ఉద్యోగాన్ని వదులుకోలేక అటు బిడ్డను ఇంట్లో వదిలిపెట్టలేక బస్సులోనే కండెక్టరమ్మ ఆలనా పాలనా ఓపిక, సహనానికి సలాం

పసికందుకు పాలు పడుతున్న ఈ తల్లిని చూశారా… పేరు అలియా జహాన్. ఆర్టీసీలో కాంట్రాక్ట్ కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు. 8నెలల పసికందును భూజాన వేసుకుని కండక్టర్ గా పనిచేస్తూనే.. మరోవైపు ఆ బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆమె బాధ లోకానికి తెలిసింది.

వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన అలియా.. 2012లో రవీందర్ ను మతాంతర వివాహం చేసుకుంది. అప్పటి నుంచి రెండు కుటుంబాలు వీరిని చేరదీయలేదు. భర్త రవీందర్‌ పెద్దశంకరంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. తను ఆర్టీసీలో చేరింది. అయితే రెండుసార్లు ఆమె ఉద్యోగం రెగ్యులరైజ్ కాబోయి.. చేజారింది.

2013లో బాబు పుట్టడంతో 6 నెలలు ప్రసూతి సెలవులో వెళ్లింది. అదే సమయంలో తనతో పనిచేసే వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్‌ అయ్యాయి. మరోమారు బిడ్డ పుట్టడంతో ప్రసూతీ సెలవుపై వెళ్లింది. ఆ సమయంలో 2015–16 మధ్య కాలంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన వారి సర్వీసును రెగ్యులరైజ్‌ చేశారు. ప్రసూతి సెలవులో ఉండడంతో మరోసారి క్రమబద్ధీకరణ అవకాశాన్ని కోల్పోయింది.

ఎప్పటికైనా రెగ్యులరైజ్‌ అవుతుందనే ఆశతో అటు ఉద్యోగాన్ని వదులుకోలేక, ఇటు బిడ్డను చూసుకునే వారు లేక ఇబ్బందులు పడుతోంది. నారాయణఖేడ్‌ – హైదరాబాద్‌ మార్గంలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులో ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటోంది. తనపై వార్తలు వస్తే అధికారులు ఉద్యోగం నుంచి తొలగిస్తారేమోననే అలియా ఆందోళన వ్యక్తం చేసింది.
Loading...

తాజా వార్తలు