ముందేమో కులం కులం అంటారు.. అదే కులంలో ఒకడు ఎదుగుతుంటే మాత్రం తిరిగి తొక్కేసేది కూడా ఆ కులం వారేనన్నారు

Loading...
కుల గజ్జిపై నటుడు జగపతిబాబు మరోసారి మండిపడ్డారు. కులం అన్న అంశంపై ఒక ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జగపతిబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు తన వద్దకు వచ్చి ”ఇతడు మనవాడే” అనేవారని ….తొలుత అలా ఎందుకు అంటున్నారో అర్థమయ్యేది కాదన్నారు. 

వారు కులం బేస్‌ చేసుకుని మాట్లాడుతున్నారని తెలిసిన తర్వాత ”అయితే ఏంటి” అని ప్రశ్నించడం మొదలుపెట్టానని చెప్పారు. తన కూతురు అమెరికా వ్యక్తిని ప్రేమిస్తే పెళ్లిని అడ్డుకునేందుకు చాలా మంది ప్రయత్నించారని చెప్పారు. ప్రేమ అన్నది రెండు మనసులకు సంబంధించిందే గానీ…. రెండు కులాలకు సంబంధించింది కాదు కదా అని జగపతిబాబు ప్రశ్నించారు. కేవలం ఇగో వల్లే కులాన్నిపట్టుకుని వేలాడుతున్నారని జగపతి బాబు ఎద్దేవా చేశారు. తొలుత కులం అంటారని…. అదే కులంలో ఒకడు ఎదుగుతుంటే మాత్రం తిరిగి తొక్కేసేది కూడా ఆ కులం వారేనన్నారు. వంద కోట్లు వస్తాయంటే వెళ్లి ఏ మినిస్టర్‌ కాళ్లైనా పట్టుకుంటారని అప్పుడు మాత్రం వారికి కులం కనిపించదన్నారు.
కులాంతర ప్రేమ వివాహాలను వ్యతిరేకిస్తున్న వారిలో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు ఉన్నారన్నారు. అలా అక్రమసంబంధాలు పెట్టుకునే సమయంలో మాత్రం కులాన్ని చూడరని… సుఖాన్ని మాత్రమే కోరుకుంటారని విమర్శించారు. ఎప్పుడు పుడుతామో తెలియదు… ఎప్పుడు పోతామో తెలియదు…. అలాంటప్పుడు కమ్మగా బతకాల్సిందిపోయి… కమ్మ, కాపు అంటూ పట్టింపులెందుకని అభిప్రాయపడ్డారు. సిద్ధార్థ కాలేజ్ అంటే కమ్మబేస్ కాలేజీ అని… ఆ కాలేజ్‌కు 10ఏళ్ల క్రితం తనను ఆహ్వానించారన్నారు. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి కులానికి వ్యతిరేకంగా తాను మాట్లాడుతానంటే అక్కడున్న ప్రిన్సిపల్ అలా చేస్తే విద్యార్థులు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తారని హెచ్చరించారన్నారు. కానీ తాను సభలో క్యాస్ట్‌ ఫీలింగ్‌కు వ్యతిరేకంగానే మాట్లాడానని…. విద్యార్థులు చప్పట్లు కొట్టారన్నారు. అలా కనీసం వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. 

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు డబ్బు ఇస్తే తీసుకోవాలని…. బిర్యానీ ఇస్తే తినాలని…. కానీ ఓటు మాత్రం మంచివారికే వేయాలని జగపతిబాబు పిలుపునిచ్చారు.
Loading...

Popular Posts