అద్దెకు ఉండేవాళ్ళు చనిపోవడం కూడా నేరమేనా ? అద్దెకు ఉండేవాళ్ళు స్వేచ్చగా బ్రతకలేకపోయినా స్వేచ్చగా మరణించలేకపొతున్నారు

నేరం..
ఏది నేరం..?
మనిషిగా పుట్టడం నేరమా..?
పుట్టిన మనిషి మరణించడం నేరమా..?
ఇప్పుడు నగరంలో మరణమూ ఓ నేరమే..
మన కష్ట సుఖాల్లో కలిసి నడిచిన వాైళ్లెనా సరే..
శవమై వస్తే వెలివేస్తారిక్కడ..
నిత్యం నగరంలో ఏదో ఓ మూల
ఇలాంటి వెలివేతలు జరుగుతూనే ఉన్నాయి..
ఇది కాదనలేని కఠోర నిజం..
ఇంతకూ ఆ మృతదేహాలు చేసిన
నేరమేమిటనుకుంటున్నారా..?
సొంత ఇల్ల్లు లేకపోవడమే..
అద్దె ఇంట్లో ఉండడమే..
అవును.. అద్దె ఇంట్లో మీకు చనిపోయే హక్కులేదు..
చనిపోతే... ఏ ఆసుపత్రిలోనో, ఏ రోడ్డు మీదో చనిపోవాలి..
అటునుంచి అటే నేరుగా శ్మశానానికి తరలిపోవాలి..
ఇంట్లోనే మరణించారా? మరు నిమిషంలో మృతదేహం రోడ్డున పడుతుంది. మీ ఆప్తులెవరికీ చివరి చూపు కూడా దక్కదు..
ఈ వెలివేతలు కోపం వల్ల కాదు.. మెదళ్లలో నాటుకున్న మూఢత్వం వల్ల.. శవాన్ని ఇంట్లో ఉంచితే.. కీడు జరుగుతుందేమోనన్న భయంతో.. అందుకే.. మానవత్వాన్ని సైతం మర్చి.. మృతదేహాలను అవమానిస్తున్నారు.. మనుషులుగా దిగజారిపోతున్నారు..
చనిపోతే చాలు.. వెలివేస్తున్నారు
కిరాయిదారులు చనిపోతే... శ్మశానమే దిక్కు
పార్థివ దేహాన్ని ఇంటికి తేవద్దంటూ యజమానుల ఆంక్షలు
మూఢ విశ్వాసాలతో మానవత్వం మర్చిపోతున్న వైనం
అది అమానవీయం, మహాపాపం అంటున్న పండితులు
హక్కుల ఉల్లంఘనే అంటున్న న్యాయ నిపుణులు
ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు.. అద్దెకు ఉండే వారందరి సమస్య. అద్దె ఇంట్లో ఉండేవాళ్లు ఎవరైనా చనిపోతే... ఇంటి ఆవరణలోకి కూడా తీసుకురానివ్వరు. ఒకవేళ ఇంట్లోనే చనిపోతే ఉన్నపళంగా శవాన్ని తరలించాలని గొడవ చేస్తారు. అవసరమైతే అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయిస్తారు. నగరంలో అద్దెకు ఉండే ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక్కసారైనా ఎదురయ్యే అనుభవం ఇది. ఆప్తులను కోల్పోయిన విషాదం ఆవరించిన కుటుంబానికి అనూహ్యమైన అవమానం ఎదురవుతుంది. కడసారి చూపు కోసం కన్నబిడ్డలకు కూడా అవకాశం ఇవ్వని స్థితిని ఇంటి యజమానులు కల్పిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
మనిషి జీవితంలో సహజమైన ప్రక్రియ మరణం. అది అనివార్యమైంది. పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పక చేరుకోవల్సిన గమ్యం. కానీ మరణంపై సమాజంలో ఒక తప్పుడు అవగాహన నెలకొని ఉండడం విషాదం. తండ్రిగానో - తల్లిగానో , భర్తగానో - భార్యగానో, స్నేహితుడిగానో - స్నేహితురాలిగానో, కొడుకుగానో - కూతురుగానో జీవితమంతా మనతో పాటు కలిసి జీవించిన మనుషులు వాళ్లు. గౌరవంగా చివరి వీడ్కొలు పొందాల్సిన వాళ్లు. కానీ... అపోహలు, తప్పుడు అవగాహనలతో సమాజం శవాల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నది. ఫలితంగా అందరూ ఉండి కూడా ఎవరూ లేని వాళ్లుగా వెళ్లిపోతున్నారు. అది.. వాళ్లని అవమానించడమే అవుతుంది.
చదువుకున్న వారే ... అలా చేస్తే
పెళ్లికి వెళ్లకపోయినా సరే... చివరి చూపుకైనా వెళ్లడం ధర్మసమ్మతమని ఉవాచ. కానీ నగరంలో అద్దె ఇంట్లో నివసించే వాళ్లకు మాత్రం కనీసం ఆ గౌరవం కూడా దక్కడం లేదు. మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని అభ్యంతరం చెప్పే వాళ్లలో ఎక్కువ మంది చదువుకున్న వారే ఉండడం గమనార్హం. చదువుకోవడం వల్ల అబ్బిన జ్ఞానం కంటే... మూఢ విశ్వాసాలే వాళ్ల మెదళ్లలో బలంగా నాటుకోవడమే అందుకు కారణమంటున్నారు సామాజిక కార్యకర్తలు. అపార్ట్‌మెంట్‌లలో సైతం ఇలాంటి వాతావరణం కొనసాగుతుండడం గమనార్హం.
