దేశం కోసం ఒక్క రూపాయి. ఓ సామాన్యుడి ఆలోచన ఆర్మీ అకౌంట్‌కు పెరుగుతున్న ఆదరణ స్వచ్ఛందంగా ముందుకొస్తున్న యువత

ఒక ఐడియా యావత్‌ దేశాన్నే ఆలోచింప చేసింది. ప్రధానమంత్రిని సైతం ఔరా అనిపించింది. నేను పుట్టిన దేశం కోసం ఏదైనా చేయాలనే అతని ఆలోచనతో రక్షణ శాఖ బలోపేతమవుతోంది. మేము సైతం అంటూ నగర యువత కూడా అందుకు సహకరిస్తోంది. 
ఏమిటా ఐడియా.. దేశానికి అది ఏ విధంగా సహాయపడుతుంది..? 
దేశ రక్షణ కోసం నిరంతరం పహార కాస్తున్న సైనికులకు మెరుగైన వసతులు, ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించే వెపన్స్‌ కావాలి. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ప్రభుత్వం రక్షణ శాఖ కోసం అధికంగానే నిధులు వెచ్చిస్తున్నా.. చాలడం లేదు. ఇంకా నిధులు కావాలంటే ఏం చేయాలి.. దేశం కోసం మనం ఓ చేయి కలుపుదాం.. కానీ ఎలా.. అని ఆలోచించి ఓ సంస్థను ఏర్పాటు చేశారు మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన రాజేందర్‌ గుప్తా. కనీసం ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క రూపాయి కేటాయించినా కోట్లు సమకూరుతాయని భావించారు.

అయితే సంస్థలో ఉన్న వారు అవినీతి పాల్పడే అవకాశం లేకపోలేదు, ప్రజలు అనుమానించే ఆస్కారం కూడా ఉండడంతో తన మనసులోని ఆలోచనలతో 2017 జూలై 19న ప్రధాన మంత్రి కార్యాలయానికి, రాష్ట్రపతి, రక్షణశాఖల మంత్రుల కార్యాలయాలకు లేఖలు రాశారు గుప్తా. దీన్ని పరిశీలించిన ఆయా శాఖలు ఆలోచన బాగుందని అధికారికంగా ఓ బ్యాంక్‌లో అకౌంట్‌ తీశారు. ఈ విషయాన్ని రక్షణశాఖ కార్యాలయం నుంచి ఆ వ్యక్తికి తెలిపారు. తన కల నేరవేరిందని గుప్తా ఎంతో సంబరపడ్డారు. తొలుత తన వంతు సహాయంగా రూ.5001 అకౌంట్లో జమ చేశారు. అంతే కాకుండా సామాజిక మాధ్యమాల్లో దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
నగర యువత చేయుత
ఆర్మీ సంక్షేమం కోసం గుప్తా చేస్తున్న కృషికి నగర యువత కూడా సహాయం చేస్తున్నారు. ఆర్మీ బలోపేతం కోసం ఏర్పాటు చేసిన అకౌంట్‌లో నగదు జమ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఆ ఖాతాలో డబ్బు జమ చేస్తున్న వారిలో 18 నుంచి 30 ఏళ్ల వయసు వారే ఎక్కువగా ఉంటున్నారు. దేశ సేవ చేసేందుకు ఇలాగైనా అవకాశం దొరికిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు, షికార్లు, సోషల్‌ మీడియాలో చాటింగ్‌లతో బిజీగా ఉంటూ దేశం కోసం యువతీయువకులు ఆలోచించరని చాలా మంది అపోహ పడుతుంటారు. అలాంటి వారి సమాధానంగా దేశం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు చాలా మంది.
సోషల్‌ మీడియా ద్వారా తెలిసింది
దేశ సరిహద్దులో ఎంతో మంది సైనికులు ప్రాణాలను కోల్పొతున్నారు. కానీ మనం ఇక్కడ ఏమీ పట్టనట్టు సంతోషంగా ఉంటున్నాం. మన ఆర్మీకి మౌలిక వసతులు, అధునాతన పరికరాలు సమకూర్చేందుకు భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తోంది. మనం కూడా కొంత మేరకు సహాయం చేయగలిగితే మరింత ఉపయోగపడుతుంది. ఆర్మీకి సహాయం చేసేందుకు అకౌంట్‌ ఉందని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్నా. నా వంతు సహాయంగా గత ఆరు నెలల నుంచి రూ.100 జమ చేస్తున్నా.
- కొండ శ్రీకాంత్‌రెడ్డి, బేగంపేట
నా వంతు సహాయంగా...
ఆర్మీకి చేయూతనందించేందుకు అకౌంట్‌ ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. నా వంతు సహాయంగా కొంత నగదు అకౌంట్‌ ద్వారా జమ చేస్తాను. మరి కొందరు ఆ పని చేసేలా కృషి చేస్తాను.
-శౌరిప్రసాద్‌, బ్యాంక్‌ ఉద్యోగి
మంచి ఆలోచన
దేశం కోసం పోరాడుతున్న సైనికుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం అకౌంట్‌ను అధికారికంగా అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం. దీన్ని పౌరులు బాధ్యతగా తీసుకుని అకౌంట్లో వారికి చేతనైనంత నగదును జమ చేయాలి. దేశాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడాలి.
-శ్రీనేష్‌ కుమార్‌, సైనిక సంక్షేమ అధికారి
జమ చేయాల్సిన అకౌంట్‌
"Army Welfare Fund Battle Casualties"
Account Number 90552010165915.
Syndicate Bank,
South Block Branch, New Delhi
(IFSC Code: SYNB0009055)

ఇలా చేస్తే...

దేశ జనాభా సుమారు 126 కోట్లు.
రోజుకు ఒక్క రూపాయి జమ చేస్తే నెలకు రూ.3780 కోట్లు.
ఏడాదికి రూ. 45360 కోట్లు.
ఓ సారి ఆలోచించండి ఒక్కరు ఒక్క రూపాయి కేటాయిస్తేనే ఇంత నగదు ఇస్తున్నాం. ఇంకాస్త పెంచితే...? ప్రతి పౌరుడు బాధ్యతగా ఆర్మీకి చేయూతనందిస్తే ప్రపంచంలోనే శక్తివంత దేశంగా భారత్‌ తయారవుతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)