వేలకోట్ల ఆస్తికి వారసుడు తండ్రి ఆజ్ఞ మేరకు రూ. 500తో హైదరాబాద్ చేరుకుని నెల రోజుల పాటు కూలీగా పనిచేశాడు

  • అతడు 23ఏళ్ల కుర్రాడు. అంతేగాక, గుజరాత్‌లో ఓ ప్రముఖ వ్యాపార కుటుంబానికి, వేలకోట్ల ఆస్తికి వారసుడు. దాదాపు రూ. 6 వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి కాబోయే అధిపతి. అయితే, తండ్రి ఆజ్ఞ మేరకు ఓ అనామకుడిగా, జేబులో రూ. 500తో హైదరాబాద్ చేరుకుని నెల రోజుల పాటు కూలీగా పనిచేశాడు. తండ్రి సూచించినట్టుగా బతికి చూపించాడు. సామాన్యుల బతుకు ఎలా ఉంటుందో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు. అతనే హితార్థ్ డోలాకియా. హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ యజమానులలో ఒకరైన శివ్‌జీ డోలాకియా కుమారుడు. శివ్ జీ పండగల సందర్భంగా తమ సంస్థలోని ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లు బహుమతులుగా ఇచ్చి ఇప్పటికే వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. కాగా, నెల రోజుల అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత, హితార్థ్ సోదరి కృపాలి, పెదనాన్న తదితరులు హైదరాబాద్ రాగా.. మొత్తం విషయాన్ని ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది మీడియాకు తెలిపారు.
  • ఆ వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి ఘన్‌శ్యాం డోలాకియా. ఆ సంస్థ టర్నోవర్‌ దాదాపు రూ.6,000 కోట్లు. డోలాకియా కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ముల పిల్లలలో వ్యాపారంలోకి అడుగుపెట్టేవారు ఖచ్చితంగా నెలరోజులపాటు తమకు సంబంధం లేని, పరిచయం లేని ప్రాంతంలో స్వయంకృషితో.. అత్యంత సామాన్యుడిలా జీవించాలి. అదే కుటుంబానికి చెందిన హితార్థ్‌ ఘన్‌శ్యాం డోలాకియా కూడా ఈ సంప్రదాయాన్ని పాటించాడు.
  • 23ఏళ్ల హితార్థ్ డొలాకియా అమెరికాలోని న్యూయార్క్‌లో చదువుకున్నాడు. అక్కడే పైలెట్‌ కోర్సు కూడా చేశాడు. వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే ముందు తమ కుటుంబ ఆచారం ప్రకారం అజ్ఞాతవాసానికి సిద్ధమయ్యాడు. తండ్రి ఇచ్చిన రూ. 500 జేబులో పెట్టుకున్నాడు. దీంతోపాటు కవరులో ఒక ఫ్లైట్‌ టికెట్‌ అందుకున్నాడు. ఎక్కడికో మాత్రం తెలియదు. కానీ, ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. కవర్‌ తెరిచి చూస్తే అందులో హైదరాబాద్‌కు ఫ్లైట్‌ టికెట్‌ కనిపించింది. తండ్రి ఆజ్ఞతో అలా హైదరాబాద్‌ నగరంలో అడుగుపెట్టాడు.
  • హైదరాబాద్‌లో విమానం దిగిన తరువాత బస్సులో సికింద్రాబాద్‌ చేరుకున్నారు మితార్థ్. అక్కడే ఓ లాడ్జీలో రూ.100కు ఒక రూమ్‌ తీసుకుని ఒకరోజు గడిపాడు. ఒక వ్యవసాయదారుడి కుమారుడినని. ఉద్యోగం కోసం వచ్చానని అక్కడున్న వారితో చెప్పాడు. అలా ఉద్యోగ వేటలో చాలామందిని కలిశాడు. ఒక్కొక్కరూ ఒక్కో సలహా ఇచ్చారు. ఉద్యోగం దొరికే ప్రాంతాల గురించి సూచించారు.
