తరుగు పేరుతో దోపిడీ. బంగారం ఎక్కడ వేస్టవుతుందో చెప్పండి అంటూ నగల వ్యాపారస్తులకు సవాల్

ఆభరణాల తయారీ రంగంలోకి దూసుకువచ్చి, తనే బ్రాండ్ అంబాసిడర్ గా మారి, వినూత్న రీతిలో ప్రచారం సాగిస్తూ, వ్యాపారాన్ని పెంచుకుంటూ వెళుతున్న లలితా జ్యాయెలర్స్ ఎండీ కిరణ్ కుమార్, మిగతా ఆభరణాల తయారీదారులకు సవాల్ విసిరారు. ఆభరణాల తయారీలో 'వేస్టేజ్' అన్న పదానికే అర్థం లేదని, బంగారం ఎక్కడ వేస్టవుతుందో చెబితే, తాను వెళ్లి వెతుక్కుంటానని అన్నారు. ఓ టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తాను 3 శాతం తరుగుతో ఆభరణాలు విక్రయిస్తున్నానని, మిగతా జ్యూయెలర్స్ కూడా అదే విధంగా విక్రయించాలని డిమాండ్ చేశారు.

కొన్ని నగలకు 22 శాతం వరకూ వేస్టేజ్ వేయడాన్ని తప్పుబట్టిన ఆయన, అంత వృథా ఎక్కడ పోతున్నదో చెప్పాలని సవాల్ విసిరారు. ఇక తన సంస్థకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంపై స్పందిస్తూ, తానెవరినైనా ప్రచారకర్తను పెట్టుకుంటే, ఆయనేం చెప్పాలన్నది కూడా తానే రాసివ్వాల్సి వుంటుందని, సొంతంగా మాట్లాడే శక్తి అతనికి ఉండదని చెప్పారు. సోషల్ మీడియాలో 'గుండు బాస్' అని తనను పిలుస్తున్నారని, 'గుండు' అంటే చాలునని, 'బాస్' అనక్కర్లేదని కిరణ్ కుమార్ జోకేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)