ప్రముఖ హోటళ్లు, మాల్స్, మల్టీ ప్లెక్స్, స్కూల్స్‌కు జరిమానా విధించేలా పోరాడిన ఘనుడు

చట్టాలను అధ్యయనం చేస్తూ సమాజంలో జరుగుతున్న ప్రతి మోసాన్నీ ప్రశ్నిస్తున్న 28 ఏళ్ల యువకుడు అతను. నగరంలోని ప్రముఖ హోటళ్లు, స్కూల్స్‌కు జరిమానా విధించేలా పోరాడిన ఘనుడు అతను. సామాన్యులను మోసం చేయడం ఇక తేలిక కాదనే సంకేతాలు అక్రమార్కులకు పంపిస్తూ అతను సాగిస్తున్న పోరాటం ప్రఖ్యాత రచయిత చేతన్‌ భగత్‌ లాంటి ప్రముఖుల ప్రశంసలందుకుంది. ప్రాణాలు తీస్తామనే బెదిరింపులను లెక్కచెయ్యకుండా నమ్మిన బాటలో నడుస్తున్న విజయ్‌ గోపాల్‌ ప్రస్థానం ఇది. ఆ కథ అతడి మాటల్లోనే...

స్నేహితులతో నగరంలో ఓ ప్రముఖ థియేటర్‌కు సినిమాకు వెళ్లాను. అక్కడ వాటర్‌ బాటిల్‌ కొన్నాను. దాని ఖరీదు 50 రూపాయలు. అదే బాటిల్‌ బయట కొంటే ఒక ధర... లోపల కొంటే మరో ధర. ఒక్కటే వస్తువుకు రెండు ధరలేంటీ? చాలామంది అధికారులను సంప్రతించా. చట్టాలను గూగుల్‌లో వెతికి తెలుసుకున్నా. ‘కన్య్సూమర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 1986’ గురించి, లీగల్‌ మెట్రాలజీ గురించి అవగాహన పొందా. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద పిటిషన్‌ వేశాను. ఇలా అధిక ధరలకు విక్రయించడం న్యాయమా? అన్యాయమా? ఇంతకు ముందు ఇలాంటి కేసులేమైనా నమోదయ్యాయా? అనే విషయాలను తెలుసుకున్నాను. గత ఏడాది ఆగస్టులో ఆ థియేటర్‌పై కేసు నమోదు చేయించాను.
మాల్‌ మాయాజాలం...
హైదరాబాద్‌లోని ఓ పెద్ద షాపింగ్‌మాల్‌లో ఉన్న ఐనాక్స్‌లో కూడా ఇలా జరిగింది. ఆ మాల్‌లోని కింది ఫ్లోర్‌లో నీళ్ల బాటిల్‌ యాభై రూపాయలకు కొన్నాను. మరో ఫ్లోర్‌కు వెళ్తే అక్కడున్న సెక్యూరిటీ వాళ్లు మమ్మల్ని అడ్డుకున్నారు. మా వద్ద ఉన్న వాటర్‌ బాటిల్‌ను స్ర్కీనింగ్‌ ఏరియాకు అనుమతించేది లేదన్నారు. అదేంటని అడిగితే.. అది వాళ్ల కంపెనీ పాలసీ అని చెప్పారు. పాలసీ డాక్యుమెంట్లు చూపాలని అడిగాను. కుదరదన్నారు. ప్రధాన బ్రాంచ్‌ ముంబై నుంచి అనుమతి రావాలని చెప్పారు. ‘‘మీరిచ్చే నీళ్లు మాకు నచ్చకుంటే ఇంట్లో నుంచి తెచ్చుకుంటాం. ఒకవేళ ఎవరైనా పేషెంట్స్‌ ఉంటే వారికి నచ్చిన వేడినీళ్లు తీసుకొచ్చుకుంటారు. మీరెలా అడ్డుకుంటారు’’ అని ప్రశ్నించాను. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని వాదించాను. వాళ్లు తమ మెయిన్‌ బ్రాంచ్‌కు మెయిల్‌ చేసి రాగానే చూపిస్త్తామని చెప్పారు. రెండు వారాల అనంతరం నాకు ఓ మెయిల్‌ వచ్చింది. సెక్యూరిటీ రీత్యా అనుమతించబోమని దాని సారాంశం. కానీ నాకు ఆ సమాధానం నచ్చలేదు. ఎందుకంటే వాళ్లు తినే వస్తువులు, తాగే పానీయాలను మాత్రమే అనుమతించడం లేదు. సెక్యూరిటీ విషయమే అయితే నా దగ్గర ఉన్న లైటర్‌ ఎందుకు తీసుకోలేదని వారిని ప్రశ్నించాను. వాళ్లు నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ‘‘కస్టమర్స్‌కు ఉన్నత సదుపాయాలు కల్పిస్తాం. కాబట్టి ఇలా అధిక ధరలకు విక్రయించడం, ఇక్కడే వస్తువులు కొనుగోలు చేసేలా చేయడం మా బాధ్యత’’ అని వారు ఒప్పుకున్నారు. ఆ మాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాను. వినియోగదారుల సేవా కేంద్రం ఆ మాల్‌కు రూ.5వేల జరిమానా విధించింది.

