్త నుంచి వేరుపడిగానీ బతుకు వెళ్లదీస్తున్నారు. 2011లో ఇది మరో మూడు శాతం పెరిగింది.
ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో విడాకుల కోసం న్యాయవాదుల్ని ఆశ్రయిస్తున్న యువ దంపతుల సంఖ్య గత పదేళ్లలో నాలుగింతలు పెరిగింది.
దేశవ్యాప్తంగా వున్న 440 ఫ్యామిలీ కోర్టుల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య కుప్పల్లా పేరుకుపోవడంతో మరిన్ని ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటు చేయాల్సి వస్తోంది.

అమెరికా వంటి వర్ధమాన దేశాల్లో 50 శాతం మంది విడాకులు తీసుకుంటున్నారు. అలాంటి దేశాలతో పోల్చినప్పుడు మన పరిస్థితి మెరుగ్గా ఉన్నా ఇటీవల కాలంలో యువతలో పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోతున్నవారి శాతం పెరిగిపోతోంది.

చట్టం ఏం చెబుతోంది..
 
-భార్య లేక భర్తకు వేరే వారితో శారీరక సంబంధం ఉన్నప్పుడు.
-భాగస్వామి పట్ల క్రూరంగా ప్రవర్తించినప్పుడు.
-మతం మార్చుకున్న సందర్భంలో.
-భాగస్వామి మానసిక స్థితి సరిగా లేనప్పుడు.
-భాగస్వామి స్ర్కిజోఫ్రేనియా వ్యాధితో బాధపడుతున్నప్పుడు.
...పై కారణాలవల్ల విడాకులు తీసుకునేందుకు చట్టం అనుమతిస్తుంది.

ఏది స్వాతంత్య్రం? అజిత్‌ - శ్రావ్యలకు ఈ మధ్యే పెళ్లయింది. అత్తవారింటికి వచ్చింది శ్రావ్య. అజిత్‌ ఐటీ ఉద్యోగి. అజిత్‌ ఇంట్లో ఉంటే ఆమె హాల్‌లో ఉండేది. అజిత్‌ ఆఫీసుకు వెళ్లగానే తలుపులు వేసుకుని బెడ్‌రూమ్‌కు పరిమితం అయ్యేది. కొత్త కదా.. సర్దుకుంటుందనుకున్నారు అజిత్‌ తల్లిదండ్రులు. విడిగా ఉండటం ఇష్టమైతే అలానే చేయమని కొడుక్కి చెప్పారు తల్లిదండ్రులు. అవసరం లేదంది శ్రావ్య. పెళ్లయి మూడు నెలలు తిరక్క ముందే ఓ రోజు పొద్దున్నే బ్యాగ్‌ సర్దుకుని చెన్నైలోని అక్క ఇంటికి వెళ్లిపోయింది. ‘‘అజిత్‌ స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేడు. అతడితో జీవితం నాకొద్దు’’ అని చెప్పేసింది. ఆమె మళ్లీ భర్త దగ్గరకు రాలేదు. ఏడాది తరువాత వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు!

వివాహబంధం ఓడుతోంది - ఆధునిక యువతలో నేను.. నాది అనే ధోరణి పెరుగుతోంది. బంధాలకంటే డబ్బు, సౌకర్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నా మాటే నెగ్గాలని భార్యాభర్తలు ఇద్దరూ భీష్మించుకుంటున్నారు. దీంతో వివాహబంధం ఓడిపోతోంది. దంపతుల మధ్య తలెత్తిన చిన్న చిన్న విభేదాలను శ్రద్ధగా ఆలకించి, పరిష్కారం చూపే పెద్ద దిక్కు కుటుంబంలో లేకపోవడంతో పరిస్థితి విడాకుల దాకా వెళుతున్నది.
- ప్రొఫెసర్‌ నిర్మలాదేవి, మనస్తత్వ నిపుణురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్‌, విశాఖపట్నం.

స్వార్థం.. అనర్థం - యువతీ యువకుల్లో స్వార్థ చింతన పెరుగుతోంది. భార్యా భర్తలయ్యాక కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. దీంతో ఇద్దరి మధ్యా అగాథం ఏర్పడుతోంది. భార్యాభర్తల మధ్య వైరుధ్యాలు స్నేహ పూర్వకమైనవే కానీ శత్రుత్వం పెంచుకునేవి కావని వారు గ్రహించాలి. వివాహం ఓ విలువైన బంధం అనే భావాన్ని తల్లిదండ్రులు పెంపొందించాలి.
- నందిగం కృష్ణారావు, న్యాయవాది, రచయిత, హైదరాబాద్‌..
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)