పెద్ద పెద్ద హోటళ్లలో రెండు మూడుసార్లు వాడిన ఆయిల్‌ను చిన్న హోటల్స్ కి, తోపుడు బండ్లకి అమ్మేస్తున్నారు

విశాఖ నగరంలోని మద్దిలపాలెం కృష్ణాకాలేజి సమీపంలోని భానునగర్‌లో ఉన్న ఓ ఇంట్లో ఆయిల్‌ను అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో 2 వేల లీటర్ల స్టాక్‌ ఉన్న ఆయిల్ డబ్బాలు, పీపాలను గుర్తించారు. వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఆ గోదాము నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

మొదట ఆ ఆయిల్‌ బిల్‌ లేకుండా నిల్వచేసిందని అనుకున్నారు అధికారులు. కానీ.. ఆ గోదాం నిర్వాహకులు రవీందర్‌రెడ్డి, అప్పలనాయుడును ప్రశ్నించి, ఆయిల్‌ను పరిశీలించాక గానీ.. ఈ భయంకర దందా ఆనవాళ్లు తెలుసుకోలేకపోయారు. పెద్ద పెద్ద హోటళ్లలో రెండు మూడుసార్లు వాడిన ఆయిల్‌ను సేకరించే ముఠాలు.. ఆ ఆయిల్‌ను కాస్త శుద్ధిచేసి మార్కెట్‌లో అమ్ముతున్నాయని గుర్తించారు. ఈ ఆయిల్‌ ధర తక్కువగా ఉండటంతో టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు కూడా దీన్ని కొనేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుసుకున్నారు.

ఒకసారి వినియోగించిన ఆయిల్.. మరోసారి వంటలకు వినియోగించకూడదని తెలిసినా.. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వాళ్లు ఈ బద్మాష్ దందాను సాగిస్తున్నారు. దాడుల్లో దొరికిన ఆయిల్‌ను సీజ్‌చేసిన విజిలెన్స్‌ అధికారులు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. కేసును ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. అయితే.. ఇలా.. మళ్లీ మళ్లీ వాడిన ఆయిల్‌ విషపూరితంగా మారుతుందంటున్నారు వైద్యులు. ఈ ఆయిల్‌తో తయారైన వంటకాలు తింటే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని వార్నింగ్‌ ఇస్తున్నారు. సమస్య అంతటితో ఆగకుండా.. క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఫుట్‌పాత్‌ టిఫిన్‌సెంటర్లలో శుభ్రత లేకపోవడం, ఇలాంటి నాసిరకం ఆయిల్‌తో టిఫిన్లు తయారు చేయడం వల్ల జనం ఆరోగ్యానికి ప్రమాదమంటున్నారు నిపుణులు. ఇప్పుడు విశాఖలో బయటపడ్డ ఈ దందాపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి.. సమూలంగా నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఒక్క విశాఖలో అనేకాదు.. దాదాపు నగరాల్లో ఉండేవాళ్లు.. చిన్న చిన్న హోటళ్లు, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లనే ఆశ్రయిస్తుండటం సర్వసాధారణం. ఓ మోస్తరు హోటళ్లలో కన్నా.. వీటిలో తక్కువ ధరకే టిఫిన్‌ లభించడం ఇందుకు కారణం. అవసరాన్ని బట్టి ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం వేళ.. లంచ్, సాయంత్రం స్నాక్స్‌ కోసం ఫుట్‌పాత్‌ రెస్టారెంట్లు, చిన్న చిన్న హోటళ్లలో జనం సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవాళ్లు, పేద, మధ్యతరగతి జనం వీటికే మొగ్గు చూపుతారన్నది అందరికీ తెలిసిన విషయమే.

మరోవైపు.. జీఎస్టీ వచ్చాక.. ఇప్పుడు పెద్ద పెద్ద హోటళ్లకు వెళ్లడం కూడా తగ్గిందని అంటున్నారు. ఈనేపథ్యంలోనే తోపుడుబండ్లమీద టిఫిన్లకు గిరాకీ పెరిగిందని చెబుతున్నారు. అయితే.. అక్కడ టిఫిన్లు ఎలా తయారయ్యాయన్నది పట్టించుకోవడానికి ఎవరికీ తీరిక ఉండటం లేదు. నచ్చిన టిఫిన్‌ ఉందా..? చకచకా తినేశామా..? బిల్‌ కట్టి వెళ్లిపోయామా..? అన్నదే చూస్తున్నారు.

అయితే.. అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు, తోపుడు బండ్లుకాకున్నా.. చాలావరకు టిఫిన్‌ సెంటర్లలో రీ యూజ్‌ ఆయిల్‌ వాడుతున్నారన్న విషయం తెలిసింది. దీంతో.. తినే తిండి విషయంలో జాగ్రత్త వహించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకుంటే ప్రాణాంతకమైన జబ్బుల బారిన పడే ప్రమాదం కూడా ఉందంటున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)