పార్కింగ్‌ దందా...
ఇనార్బిట్‌ మాల్‌లో కూడా నాకు ఇదే అనుభవం ఎదురైంది. వాహనాన్ని పార్క్‌ చేసి పది నిమిషాల్లో లోపలికెళ్లి వచ్చా. పార్కింగ్‌ చార్జి 50 రూపాయలు ఇవ్వాలన్నారు. నేను వ్యతిరేకించాను. 2003లో హైకోర్టు పార్కింగ్‌కు చార్జి వసూలు చేయడం అన్యాయమని స్పష్టం చేసింది. నేను ఆ విషయం వారితో చెప్పాను. ‘‘చట్టాలు మాట్లాడుతున్నావా! నువ్వేమైనా పోటుగాడివా?’’ అంటూ హేళన చేశారు. మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. కేసు నమోదు చేయించాను. నగరంలో మరో ప్రముఖ హోటల్‌ కూడా కస్టమర్లను మోసం చేస్తోంది. ఆ యాజమాన్యానికి రూ. 40 వేల జరిమానా పడేలా చేశా.

సర్వీస్‌ చార్జి కట్టనవసరం లేదు!!
ఆ మధ్య ఓరిస్‌ రెస్టారెంట్‌కు స్నేహితులతో కలిసి వెళ్లాను. తినడం పూర్తయింది. బిల్‌ వచ్చింది. అందులో సర్వీస్‌ చార్జి 240 రూపాయలని ఉంది. ‘‘సర్వీస్‌ మాకు నచ్చలేదు. అయినా ఎందుకు చెల్లించాలి?’’ అని ప్రశ్నించాను. ‘మా పాలసీ ఇంతే’ అని వారు సమాధానమిచ్చారు. దీనిపై గూగుల్‌లో సెర్చ్‌ చేశాను. యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాను. ఫోరం సీరియస్‌ అయింది. నా దగ్గర తీసుకున్న సర్వీస్‌ చార్జి వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. కస్టమర్లకు సర్వీస్‌ నచ్చితేనే డబ్బులు చెల్లిస్తారని, లేకపోతే వారిష్టం అని తెలిపింది. ఈ విజయం కూడా నాలో ఉత్సాహాన్ని నింపింది.

డొనేషన్లు ఎందుకివ్వాలి?
నగరంలో కొన్ని ప్రముఖ పాఠశాలలు, కళాశాలలు తల్లిదండ్రుల నుంచి డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. ట్యూషన్‌ ఫీజు కాకుండా రకరకాల పేర్లు చెప్పి ఫీజులు గుంజుతున్నారు. కాని చట్ట ప్రకారం డొనేషన్లు కట్టించుకోవడం నేరం. దీనిపై నేను ఉద్యమం చేస్తున్నాను. తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దీనికి సంబంధించి వర్క్‌ జరుగుతోంది.. ఇప్పటికే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న కొన్ని స్కూల్స్‌పై ఫిర్యాదు చేశాను. ఇప్పటి వరకు 6 ప్రముఖ స్కూల్స్‌కు, రెండు ఇంటర్మీడియెట్‌ కళాశాలలకు జరిమానా పడింది..

