శ్మశాన నిశ్శబ్దం మధ్య రాత్రంతా వేడుక చితిమంటల ఎదురుగా శివుడిని పూజిస్తూ కాశీలో జరిగే అపూర్వ ఘట్టం

Loading...
వారణాసిలో చితిమంటల మధ్య జరిగే వేడుకలు ఒక ఎత్తయితే.. మహిళలు పరమశివుడి గుడికి ఎదురుగా స్టేజీమీద మైమరచిపోయి డ్యాన్స్‌ చేయడం మరో ఎత్తు.. ప్రతీ ఏటా వారణాసిలో చితిమంటల మధ్య ఒక మేళా జరుగుతుంది. రాత్రి చీకటిపడిన దగ్గర్నుంచి సూర్యోదయం వరకూ డ్యాన్సులు, డప్పులతో హంగామా చేస్తారు. ఓ వైపు మృతదేహాల ఖననం జరుగుతుంటే మరోవైపు మహిళలు సంబరాల్లో మునిగితేలుతుంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ త్రినేత్రుడిని పూజించే ఒక అద్భుతమైన కార్యక్రమానికి తెరలేస్తుంది. కాశీలో జరిగే అపూర్వ ఘట్టం అది..

శ్మశాన నిశ్శబ్దం మధ్య రాత్రంతా వేడుక జరుగుతుంది.. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు వందలాదిగా ఈ వేడుక చూడటానికి తరలివస్తారు. వారితోపాటే ఆడతారు పాడతారు. తప్పెట్లు, తాళాలు, షెహనాయ్‌ మోతల మధ్య జరిగే ఈ వేడుక.. రాత్రి గడుస్తున్నకొద్దీ ఆసక్తికరంగా మారుతుంది. చితిమంటల ఎదురుగా ప్రతిష్టించిన శివుడిని పూజిస్తూ ఢమరుకం మోగిస్తారు. వారణాసిలోని మసాన్‌నాథ్‌ దేవాలయం ఎదురుగా ప్రతీ ఏటా ఈ తంతు జరుగుతుంది. మామూలుగా సభ్యసమాజానికి దూరంగా ఉండే ఈ మహిళలు.. ఏడాదికి ఒక్క రోజు మాత్రం ఇలా బయటకువస్తారు. శివుడికి తమను తాము అర్పించుకుంటారు. ఆయన్ను సంతోషపర్చేందుకు ఆడతారు పాడతారు.

కాశీలోని శ్మశానఘాట్‌లో జరిగే ఈ గీత్‌ సంగీత్‌ వెను చారిత్రక కథ ఒకటి ఉంది. కాశీ రాజు మాన్‌సింగ్‌ పేరుమీద ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఓ సమయంలో కాశీలో తిరుగుతున్న మాన్‌సింగ్‌.. దీనస్ధితిలో ఉన్న మసాన్‌నాథ్‌ మందిరాన్ని చూసి చలించిపోయాడు. ఆ తర్వాత తానే దగ్గరుండి పునర్ నిర్మింపజేశాడు. అప్పుడే శివుడిని అలంకరించేందుకు ఒక ఉత్సవం జరపాలనుకున్నాడు. ఆ సమయంలో కొంతమంది మహిళలు అక్కడికి వచ్చి ఆడిపాడటంతో జనం పోగవ్వడం మొదలైంది. శివుడిని ఆరాధిస్తూ వచ్చే జన్మలో తమకు ఇలాంటి పుట్టుక వద్దని వేడుకుంటూ ట్రాన్స్‌జెండర్లు ఇక్కడ ఆడిపాడతారు. ప్రతీ ఏటా చైత్రనవరాత్రుల ఏడవ రోజు రాత్రి.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడకు వచ్చి ఆడిపాడతారు

చైత్రనవరాత్రుల మొదటిరోజు అభిషేకం, తర్వాత రోజు ధూప్‌ అభిషేకం.. ఇలా ఏడురోజుల పాటు శివుడికి ఇక్కడ రకరకాల అభిషేకాలు జరుగుతాయి. తర్వాత నవరాత్రుల ఏడవ రోజు ముక్కంటిని సింగారించే కార్యక్రమం మొదలవుతుంది. అదే రోజు ఈ మహిళా ఉత్సవం జరుగుతుంది. వాస్తవానికి నవరాత్రుల ఏడవరోజు రాత్రి కాళరాత్రి దేవి రాత్రి అని పిలుస్తారు. ఇదే రోజు రాత్రి శ్మశానఘాట్‌లో కాళరాత్రి, మహాకాళిల పూజలు నిర్వహిస్తారు. దీన్నే మహానిషా పూజ అని కూడా పిలుస్తారు. రాత్రి 10గంటల నుంచి అర్ధరాత్రి 2వరకు మహానిషా సమయంగా వ్యవహరిస్తారు. మహాకాళికి పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభిస్తారు.
Loading...

Popular Posts