ఒక స్కూల్ లో టీచర్ లేకపోతే తన భార్యనే తాత్కాలిక టీచర్‌గా పెట్టి పాఠాలు చెప్పించాడు ఈ ఐఏఎస్ ఆఫీసర్

ఐఏఎస్ అధికారి ఈ పేరు వినగానే రెడ్ టేపిజం, అవినీతి, అక్రమ సంపాదన, ఆడంబరం, గుర్తొచ్చే కాలం కదా ఇది. మరి ఈ ఐఏఎస్ అధికారి కాస్త భిన్నం జస్ట్, 2011 బ్యాచ్. ఇంకా వ్యవస్థ తాలూకు అవలక్షణాలు అంటుకోలేదు. స్వచ్ఛంగా ఉన్నాడు ఎంతగా అంటే ? ఓ స్కూల్‌లో సైన్స్ టీచర్ లేడు, పిల్లలు అవస్థలు పడుతున్నారు అని తెలుసుకుని, తన భార్యనే తాత్కాలిక టీచర్‌గా పెట్టి పాఠాలు చెప్పించాడు. ఐఏఎస్ అధికారులకన్నా వాళ్ల భార్యలే ఎడాపెడా రాజ్యాంగేతర శక్తులుగా చెలామణీ అవుతున్న ఈ కాలంలో కొంచెం స్ఫూర్తిదాయకమే కదా మనసులో స్వచ్ఛత ఇంకా కాపాడుకుంటున్నట్టే కదా. ఇదే కదా నిజమైన స్వచ్ఛ భారత్ సీనియర్ ఐఏఎస్ అధికారులకు చాదస్తంగా, వింతగా, విడ్డూరంగా, విస్మయకరంగా అనిపించినా సరే ఆ యువ ఐఏఎస్ అధికారి మాత్రం ఇంకా స్వచ్ఛంగానే ఉన్నాడు.

ఆయన పేరు మంగేష్ గిల్డియాల్. ఆయన భార్య పేరు ఉషా గిల్డియాల్. నిజానికి యూపీఎస్సీ పరీక్షలో పాసై, ఏదో కేంద్ర సర్వీసు కొలువు దక్కిందంటే చాలు ఆ పోస్టు ద్వారా దక్కే జీతం, గీతం, హోదా, అధికారం, పెత్తనం జీవితం పూలపానుపు అనిపిస్తుంది చాలా మందికి.. కానీ దానికి విలువ తీసుకొచ్చేదీ, సేవకు దాన్ని వినియోగించుకునేది కొందరే. నిజానికి ఇలాంటివాళ్లను సీనియర్ ఐఏఎస్ అధికారులు చిల్లరగా, చీప్‌గా చూస్తారు కానీ కొందరు ఐఏఎస్ అధికారులు అవేవీ పట్టించుకోకుండా వ్యవహరిస్తారు వారిలో ఒకడు మన మంగేష్. 2011 బ్యాచ్, నాలుగో ర్యాంకు, సూపర్ కదా. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఎంచుకుని, ఏదో ఓ దేశంలో హాయిగా జీవితం గడిచే చాన్స్ కానీ తను ఐఏఎస్ మాత్రమే ఎంచుకున్నాడు. మొన్నమొన్నటి దాకా తను బాగేశ్వర్ జిల్లా కలెక్టర్. తనను బదిలీ చేస్తే వందల మంది బజారుల్లోకి వచ్చి నిరసన ప్రకటించారు. అలా అక్కడి వాళ్లకు ఆప్తుడయ్యాడు. తరువాత రుద్రప్రయాగ్ కలెక్టర్. ఓసారి స్కూళ్ల తనిఖీకి వెళ్లి, ఓ స్కూల్‌లో సైన్స్ టీచర్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నట్టు గమనించాడు అప్పటికప్పుడు తన పరిధిలో తను కొత్త టీచర్‌ను ఇవ్వలేడు వెంటనే తన భార్య ఉషాను పిలిచి, కొత్త టీచర్ వచ్చేదాకా నువ్వు పాఠాలు చెప్పొచ్చు కదా డియర్ అని అడిగాడు ఆమె అంగీకరించింది.

ఆమె వృక్షశాస్త్రంలో డాక్టర్. ఆమె ఉత్తరాఖండ్, పంత్‌నగర్ యూనివర్శిటీలో బోటనీకి సంబంధించి రీసెర్చ్ స్కాలర్. తన భర్త అప్పగించిన బాధ్యతను మనస్పూర్తిగా స్వీకరించింది. ఆమె చెప్పే పాఠాలతో ఆ పిల్లలు ఫిదా. ఇప్పుడు వాళ్లు ఏమంటున్నారంటే.. "సార్, ఆమెను విద్యాసంవత్సరం చివరి వరకూ చెప్పనివ్వండి ప్లీజ్…" గ్రేట్.. చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్దగా స్పూర్తిదాయకం. ప్రత్యేకించి యువ ఐఏఎస్ అధికారులకు ఇలాంటి కథలే మార్గదర్శకాలు. కాస్త ఇలాంటి వాళ్లకు సమాజం తోడుగా నిలిస్తే చాలు వాళ్లు సమాజం అభినందనలు పొందే దిశలో దున్నేస్తారు. ఎటొచ్చీ తుచ్ఛమైన రాజకీయాలు, అలాంటి నాయకులే ఇలాంటివాళ్లకు శాపాలు, పాపాలు, ప్రతిబంధకాలు. వీళ్లకు అలాంటి రాజకీయాల పీడ ఎదురు గాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)