ఆలోచన మారాలి!
‘‘అందరికీ లీడర్‌ పక్కింట్లో కావాలి. మన ఇంట్లో వద్దు. వ్యవస్థ మారాలి కానీ ప్రశ్నించొద్దు.’’ ఇలా ప్రతి ఒక్కరు అనుకోవడం వల్లే మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం యువత మార్పును కోరుకుంటోంది. అయితే వారికి సరైన గైడెన్స్‌ ఇచ్చేవారు లేరు. అందుకే ఒక ఎన్‌జీఓను స్థాపించాలనుకుంటున్నాను. సోషల్‌ మీడియాతో అందరూ టచ్‌లో ఉన్నారు. నా పోస్టులు ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ తన వాల్‌పై పోస్టు చేశారు. అది నాకు చాలా గర్వంగా ఉంది. నా పోస్టులు చూసి ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా రాజస్థాన్‌లో సాగిస్తున్న దందాను నిలదీశారు. అక్కడా ఈ రకం మోసాలపై చర్చ జరుగుతోంది. అది నాకు చాలా సంతోషాన్నిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే 100కు డయల్‌ చేయొచ్చు. నిర్వాహకులపై సెక్షన్‌ 420 కింద కేసు నమోదు చేయించే హక్కు ఉంటుంది.
అందుకే తల్లిదండ్రులకు దూరంగా..
నా వెనక సామాన్యులు ఉన్నారు. అయితే నేను ఎవరిపై పోరాటం చేస్తున్నానో వారి వెనక బడాబాబులు, రాజకీయ నాయకులు ఉన్నారు. పార్కింగ్‌ దందాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన రోజు 15 మంది మా ఇంటికి వచ్చి బెదిరించారు. నేను భయపడలేదు. అది తప్పు అని వారితో వాదించాను. ఇంట్లో అమ్మ, నాన్న చాలా భయపడ్డారు. ప్రతి కేసులో నాకు బెదిరింపులు వస్తున్నాయి. ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి కూడా వార్నింగ్‌ వస్తున్నాయి. ప్రముఖ షాపింగ్‌ మాల్స్‌, స్కూల్స్‌ వెనక వీళ్లే ఉంటారు. చంపేస్తామని కూడా హెచ్చరించారు.

అయినా నేను ప్రశ్నించడం మానలేదు. మరింత కసిగా పనిచేయడం మొదలెట్టాను. అయితే నా వల్ల మా తల్లిదండ్రులకు ఏమైనా ఇబ్బంది వస్తుందేమోనని వారికి దూరంగా రావాల్సి వచ్చింది. వేరేగా ఉంటున్నా. అక్కడున్నా బెదిరింపులు ఆగడం లేదు. అయితే నేను భయపడే వ్యక్తిని కాననే విషయం వారికి అర్థమయింది.
నిరాడంబరత ఇష్టం
మాది హైదరాబాద్‌లోని కాచిగూడ. నేను ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. మాది పెద్ద కుటుంబం. అమ్మ, నాన్న, ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. టిఫిన్‌ సెంటర్‌లో పనిచేస్తూ చదువుకున్నాను. అమ్మ చాలా ప్రోత్సహించేది. నా కోసం ఉదయం 3:30 గంటలకే నిద్రలేచి, అన్నీ సిద్ధం చేసేది. అమ్మ కోరుకున్నట్టే ప్రథమ శ్రేణిలో పాసయ్యాను. బీకామ్‌ చదివి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాను. ప్రస్తుతం ఐటీ ఉద్యోగిని. నిరాడంబరంగా ఉండేవారంటే నాకు చాలా ఇష్టం.

నా మార్గదర్శకులు వారే!
స్వామి వివేకానంద, అబ్రహం లింకన్‌ నా మార్గదర్శకులు. ప్రతి రోజూ రామకృష్ణ మఠానికి వెళతా. పుస్తకాలు చదవటం ఇష్టం. ‘‘ఒక్కటి కొడితే.. తిరిగి పదింతల ఫోర్స్‌తో కొట్టాలి’’ అని స్వామి వివేకానంద చెప్పిన మాట నాపై చాలా ప్రభావం చూపింది. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)