ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ అకౌంట్ మాత్రమే.. త్వరలోనే బ్యాంకు ఎకౌంటు పోర్టబిలిటీ

Loading...
మొబైల్ పోర్టబులిటీ… ఇప్పటి వరకు మొబైల్ నంబర్లకి మాత్రమే ఇలాంటి వ్యవస్థ ఉంది. కానీ తొలిసారి బ్యాంకింగ్ రంగంలోనూ ఈ పద్ధతిని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది ఆర్బీఐ. ఈ సంస్కరణల్లో భాగంగా తొలి దశలో ఒకే బ్యాంకులోని ఇతర అకౌంట్లు రద్దు చేస్తే.. రెండో దశలో ఇతర బ్యాంకుల ఖాతాలు రద్దు చేసి.. ఒక వ్యక్తికి ఒకే బ్యాంక్.. ఒకే అకౌంట్ ఉండేలా చేస్తారు.

దీంతో కస్టమర్లకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలందించడంతో పాటు చట్ట విరుద్ధమైన లావాదేవీలకు అవకాశం లేకుండా పోర్టబిలిటీ సేవలను తేవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకర్లతో సమావేశమైన ఆర్బీఐ… దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతోంది. ఆధార్ తో బ్యాంక్ అకౌంట్ల అనుసంధానం కూడా దీనికోసమే చేయిస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ ప్రక్రియ మొదలయింది. ఆధార్‌ అనుసంధానం పూర్తయ్యాక ఇది వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా సేవింగ్ అకౌంట్ పోర్టబిలిటీని అందుబాటులోకి తేనున్నారు.

అకౌంట్‌ పోర్టబిలిటీ అనేది బ్యాంకులకు సవాలే. ఎందుకంటే ఖాతా ప్రారంభంలో చేసే ఫైల్‌ స్ట్రక్చర్, బ్యాంకులు వినియోగించే సాఫ్ట్‌వేర్‌లను మార్చాల్సి ఉంటుంది. అన్ని బ్యాంకులూ ఒకే డేటాబేస్‌ను వినియోగించాలి. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. అలాగే బ్యాంక్‌లకు సంబంధించిన ఇండియన్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్‌ కోడ్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ), మొబైల్‌ మనీ ఐడెంటిఫియర్‌ (ఎంఎంఐడీ)లల్లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే వాటి అభివృద్ధి పనులను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి (ఎన్‌పీసీఐ) అప్పగించారని కూడా తెలిసింది. ఇప్పటికే ఎన్‌పీసీఐ భీమ్, ఐఎంపీఎస్, యూపీఐ వంటి సాంకేతికతను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.

దీంతో పాటు మరో సమస్య. అకౌంట్ నంబర్ లో ఉండే సంఖ్య కూడా ఇబ్బందికరమే. ఉదాహరణకు సిటీ బ్యాంక్‌ ఖాతాకు 10 అంకెలు, ఎస్‌బీఐకు 11, ఐసీఐసీఐకి 12, హెచ్‌డీఎఫ్‌సీకి 14, అత్యధికంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఖాతాకు 16 అంకెలున్నాయి. పోర్టబిలిటీలో అన్ని బ్యాంక్‌ ఖాతాల నంబర్ల సంఖ్య సమానంగా ఉండాలి. ఇది బ్యాంక్‌ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి సంస్థలకు కొంత సవాలే అయినప్పటికీ గతంలో సక్సెసయ్యారు కనుక సులువయ్యే అవకాశముందనేది నిపుణుల మాట. గతంలో భారతీయ మహిళా బ్యాంక్‌ (బీఎంబీ) ఎస్‌బీఐలో విలీనమైనప్పుడు రెండు బ్యాంకుల నంబర్ల సంఖ్యను మ్యాపింగ్‌ చేశారు. బీఎంబీకి 12 అంకెలు, ఎస్‌బీఐకి 11 అంకెలుండేవి. విలీనం తర్వాత రెండు బ్యాంకుల ఖాతాలకూ 11 అంకెలనే కేటాయించారు.
Loading...

Popular Posts