నారయణ కళాశాలల్లో జరిగే హత్యలకి కేసులుండవ్ విచారణలుండవ్ శిక్షలుండవ్

Loading...
ఛట్, నాన్సెన్స్… ఇంకా ఈ కాలంలో కూడా ఈ ఉసురు తాకడమేంటి..? ఎందుకు తాకాలి..? మన చుట్టూ ఓ మాయను, ఓ మాఫియాను నిర్మించిన కాలేజీ వాడిది దొంగతనమే… వాడు దొంగ… ఎన్నెన్నో కలల్ని కాలేజీ క్యాంపసుల్లోనే చిదిమేస్తున్న హంతకుడు… వాడి పనే అది… వాడినెందుకు తప్పుపట్టడం… 
కడుపుకోతలు, కన్నీటిశాపాలు వంటివి ఏమాత్రం అంటని దివ్యాంశ సంభూతుడు వాడు… ఆత్మను ఏదీ నాశనం చేయలేదు అన్నట్టుగానే వాడినెవడూ ఏమీ చేయలేడు… వాడికి బలాన్నిస్తున్నది సమాజమే… వాడి కాళ్ల దగ్గర మోకరిల్లని వ్యవస్థ ఏముందని..? మీడియా, బ్యూరోక్రాట్, లీడర్, మినిస్టర్… ఎవరు కాదు..? చివరకు పేరెంట్ కూడా…! వాడు ఓ బకాసురుడు… వాడికి బండ్లకొద్దీ కావాలి… దాన్ని తోలుకొచ్చే మనుషులతోసహా మింగేస్తాడు… సమాజాన్ని దోపిడీ చేస్తూ, ఆ డబ్బునే వెదజల్లి సమాజం మొత్తాన్ని నిశ్శబ్దంగా వొంగబెడుతున్నాడు… ఏవేవో ఆశల్ని, కలల్ని, మాయల్ని వాడు క్రియేట్ చేస్తాడు… అందులోకి మనల్ని లాగి, మన జేబులే ఖాళీ చేసి, మన పిల్లల్నే బలిగొనే క్షుద్రదేవత వాడు… వాడు గొప్పోడు… శాలా గొప్పోడు… వాడిని మనమేం చేయలేం… వాడే నడిపించే ప్రభుత్వాలు వాడి చొక్కపై దుమ్మును కూడా దులపలేవు… వాడు చేసే హత్యలకు కేసులుండవ్, విచారణలుండవ్, శిక్షలుండవ్… ఎక్కువ మాట్లాడితే మా హాస్టళ్లకు పంపి, మా కాలేజీలకు పంపించి, ఒకరకంగా సదరు పిల్లల ఆత్మహత్యలకు పురికొల్పారంటూ పేరెంట్స్‌పై కేసు పెట్టగలడు వాడు… మరి..? పిల్లల్ని కాపాడుకోవల్సింది మనమే… ‘అరె, నాయనా… అంతగా చదవలేకపోతే వచ్చెయ్… నచ్చితే చదువ్, లేదా వాడెవడో వేధిస్తుంటే, కష్టమనిపిస్తుంటే నాలుగు పీకి, ఇంటికి వచ్చెయ్… 

ఈ దునియాల 1200 కోట్ల మంది బతుకుతున్నరు… నువ్వూ కాలరెత్తుకుని బతుకుతవ్… నారాయణలూ, చైతన్యలూ లేనప్పుడు ప్రపంచం ఉంది… వాడు లేకపోయినా ప్రపంచం ఉంటది… అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోరు… దునియాల ఏక్‌సేఏక్ ప్రొఫెషన్లు బొచ్చెడున్నయ్… వీడు కాకపోతే ఇంకొకడు… చదువు చెప్పెటోడే లేడా మనకు..? అంతేగనీ, ప్రాణాలు తీసుకోకు బిడ్డా… పొలం లేదా..? పొద్దు లేదా..? ఇదిగాకపోతే ఇంకోటి… ఛల్, లైఫుల ధైర్యంగా నిలబడి కొట్లాడాలె…’ అనే కౌన్సెలింగు ముందుగా జరగాలి… అది పేరెంట్స్ నుంచి స్టార్ట్ కావాలె… దోస్తులు, దగ్గరి చుట్టాలు కూడా ఇదే ఎక్కించాలె… అడ్మిషన్ తీసుకున్న క్షణంలోనే ఓ నైతిక భరోసా ఇవ్వాలి… ‘ఇదేం అల్టిమేట్ కాదు, ఇదే లైఫ్ కాదు… ఇష్టపడి చదువు, కష్టపడి కాదు… అంత కష్టమయితే ఆ చదువే మనకొద్దు… ఇంటికి వచ్చెయ్…’ అనే ఓ నాలుగు మాటలు పిల్లలకు ఎక్కాలె… మన పిల్లల్ని ఈ హంతకుడి నుంచి, ఈ దొంగ మాఫియా నుంచి కాపాడుకోవల్సిందే మనమే… నారాయణ కాకపోతే చైతన్య, వీళ్లు కాకపోతే ఇంకొకడు… కార్పొరేట్ మాఫియా ఓ కొండచిలువ… అది పిల్లల్ని కబళించొద్దూ అంటే ఒక్కటే ఆయుధం… పిల్లల తెగింపు… ఆ తెగింపే వీడి చెర నుంచి బచాయిస్తది… బతుకంతా తోడుగా ఉంటది… వాడి కోరల్ని మనమెలాగూ పీకలేం… కానీ వాడి కోరలకు, మన కోరికలకు మన పిల్లల్నే ఎరగా వేసే ‘బలహీనతల’ నుంచి బయటపడదాం…
క్రెడిట్స్ : ముచ్చట
Loading...

Popular Posts