పాపం మీడియాకి వార్తలు లేవు. ఏ వివాదం దొరుకుతుందా అని గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్న తెలుగు మీడియా

ప్రస్తుతం తెలుగు మీడియా పరిస్థితి ఇది.. తెలుగు రాష్ట్రాలలో నాలుగు పెద్ద తెలుగు దిన పత్రికలు, ఒక పది దాకా చిన్న పత్రికలు, ఓ ముప్పై దాకా న్యూస్ ఛానల్స్, ఒక 20 దాకా ప్రధాన న్యూస్ వెబ్ సైట్స్, ఇంకో వెయ్యి దాకా చిన్న వెబ్ సైట్స్, యూ ట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, లోకల్ ఛానల్స్, వార, పక్ష, మాస పత్రికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వార్తల మీద ఆధారపడి బ్రతికేవే. దేశంలోనే అత్యధిక వర్కింగ్ జర్నలిస్టులు ఉంది మన తెలుగు రాష్ట్రాలలోనే. 2014 కు ముందు ఎక్కువ వార్తా ఛానల్స్, వెబ్ సైట్స్ వచ్చాయి. ఎన్నికల తర్వాత వీటి పరిస్థితి ఏంటి అని చాలామంది ఆందోళన చెందారు. ఆశ్చర్యం ఏమిటంటే వార్తా ఛానల్స్, వెబ్ సైట్స్ మూతపడకపోగా ఇంకా కొత్తవి వస్తూనే ఉన్నాయి. వీరందరికి ఇప్పుడు వార్తల కొరత వచ్చి పడింది.
ఏపి విషయానికి వస్తే తెదేపా, వైకాపా, జనసేన, బిజెపి ప్రధాన పార్టీలు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు తోకలుగా మిగిలారు. వీళ్ళ గురించి రోజూ ఏం వార్తలు ఉంటాయి. పోలవరం, అమరావతి, అవినీతి, ప్రత్యేక హోదా, రుణమాఫీ, హామీల అమలు, రాజకీయ వలసలు, అప్పుడప్పుడు ఘోర రోడ్డు ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు వీటి చుట్టూనే వార్తలు రాయాలి. వీటికి అదనంగా 2019 లో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, ఎవరు గెలుస్తారు అనేవి ఊహాగానాలు.
తెలంగాణ లో ప్రభుత్వం చెప్పిందే వార్త, కాదని ఎవరైనా తోక జాడిస్తే వంద అడుగుల లోతున బొంద పెడతా అని కెసిఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఏవో కొద్దిగా లెఫ్ట్ పార్టీల పత్రికలు అప్పుడప్పుడు అవినీతి వార్తలు రాస్తున్నాయి కానీ మిగతావన్నీ భజనే. హైదరాబాద్ రోడ్లు, జలదిగ్బంధనాలపై వార్తలు,, ఉప ఎన్నికల ఊహాగానాలు, 2019 ఎన్నికలపై ఊహాగానాలు. ఇంతకు మించి వార్తలు లేవు.
జాతీయ రాజకీయాలమీద, ప్రభుత్వాల విధానాల మీద వార్తలు రాద్దామంటే నోట్ల రద్దు, GST తప్ప పెద్దగా ఆసక్తి కలిగించే వార్తలు లేవు. లోతైన విషయాలు ఉన్నా వాటి మీద రాసేవాళ్ళు లేరు, చదివే వారు లేరు. అందుకే తెలుగు మీడియా గోతి కాడ నక్కలాగా వార్తల కోసం ఎదురుచూస్తోంది.

