సహజసిద్ధంగా దోమలను తరిమికొట్టేందుకు అద్భుతమైన సూచనలు

సాయంత్రం అయ్యిందంటే చాలు.. మనపై దోమల దండయాత్ర మొదలవుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా వీటి దాడికి అందరూ గురికావాల్సిందే! వాటితోపాటే వివిధ రకాల ప్రమాదకరమైన వ్యాధులను మోసుకొస్తాయి ఈ సూక్ష్మ శత్రువులు. వీటిని నివారించేందుకు ఇంట్లో మనం చేసే ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. కొన్ని దోమల నివారణ ఉత్పత్తుల వినియోగం మన ఆరోగ్యంపై ప్రభావం చూపితే, మరికొన్ని ప్రయత్నాలవల్ల లాభం ఉండదు. అందుకే, సహజసిద్ధంగా దోమలను తరిమికొట్టేందుకు కొన్ని సూచనలు. 

దోమల నివారణకు రోజూ ఇంట్లో వినియోగించే గుడ్‌నైట్లు, ఆల్‌అవుట్లు, మార్టిన్లు ఇలా రకారకాల పేర్లతో మార్కెట్లో లభించే దోమల నివారణ మందులు దీర్ఘకాలం వాడడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే సహజ సిద్ధమైన మార్గాల్లో దోమలపై యుద్ధం చేయడమే శ్రేయస్కరం. నిజానికి మనం ఇంట్లో విడుదల చేసే కార్బన్‌డై ఆక్సైడ్‌ దోమలను ఆకర్షించే వాహకంగా మారుతుంది. అలాంటప్పుడు కొన్ని ఐస్‌ముక్కలను ఓ ట్రేలో ఉంచి, గది మూలగా పెట్టాలి. ఐస్‌ గడ్డలు విడుదల చేసే కార్బన్‌డై ఆక్సైడ్‌కు దోమలు ఆకర్షితమై, వాటి చుట్టూ తిరుగుతాయి. అలాంటి సమయంలో ఎలక్ట్రిక్‌ బ్యాట్‌ సహాయంతో దోమలను తుదముట్టించవచ్చు.

కర్పూరం బిళ్లలతో కూడా దోమలను రాకుండా చేయవచ్చు. ఇది దోమల సంహారానికి చక్కగా పనిచేస్తుంది. సాయంకాల సమయంలో ఇంటి తలుపులన్నింటినీ మూసివేసి పెద్ద కర్పూరం వెలిగించాలి. ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్లి తలుపు మూసేయాలి. ఓ 20 నిమిషాల తర్వాత తలుపు తెరిస్తే సరిపోతుంది. ఒక్క దోమ కూడా కనిపించదు. ఎక్కువ సమయం పాటు కీటక నివారిణిగా పనిచేస్తుంది ఇది. పెద్ద ఖరీదేమీ కాదు. ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో నీరు పోసి ఒకటి లేదా రెండు కర్పూరం బిళ్లలను అందులో వేసి గదిలో పెడితే మంచిఫలితం ఉంటుంది. ఈ నీటిని రెండు రోజులకోకసారి మార్చడం మర్చిపోవద్దు. అలాగే, దోమల నివారణకు వేప నూనె చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వేప నూనె, కొబ్బరి నూనె ఈ రెండింటీని సమాన పాళ్లలో అంటే 1:1 నిష్పత్తిలో తీసుకుని చర్మంపై రాసుకోవాలి. కనీసం ఎనిమిది గంటలపాటు ఇది పనిచేస్తుంది. దోమలు కుట్టే సాహసం కూడా చేయవు. సమీపానికి వచ్చినా వేప వాసన చూసి పారిపోతాయి. ఈ ఫార్ములాను జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మస్క్విటో కంట్రోల్‌ అసోసియేషన్‌ తన సంచికలో ప్రచురించడం విశేషం. యాంటీ బ్యాక్టీరియా, యాంటీఫంగల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ప్రోటోజోల్‌ గుణాలు వేపనూనెలో ఉన్నాయి. కాటన్‌ను చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని వేపనూనెలో ముంచి ఇంటిలోపల ప్రతిగదిలోనూ ఉంచాలి. దీనివల్ల కూడా దోమలు కంట్రోల్‌ అవుతాయి.

నిమ్మగడ్డి సమర్థవంతమైన దోమల నిరోధక మొక్కగా చెప్పవచ్చు. అంతేకాదు, నిమ్మగడ్డి అందమైన జీవపొదల గడ్డి అని మీకు తెలుసా? పరిశోధనలో దీనిని దోమల ఉచ్చుకు ఆరు మీటర్ల దూరంలో ఉంచినప్పుడు సుమారు 22 శాతం ఆడ దోమలను నిరోధించినట్లు తేలింది. నిమ్మగడ్డి వాసన ఇతర వాసనలను దూరం చేస్తుంది. ఇది సులభంగా ఇంటి గార్డెన్‌లో లేదా సన్‌సైడ్‌లపై పెరుగుతుంది. నిమ్మగడ్డి కొవ్వొత్తులను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. జాడీ దిగువన ఒక వత్తిని అంటించి, జాడీలో కరిగించిన కొవ్వుకు కొన్నిచుక్కల నిమ్మగడ్డి తైలాన్ని జోడించి, దానిని చల్లబర్చాలి. ఈ విధంగా ఇంట్లో దోమల నిరోదకాన్ని తయారు చేసుకోవచ్చు.

పారాసైటాలజీ అనే పత్రిక దోమల నివారణలోతులసి ప్రాధాన్యత గురించి రాసింది. దోమల లార్వాను చంపేందుకు తులసి చక్కగా పనిచేస్తుందట. మన ఆయుర్వేదం కూడా ఇదే చెప్పింది. ప్రతి ఇంట్లోనూ తులసి మొక్కలను ఉంచుకోవడం వల్ల చాలా వరకు దోమల సమస్య ఉండదట.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)