కుటుంబ సమస్యలతో నిద్రమాత్రలు మింగిన రాజశేఖర్. యాక్సిడెంట్ కూ అసలు కారణాలు వెల్లడించిన పోలీసులు

ప్రముఖ హీరో రాజశేఖర్ నడుపుతున్న కారు ఆదివారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే‌పై శివరాంపల్లి 240వ పిల్లర్ వద్ద ముందు వెళ్తున్న రామిరెడ్డి అనే వ్యక్తి కారును రాజశేఖర్ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే రాజశేఖర్ తాగి కారు నడిపి తన కారును ఢీకొట్టారని రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరవాత పోలీసులు డ్రంకన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఆయన మద్యం తీసుకోలేదని తేలింది. అయితే ఆయన కారు ప్రమాదానికి గురికావడానికి కారణమేంటని పోలీసులు ఆరా తీశారు.

కుటుంబ సభ్యులతో అప్పటికప్పుడు నెలకొన్న గొడవలతో మనస్తాపం చెందిన రాజశేఖర్.. నిద్రమాత్రలు తీసుకున్నారని, ఆ మత్తులోనే పీవీ ఎక్స్‌ప్రెస్‌పైకి వచ్చి మరో కారును ఢీకొన్నారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎస్‌ఐ ప్రసాద్ వివరాల ప్రకారం.. రాజశేఖర్ తల్లి కొద్దిరోజుల క్రితం మరణించారు. అప్పటి నుంచి ఆయన ముభావంగా ఉంటున్నారు. ఎవరితో సరిగా మాట్లాడటం లేదు. సోమవారం ఇంట్లో పెద్దకర్మ కూడా జరగాల్సి ఉంది. చనిపోయిన తల్లి మళ్లీ రాదని, ఇలా ఎన్ని రోజులు బాధపడతారని ఆదివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు రాజశేఖర్‌ను ప్రశ్నించారు. దీనితో పాటు ఆర్ధికంగా కూడా కొన్ని సమస్యలు ఉండడంతో ఆ విషయాలు మీద కూడా జీవితతో  మాటమాట పెరగడంతో స్వల్ప వాగ్వాదం జరిగింది.
ఆగ్రహానికి గురైన రాజశేఖర్ బంజారాహిల్స్‌లోని తన ఇంటి నుంచి కారులో బయటికి వచ్చారు. అర్ధరాత్రి శంషాబాద్ నుంచి మెహిదీపట్నంవైపు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పైనుంచి వస్తున్నారు. శివరాంపల్లి పిల్లర్ నంబర్ 240 వద్ద కారు ఆపి కాసేపు అక్కడే ఉన్నారు. అనంతరం కారులో బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఈ లోపల తన కారును ఓవర్‌టేక్ చేయబోతున్న అత్తాపూర్ నివాసి రామిరెడ్డి కారును ఢీకొట్టారు. వెంటనే రామిరెడ్డి తన కారును ఆపి రాజశేఖర్‌ను ప్రశ్నించారు. అప్పటికే మత్తులో ఉన్న రాజశేఖర్ పొంతనలేని సమాధానాలు చెపుతుండటంతో రామిరెడ్డి వెంటనే 100కి ఫోన్ చేసి చెప్పారు. అలాగే రాజేంద్రనగర్ పీఎస్‌లోనూ ఫిర్యాదు చేశారు. రాజశేఖర్ భార్య జీవిత పీఎస్‌కు వచ్చి డిప్రెషన్‌లో ఉండటం వల్లే ఇలా జరిగిందని రామిరెడ్డికి సర్దిచెప్పి కేసు వాపసు తీసుకునేలా చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)