మన దేశంలో అమ్మాయిల భవిష్యత్తు బాగుండాలంటే తల్లులే వాళ్ల కొడుకులను చాలా పద్ధతిగా పెంచాలి ; రేణు దేశాయ్

నటి, దర్శకురాలు రేణు దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ జరిగిన ప్రచారంపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి తోడుంటే బాగుంటుందని ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. రెండో పెళ్లికి సిద్ధమని ఆమె వ్యాఖ్యలు చేశారని భావించిన పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ కామెంట్లు చేశారు. మరో పెళ్లి చేసుకుంటే మీ గౌరవం తగ్గుతుందని కొందరు, మిమ్మల్ని అసహ్యించుకుంటామని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేయడంపై ఆమె ఆ సందేశాలను స్క్రీన్ షాట్లు తీసి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

'ఈ పోస్ట్ కేవలం నన్ను మాత్రమే ఉద్దేశించింది కాదు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం. ఇలాంటి ఆలోచన తీరున్న మగవాళ్ల మధ్య ఉన్నామని ఆందోళన చెందాల్సి వస్తుంది. సమాజంలో ఓవైపు మహిళా సమానత, ఆడపిల్లల శక్తి స్వరూపం, అత్యాచారాల నుంచి మహిళలను కాపాడాలి. వారి భద్రతకు చర్యలు తీసుకోవాలి అంటుంటాం. మరోవైపు ఏడేళ్లు ఒంటరిగా ఉన్న నేను ఇప్పుడు ఒకరి తోడు అవసరమని మాట్లాడితే అసహ్యించుకుంటున్నట్లు సందేశాలు పంపుతున్నారు.

మన దేశంలో ఓ మగాడు ఏమైనా చేయొచ్చు. ఎన్నిసార్లయినా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఓ అమ్మాయి మరో బంధం గురించి గురించి ఆలోచించడం కూడా తప్పా? జీవితాంతం తప్పు చేశానన్న భావనతో ఏ తోడు లేకుండా బతకాలా? ఇవాళ నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. మన దేశంలో అమ్మాయిల భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే, ఆ మహిళలే వాళ్ల కొడుకులను చాలా పద్ధతిగా పెంచాలి. అప్పుడైనా మగవాళ్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందేమో' అంటూ రేణుదేశాయ్‌ తన పోస్ట్‌లో ఆవేదనను షేర్ చేసుకున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)