ఒకప్పుడు కూలీ పనులు చేసేది, ఊళ్లు తిరుగుతూ రోళ్లు అమ్ముకునే మహిళ పట్టుదలతో ఇన్స్పెక్టర్ అయింది

ఎవరు ఈమె..? ఒక ఫోటో చూస్తేనేమో, ఊళ్లు తిరుగుతూ రోళ్లు అమ్ముకునే మహిళ… చంకలో చిన్న బిడ్డ… ఆ పక్కన ఫోటో చూస్తేనేమో ఖాకీ డ్రస్సులో హుందాగా ఉంది… ఓ మగమనిషి, ఓ పెద్దావిడ… ఇద్దరు పిల్లలు… ఈ రెండు ఫోటోలకూ లింకేమిటి..? ఈ రోళ్లమ్మే మహిళ, ఆ ఖాకీ మహిళ ఒక్కరేనా..? అసలేమిటీ కథ..?

కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఈ ఫోటో కనిపిస్తున్నది… అందరూ అభినందనలు చెబుతున్నారు… ఒక రోళ్లమ్ముకునే మహిళ పట్టుదలగా చదివి పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ అయిందనేది ఆ మెసేజుల సారాంశం..? నిజమేనా..? ఓసారి చూద్దాం…. ఆమె పేరు పద్మశిల రమేష్ తిర్పుడే… మహారాష్ట్ర… భండారా జిల్లా… నిజమే… చాలా పేద కుటుంబం… కూలీ పనులు చేసేది, రోళ్లమ్మేది… పదేళ్ల క్రితం వాకేశ్వర్ దగ్గర ఓ చిన్న ఊరికి చెందిన పవన్ తుకారం కోబ్రాగడేతో ప్రేమ… తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు… భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడి పనిచేసేవారు… ఎలాగోలా కుటుంబం గడిచిపోయేది… 

ఓరోజు…. పవన్ తన కూలీ డబ్బుల్లో మిగిలిన 50 రూపాయలతో కిరాణ సామాను తీసుకోవటానికి మార్కెట్‌కు వెళ్లాడు… ఆ నోటు ఎక్కడో పోగొట్టుకున్నాడు… జేబులో చిల్లి గవ్వ లేదు… ఇంటికొచ్చాడు… ఇంట్లో గుప్పెడు బియ్యం కూడా లేవు… ఆకలితో అలాగే పడుకున్నారు… కడుపులో కాళ్లు మునగదీసుకుని, నకనకలాడే ఆకలిని మంచినీళ్లతో చల్లార్చుకుంటూ గడిపారు… ఏమనిపించిందో ఏమో గానీ, పొద్దున లేవగానే పవన్ భార్యతో ఓ మాటన్నాడు… ఎంత కష్టమైనా సరే, నువ్వు చదవాలి, పెద్ద ఆఫీసరవ్వాలి… ఇలా రోజువారీ కూలీ బతుకులు, ఆకలి బతుకులతో ఎన్నాళ్లిలా..? అన్నాడు… ఆరోజు నుంచి మొదలైంది ఆమె చదువు… ఏదో ప్రైమరీ స్కూళ్లోనో ఆగిన ఆమె చదువు మళ్లీ పట్టాలెక్కింది… పదేళ్లపాటు అదే శ్రమ, అదే పట్టుదల, అదే సంకల్పం… ఏరోజూ వాళ్ల లక్ష్యాన్ని మరవలేదు… ఒక్కడే హమాలీ పని చేసేవాడు… రోజువారీ కూలీకి వెళ్లేవాడు… రాళ్లు కొట్టడం దగ్గర నుంచి ఏ పనైనా సరే…
మధ్యలో ఇద్దరు పిల్లలు… పెరిగిన ఖర్చులు… ఐనా సరే పేదరికానికి తన సంకల్పాన్ని బలి ఇవ్వకూడదనే నిశ్చయంతో మొండిగానే ఉన్నారు ఇద్దరూ… ఆమె చదువు ఆగడానికి మాత్రం వీల్లేదు… ఇలా… ఎట్టకేలకు ఆమె డిగ్రీ పాసైంది… మరి కొలువు..? ఈలోపు మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చింది… పోలీసు రిక్రూట్‌మెంట్ కూడా ఆ సంస్థే చేస్తుంటుంది… పరీక్ష రాసింది… సబ్ ఇన్‌ప్పెక్టర్ స్థాయి పోస్టు దక్కించుకుంది… ఆమె కళ్లల్లో నీళ్లు… అతని కళ్లల్లో అభినందన… ఇదీ ఆమె కథ… అవకాశాల్ని అందిపుచ్చుకోవాలనే బలమైన తాపత్రయం, గోల్ ఉన్నప్పుడు పేదరికం, కష్టాలను అధిగమించి మరీ లక్ష్యాన్ని అందుకోవచ్చునని చెప్పే ఓ సక్సెస్ స్టోరీ… ఆమెకే కాదు…, ఆమె వెన్నంటి ఉండి, వెంటపడి, పదేళ్ల కాయకష్టంతో ఆమెను ఓ ఆఫీసర్ దుస్తుల్లో చూస్తున్న ఆమె భర్తకు కంగ్రాట్స్…! తన భర్త మొహంలో ఆ ఆనందం చూశారుగా ఫోటోలో…. నువ్వు సూపరెహె…!!
క్రెడిట్స్ : ముచ్చట
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)