గుంత వలన పిల్లోడు చనిపోతే నీ నిర్లక్ష్యపు డ్రైవింగు వల్లే నీ కొడుకు చనిపోయాడు అంటూ ఆ తండ్రిపై పోలీసులు కేసు పెట్టారు

తన పేరు ఉమేష్, భార్యను వెనుక కూర్చోబెట్టుకుని ఓ టూవీలర్‌పై ఉదయమే ఆరున్నరకు ఈనెల రెండున మణిపాల్ నుంచి హిరయాడ్కకు బయల్దేరాడు. భార్యాభర్తలిద్దరూ హెల్మెట్లు పెట్టుకున్నారు అన్నీ గుంతలే, అధ్వానమైన రోడ్డు, దారిద్రమైన మెయింటెనెన్స్. ఆ రోడ్డును ఆమధ్య జాతీయ రహదారిగా ప్రకటించారు కూడా. దీన్ని ఉడుపి-కర్కాల హైవే అంటారు. విధి వాళ్లను వెక్కిరించిన ఆరోజు దాదాపు పర్కల దగ్గరకు రాగానే ఓ పెద్ద గుంత ఎదురైంది. ఉమేష్ దాన్ని తప్పించటానికి బండిని కాస్త పక్కకు తిప్పాడు బండి కంట్రోల్ తప్పింది ఆ పిల్లాడు కింద పడిపోయాడు తలకు బలమైన గాయాలు తగిలాయి. ఈ భార్యాభర్తలకు కూడా తగిలాయి కానీ స్వల్పంగా.

తలకు గాయాలయ్యాక ఆ పిల్లాడిని మణిపాల్‌లో ఓ ప్రైవేటు హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఆ పిల్లాడు మరణించాడు. ‘ఓరి రాజకీయ నాయకుల్లారా, ఓరి అధికారుల్లారా కడుపునకు ఏం తింటున్నారురా.. దరిద్రంగా ఉన్న ఆ రోడ్డుపై గుంతల్ని కూడా పూడ్చలేని మీ పెత్తనాలు, మీ అధికారులు ఎందుకురా..’ అంటూ స్థానికులు కోపంగా నిరసన ప్రదర్శనలు ధర్నాలు చేశారు. ఎందుకైనా మంచిదని ఆ రెండు మూడు రోజులపాటు నాయకులు, అధికారులు ఆ ఏరియాకు దూరదూరంగా ఉన్నారు. ఆరు రోజులు గడిచిపోయిన తర్వాత ఆ దంపతులకు ఇంకో షాక్. 
‘నీ నిర్లక్ష్యపు డ్రైవింగు వల్లే నీ కొడుకు చనిపోయాడు…’ అంటూ ఆ తండ్రిపై పోలీసులు కేసు పెట్టారు.
ఇదేం అన్యాయం సార్ అని ఓ విలేకరి అడిగితే ఉడుపి ఎస్పీ సంజీవ్ పాటిల్ ఏమన్నాడో తెలుసా..? ‘‘పరిశోధిద్దాం, విచారణ జరుపుదాం, పిల్లాడి తండ్రి తప్పు లేకపోతే వదిలేద్దాం…’’ అన్నాడు తాపీగా… అంటే వీళ్లు పెట్టిందే తప్పుడు కేసు, దానితో వీళ్ల చుట్టూ తిరిగీ తిరిగీ, ‘‘ఎంక్వయిరీ’’ బాధలూ పడి, బయటపడాల్సిన బాధ కూడా తనదే. ‘‘అసలు సదరు హైవే అథారిటీపై కదా కేసు పెట్టాల్సింది’’ అనడిగితే ‘‘రెండుసార్లు రమ్మని పిలిచాం, వాళ్లు రావడం లేదు మరి, ఏం చేయమంటారు..?’’ అని ఎదురు ప్రశ్నించాడట ఆ ఎస్పీ దొరవారు..!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)