6 వ నెలలోనే కేవలం 620 గ్రాములతో పుట్టిన బిడ్డను 132 రోజులు చికిత్స అందించి కాపాడిన వైద్యులు

వైద్యశాస్త్రంలో ఇదొక అద్భుతం.. కేవలం 22 వారాల ప్రెగ్నెన్సీలో.. అత్యంత క్లిష్ట సమస్యలతో పుట్టిన బాలుణ్ని ముంబై డాక్టర్లు మృత్యుంజయుడిగా నిలిపారు. నాలుగు నెలల ప్రత్యేక సంరక్షణ, చికిత్స అనంతరం ఆ చిన్నారిని ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో తల్లిదండ్రులకు అప్పగించారు. నెలలు నిండకముందే పుట్టి.. ప్రాణాలు దక్కించుకున్న ప్రిమెచ్యూర్ బేబీల్లో ఈ కేసును మెడికల్ మిరాకిల్‌గా అభివర్ణిస్తున్నారు. ముంబైలోని శాంటాక్రజ్‌ ప్రాంతంలో ఉన్న సూర్యా ఆస్పిటల్ ఈ అద్భుతానికి వేదికైంది.
బాంద్రాకు చెందిన 34 ఏళ్ల రెతిక ఈ ఏడాది మే 12న అకస్మాత్తుగా పురిటినొప్పులతో తల్లడిల్లింది. ఆసుపత్రిలో చేర్పించగానే ఆమె ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. 22 వారాలకే పుట్టడంతో ఆ శిశువుకు మెదడు, కంటి చూపు, వినికిడి, నరాల సమస్యలు తలెత్తాయి. అయితే డాక్టర్లు ఆ చిన్నారిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఓ రకంగా యజ్ఞ‌మే చేశారు.
తన బిడ్డ సాధారణ పిల్లల్లాగా బతకాలంటే.. అంతులేని ఆశీస్సులు కావాలనే తలంపుతో ఆ తల్లి ఆ శిశువుకు ‘నిర్వాన్’ అని పేరు పెట్టింది. పుట్టి పుట్టగానే అతి ప్రిమెచ్యూర్ బేబీగా రికార్డుకెక్కిన నిర్వాన్‌కు ఎన్‌ఐసీయూలో మొత్తం 14 మంది డాక్టర్లు, 50 మంది నర్సులు ట్రీట్‌మెంట్ చేశారు. కేవలం 620 గ్రాములతో పుట్టిన ఆ శిశువును 132 రోజుల పాటు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్‌లో పెట్టి చికిత్స అందించారు.
సాధారణంగా 40 వారాల తర్వాత పుట్టేవారిని నెలలు నిండిన శిశువులుగా పేర్కొంటారు. 37 వారాల కంటే ముందు పుట్టిన శిశువులకు ఆరోగ్యపరంగా, శారీరకంగా పలు సమస్యలు ఎదురవుతాయి. ఇప్పటివరకూ 24 వారాల కంటే ముందు జన్మించిన శిశువులు ప్రాణాలతో బయటపడ్డ రేటు కేవలం 0.5% మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో నిర్వాన్ పూర్తి ఆరోగ్యంతో బయటపడటం గొప్ప విశేషం.
పుట్టిన తర్వాత ఆరు వారాల పాటు వెంటిలేటర్‌పైనే ఉన్న నిర్వాన్.. ఆ తర్వాత మరో ఆరు వారాల పాటు పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ మెషీన్‌పై ఉన్నాడు. ప్రస్తుతం ఆ చిన్నారి 3.72 కిలోల బరువుకు చేరుకున్నాడు. ఇంటెన్సివ్ కేర్ నుంచి బయటకొచ్చిన నిర్వాన్‌.. శనివారం (సెప్టెంబర్ 23) డిచ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు. ఆ చిన్నారి కోసం అతడి తల్లిదండ్రులు రూ. 20 లక్షల దాకా ఖర్చు చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)