మన్యం వీరుడు అల్లూరి సమాధి ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా

ఎందరో సమర యోధుల పోరాటం మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్య్రం. అలాంటి వీరుల్లో ఒకరు అల్లూరి సీతారామరాజు. మన్యం వీరుడు అల్లూరి గురించి తెలియనివారుండరు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్రం కోసం 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి. మహాత్మ గాంధీ సమాధి రాజ్ ఘాట్‌లో ఉన్నట్లే అల్లూరి సీతారామరాజు సమాధి కూడా ఒక ప్రాంతంలో భద్రంగా ఉంది. మరి అల్లూరి సమాధి ఎక్కడుందో మీకు తెలుసా? ఆ విప్లవ వీరుడి భౌతికకాయాన్ని ఎక్కడ దహనం చేశారో తెలుసా? అయితే ఆ వివరాలు మీకోసం...

బ్రిటిష్ దొరలపై రెండేళ్లపాటు అలుపెరగని పోరాటం చేశారు అల్లూరి. తన ఉనికి కోసం మన్యం ప్రజలను బ్రిటిష్ అధికారులు హింసించడం అల్లూరి చూడలేకపోయారు. అందుకే ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. 1924 మే 7న విశాఖపట్నం జిల్లా మంప గ్రామానికి సమీపాన రాజు స్వయంగా లొంగిపోయారు. సీతారామరాజుపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్ అధికారులు ఆయన్ని చింతచెట్టుకు కట్టి కాల్చిచంపారు. మే 8న రాజు అనుచరులు ఆయన భౌతికకాయాన్ని క్రిష్ణదేవీపేటకు తీసుకువచ్చి తాండవనది పక్కన దహన క్రియలు జరిపారు. ఇప్పుడు అక్కడే అల్లూరి సీతారామరాజు సమాధి ఉంది. ఆయన సమాధి పక్కనే ప్రధాన అనుచరుడు గంటం దొర సమాధిని కూడా నిర్మించారు.

సీతారామరాజు, గంటం దొరలను దహనపరిచిన చోటు ఇప్పుడు క్రిష్ణదేవీపేట పరిసర ప్రజలకు పుణ్య స్థలం. రాజు, గంటం దొరలకు సమాధులు కట్టి పూజిస్తున్నారు.

ఒక చిన్న మందిరంలో రాజు, గంటం దొర సమాధులు పక్కపక్కనే ఉంటాయి. క్రిష్ణదేవీపేటలో ఉన్న అల్లూరి సీతారామరాజు పార్కు ఆ గ్రామానికే తలమానికం.

పచ్చని చెట్లు, పూల మొక్కలతో పార్కు ఆహ్లాదకరంగా ఉంటుంది. స్థానికంగా దీన్ని సీతారామరాజు గోళీ అని పిలుస్తుంటారు. ఇక్కడి గోడలపై రామరాజు చరిత్రను శిలా ఫలకాలుగా ఏర్పాటు చేశారు.

ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వచ్చి సీతారామరాజు సమాధిని దర్శించుకుని వెళ్తుంటారు. పార్కులో అల్లూరి కాంస్య విగ్రహంతో పాటు ఆయన తల్లి సూర్యనారాయణమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)