ఎసి గదుల్లో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతుంది శ్వాససంబంధిత రోగాలు వస్తాయి

ఎయిర్‌కండిషనర్ల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు తక్కువే కావొచ్చు. అలాగని వాటిని పట్టించుకోకుండా ఉండటమూ ప్రమాదమే. ఎసి గదుల్లో ఎక్కువ సమయం ఉండే వాళ్లకి తలనొప్పి, తలతిరగడం, కళ్ల దురద, గొంతు, చర్మ అలర్జీలు వస్తుంటాయి. అప్పటివరకు చల్లగా ఎయిర్‌ కండిషన్‌ గదిలో ఉండి బయటకు వస్తే వేడి బారిన పడతారు. దీనివల్ల శ్వాససంబంధిత అలర్జీలు వస్తాయి. అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవే ఇవి...
ఎయిర్‌ కండిషనర్లు గాల్లోని తేమను పీల్చుకుంటాయి. దానివల్ల చర్మం పొడి బారిపోతుంది. అందుకని నీళ్లు బాగా తాగాలి. దాంతోపాటు గోరువెచ్చని నీళ్లలో చిన్న నిమ్మ ముక్కను వేసుకుని తాగితే శరీరానికి తేమను అందించినట్టవుతుంది. పనిలో పనిగా శరీరంలో ఉండే వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి కూడా.
ఎసి ఫిల్టర్లు, డక్ట్స్‌ను రెగ్యులర్‌ సర్వీసు చేయించాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము, ధూళి, వైరస్‌, బ్యాక్టీరియా వంటివి మీ దరికి చేరవు. చర్మానికి తేమను అందించేందుకు కలబంద జెల్‌ వాడాలి. అలాగే తిప్పతీగ కూడా. ఇది చర్మానికి, కాలేయానికి బోలెడంత మంచి చేస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ వల్ల కలిగే మంటను తగ్గించేందుకు చాలా బాగా పనిచేస్తుంది.
హెర్బల్‌ ఆయిల్‌ను రోజుకి ఒకసారి ఎయిర్‌ కండిషన్‌ ఉంచిన గదిలో చల్లాలి. ఎసి ఉన్న గది ఎప్పుడూ మూసి ఉంచుతారు. మూసి ఉన్న గదిలో ఒకలాంటి వాసన వస్తుంది. ఆ వాసన రాకుండా ఈ ఆయిల్‌ నిలువరిస్తుంది. ఆయిల్‌ లేదంటే ఎయిర్‌ ప్యూరిఫైయర్స్‌ వాడొచ్చు. ఉసిరి చట్నీ తినడం వల్ల ఎంజైమ్‌లు, విటమిన్‌-సి లభిస్తాయి. పుచ్చకాయ తింటే మినరల్స్‌ వస్తాయి. వీటివల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
ఆక్సిజన్‌ విడుదల చేసే మొక్కల్ని ఎసి ఉన్న గదిలో ఉంచాలి. మొక్కల్ని మించిన ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ మరోటి ఉండదు. ఎసి ఉన్న గదుల్లో ఉండే గాలిలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే గాలి నిర్జీవం అయిపోతుందన్నమాట. దీన్నుంచి బయటపడాలంటే ఎసి గదిలో మొక్క ఉండాల్సిందే.
ఎయిర్‌ కండిషన్‌ ఉన్న గదిని వదిలి బయటకు రారు చాలామంది. ఈ అలవాటు ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. ఎసి గదుల్లో ఉండేవాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగయితేనే కండరాలు పట్టుకుపోవడం వంటి సమస్యలు తలెత్తవు.
ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండకూడదు. ఎండలో నుంచి ఇల్లు లేదా ఆఫీసులోకి వెళ్లగానే చల్లటి నీళ్లు తాగొద్దు. ఎసి ఉష్ణోగ్రతను 18 కంటే కూడా 25లో ఉంచడం మంచిది. దీనివల్ల లోపల ఉన్నప్పుడు మరీ చల్లగా ఉండదు. బయటికి వెళ్లగానే ఒక్కసారిగా విపరీతమైన వేడి ఉన్నట్టు అనిపించదు.
కారులో ఎసి మైల్డ్‌ సెట్టింగ్‌ చేయాలి. ఎక్కువ కూల్‌ ఉంటే కండరాలు పట్టుకుపోయి, నొప్పులు వస్తాయి. కారులో ఉన్నప్పుడు పావుగంట లేదా ఇరవై నిమిషాలకి ఒకసారి కాలి మడమలను అటుఇటు తిప్పుతుండాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)