  • ఓ బస్సు కండక్టర్‌ చెప్పినట్లు అమీర్‌పేటలో దిగి లాల్‌బంగ్లా సమీపంలో ఉన్న ఒక టెలీకాలర్‌ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఉద్యోగం గురించి ప్రయత్నించగా ఓ మహిళ హైటెక్‌సిటీలో ఒక ఉద్యోగం గురించి చెప్పడంతో సరేనన్నాడు. రూ.500 చేతిలోపెట్టి.. ముందు భోజనం పెట్టించి తర్వాత అక్కడికి వెళ్లమన్నారు. కానీ, ఆ ఉద్యోగంలో కదురుకోలేక కొద్దిరోజుల్లోనే మానేసి మెక్‌డీలో చేరాడు. అక్కడ ఒక్కోరోజు ఒక్కో కేంద్రంలో పని చేయాల్సిరావడంతో దాన్నీ వదులుకున్నాడు. అక్కడి నుంచి నైకీ కంపెనీ, తర్వాత అడిడాస్‌లో వారం పని చేశాడు. ఆపై మళ్లీ సికింద్రాబాద్‌కు వచ్చేశాడు
  • బన్సీలాల్‌పేటలోని వైట్‌బోర్డు తయారీ కంపెనీలో పని చేరాడు. ఇక్కడున్నంత కాలం చాలా ఇరుకు ప్రాంతాల్లో.. దాదాపు మురికివాడలో ఉండాల్సి వచ్చింది. ఒకసారైతే ఓ రిక్షా కార్మికుడితో కలిసి ఉండాల్సి రాగా, మరికొన్నాళ్లు ఓ సాధువుతో కలిసి ఓ గదిలో బతకాల్సి వచ్చింది. తర్వాత మరో చిన్న ఉద్యోగంలో చేరినా అక్కడా ఇరుకుగదిలోనే ఉన్నాడు.
  • చాలాసార్లు రోడ్డు పక్కన బండి మీద పెట్టి అమ్మే టిఫిన్లు, అన్నం తినేవాడు. మొత్తం మీద అతని నెలరోజుల పరీక్ష పూర్తయింది. దీంతో తాను ఎక్కడ ఉన్నాడో ఇంట్లోవాళ్లకు చెప్పగానే వాళ్లు వెంటనే హైదరాబాద్ వచ్చారు. అతడ్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. కాగా, ఈ విషయం తెలిసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ త్రివేది మీడియా సమావేశం ఏర్పాటుచేసి అతడి వివరాలు వెల్లడించారు.
  • హైదరాబాద్ తనకెంతో నచ్చిందని, తాను ఓ సాధారణ యువకుడిగా కనిపించలేక పోయానని హితార్థ్ చెప్పాడు. అయితే, తనకు తారసపడిన వారంతా సాయం చేయాలనే చూశారని హితార్థ్ వెల్లడించారు. ఉద్యోగం కావాలని చెబితే.. ఎంతో మంది సాయం చేయాలని భావించారని, ఈ నెల రోజుల జీవితం ఎన్నో పాఠాలను నేర్పిందని అన్నారు.
  • ఈ నెలరోజులు సాధారణ వ్యక్తిగా అందరి ప్రేమను పొందగలిగానని, తాను ఎవరినో తెలియకున్నా భాగ్యనగరం తనను అక్కున చేర్చుకుందని తెలిపాడు. మన చుట్టూ ఉన్న వారికి.. మనని నమ్ముకుని బతికేవారికి మనం ఏం చేస్తే సంతోషిస్తారో అది తాను నేర్చుకున్నానని హితార్థ్ తెలిపాడు. ఈ నగరం చాలా అందంగా ఉందని, మళ్లీ మళ్లీ వస్తానని చెప్పారు. కాగా, హితార్థ్ సోదరుడు గతంలో ఇదే విధంగా అజ్ఞాతవాసం చేసి కేరళలో కూలీగా పనిచేస్తూ నెల రోజులు గడిపాడు. కాగా, ఈ సంప్రదాయం చాలా బాగుందని పలువురు ప్రశంసిస్తున్నారు.
Loading...

తాజా వార్తలు