కంచ ఐలయ్య, బ్యుటీషియన్ శిరీష మరణం లాంటి చిన్న వివాదం దొరికితే చాలు, దాన్ని సాగదీసి సాగదీసి పండగ చేసుకుంటోంది. సినిమా కబుర్లు, గాసిప్స్ తప్ప మీడియా కి సరైన వార్తలే దొరకడం లేదు. ఈ మధ్య ఈనాడు ఆన్ లైన్ ఎడిషన్ గమనిస్తే, లైఫ్ స్టైల్, ఆరోగ్యం, రిలేషన్ షిప్స్ కి సంబంధించిన విశ్లేషణలు ఎక్కువమంది చదువుతున్నారు. మొత్తంగా సినిమా కబుర్లు తప్ప మీడియా కి ఇప్పుడు సరైన వార్తలే దొరకడం లేదు. టీవీ 9 అయితే, వెబ్ సైట్ల మీద ఆధారపడి రేటింగ్స్ తెచ్చుకుంటోంది. “ఏది రియల్ ఏది వైరల్” అంటూ, సోషల్ మీడియా లో దొరికే గాసిప్స్ పై ఒక ప్రోగ్రాం చేసి బ్రతికేస్తోంది. ఒక పక్క పోటీ పెరిగింది, మరో పక్క వార్తలు తగ్గిపోయాయి. దీనితో మీడియాలో పెడధోరణులు కూడా పెరిగిపోయాయి. సెక్స్, అత్యాచారాలు, హింసల వార్తలని సెలెబ్రేట్ చేసుకుంటూ చాలావరకు మీడియా సంస్థలు బ్రతికేస్తున్నాయి. ఒకప్పుడు ఒక గ్రామంలో అత్యాచారం జరిగితే అది అక్కడి లోకల్ ఎడిషన్ నేర వార్తల పేజీలలో వచ్చేది. ఇప్పడు అది శాటిలైట్ టీవీల హెడ్ లైన్స్ లోకి చేరిపోయింది. ఈ అతి రిపోర్టింగ్ వల్ల సమాజంలో సున్నితత్వం తగ్గిపోయింది. మెదళ్ళు మొద్దుబారి పోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాల వార్తలు చూస్తుంటే మనకి కన్నీళ్లు రావడం మానేశాయి. ఇక బుర్రలో ఆవగింజంత గుజ్జు కూడా లేకుండా మీడియా లో మాట్లాడే రాజకీయనాయకులని చూసి చూసి ప్రజలకి మొత్తంగా రాజకీయ నాయకుల మీద గౌరవం తగ్గిపోయింది.
అలాగని తెలుగు రాష్ట్రాలలో సమస్యలు లేవా అంటే ..బోలెడు ఉన్నాయి. కానీ ఆ సమస్యలని ప్రజలు పట్టించుకోవడం మానేశారు. ఏదో ఒకరకంగా డబ్బు సంపాదిస్తే చాలు హ్యాపీగా బ్రతికేయోచ్చు అంటూ కొంతమంది కష్టపడుతుంటే, మరికొందరు రకరకాల మోసాలకి పాల్పడుతున్నారు. కష్టపడి పనిచేయడం జబర్ దస్త్ లాంటి కామెడి షోలు చూసి కాసేపు నవ్వుకుని వాట్సప్, ఫేస్ బుక్ లలో కాసేపు గడిపేసి పడుకోవడం,రాజకీయ దురద ఉంటె అభిమాన నాయకుడి మీద పోస్టులు పెట్టడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం లేదా అవతలి వాళ్ళని తిట్టడం అంతే . ఇదే జీవితం అయిపోయింది. ఈ పరిస్థితి నుంచి ప్రజలని బయటపడేయడం అవసరం. అపారమైన వనరులు ఉన్న టీవీ9 లాంటి వాళ్లైనా వంకర చర్చలు కాస్త తగ్గించి, ప్రజలని ఇన్స్పైర్ చేసే కార్యక్రమాల రూపకల్పనకి సిద్ధం కావాలి. అప్పుడే మెరుగైన సమాజం కోసం అని ట్యాగ్ వేసుకోవడానికి ఆ ఛానల్ కి అర్హత వస్తుంది.
Author : Naresh Siramani
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)