నగరంలో మెజార్టీ అపార్టుమెంట్లే కనిపిస్తాయి. అపార్ట్‌మెంట్‌లలో అద్దెకు ఉండేవాళ్లకు సైతం ఇలాంటి సమస్య ఎదురవుతోంది. అపార్ట్‌మెంట్ యజమానులు, లేదా పక్కన అద్దెకు ఉండేవాళ్లు శవాన్ని తీసుకు రావద్దని నిష్కర్షగా చెప్పేస్తున్నారు. కాగా... అపార్ట్‌మెంట్లలో సొంత ఫ్లాట్ ఉన్న వారిపై ఇలాంటి ఆంక్షలు తక్కువగా కనిపిస్తున్నాయి.
నిజంగా కీడు జరుగుతుందా?
ఇంట్లో ఎవరైనా చనిపోతే కీడు జరుగుతుందనే భావనతో ఇంటి యజమానులు మృతదేహాన్ని తీసుకురావడంపై అభ్యంతరం చెబుతుంటారు. కానీ అది కేవలం మూఢ నమ్మకం మాత్రమే అంటున్నారు ధర్మశాస్త్ర నిపుణులు. చనిపోయిన వారికి గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో పాటు బంధు మిత్రులంతా అంత్యక్రియల్లో పాల్గొనాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఎవరైనా చనిపోవడం వల్ల, లేదా మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల ఎలాంటి కీడూ జరగదని అంటున్నారు. కాకపోతే శవాన్ని నాలుగైదు రోజులు ఉంచడం సరైంది కాదంటున్నారు పండితులు. ఇంట్లో ఎవరైనా చనిపోతే సూర్యాస్తమయం లోపు మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని శాస్త్రం చెబుతోంది. కానీ ప్రస్తుతం ఫ్రీజర్స్ వచ్చాక మృతదేహాన్ని నాలుగైదు రోజుల పాటు ఉంచుతున్నారు. ఇది సరైంది కాదు అంటూ చెప్పుకొచ్చారు చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు డాక్టర్ రంగరాజన్.
మనోవేదనకు గురిచేయొద్దు
చనిపోయిన వ్యక్తులను గౌరవించడం పరిణతి చెందిన సమాజం ఆచరించే లక్షణం. దేశ సరిహద్దుల్లో చనిపోయిన వారి మృతదేహాలను కూడా అత్యంత బాధ్యతతో వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. కానీ కళ్లముందు మరణించిన వారిని కడసారి చూసుకునే అవకాశం లేకుండా హడావుడిగా శ్మశాన వాటికకు తరిమేస్తున్నారు. ఇది కేవలం చనిపోయిన వ్యక్తులను అవమానించడమే కాదు. బతికున్న వారిని మనోవేదనకు గురిచేయడమని, ఇది హక్కుల ఉల్లంఘన అవుతుందంటున్నారు న్యాయ నిపుణులు. కుటుంబ సభ్యులను మనోవేదనకు గురిచేసిందుకు ఇంటి యాజమాన్యాలపై కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంటుందంటున్నారు.
మనం ఇంకా అనాగరికులమేనా?
పెరుగుతున్న నగరీకరణతో పాటు మనుషుల్లో అనాగరిక స్వభావం పెరుగుతోందనడానికి ఈ ఒరవడి ఒక ఉదాహరణ. ఇంటి యజమానుల ఆంక్షల వల్ల తమలో ఒకరిని కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు తీవ్ర వ్యధను మోయాల్సి వస్తున్నది. నలుగురు కూడేందుకు కూడా అవకాశం లేకుండా నేరుగా స్మశాన వాటికకు తరలించాల్సి రావడం పెద్ద విషాదం.
ఇంటి యజమానుల నుంచే కాదు.. అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు అన్ని దశల్లోనూ పార్థివ దేహంతో బేరాలాడేవారే తారసపడతారు. అంబులెన్స్ దగ్గర నుంచి శ్మశానానికి చేరవేసే వరకు అమ్మో మృతదేహం.. అంటారు. భారీగా డబ్బు డిమాండ్ చేస్తారు. మాయమైపోతున్న మనుషులకు, మృగ్యమైపోతున్న విలువలకు, దిగజారిపోతున్న మృదుత్వానికి నిలువుటెత్తు దర్పణం ఇది.
ఇంట్లోకి రానీయకుండా అడ్డుకుంటే.. చట్టం ఒప్పుకోదు
ఇంట్లో ఎవరైనా కిరాయికి ఉన్నందుకు ఇంటి యజమాని ప్రతినెలా కొంత నగదును వసూలు చేస్తారు. శుభకార్యాలు, విందు, వినోదాలకైతే సంతోషంగా అనుమతినిస్తారు. అదే ఆ ఇంట్లో మొన్నటి వరకు తమతో కలిసిమెలిసి ఉన్న వ్యక్తి శవంగా వస్తే ఇంటి గడప లోపలకే రానివ్వరు. అలా రానివ్వకుండా అడ్డుకునే హక్కు ఇంటి యజమానికి చట్టం కల్పించదు. జీవించడానికి ఎలాంటి స్వేచ్ఛ ఉందో మరణానంతరం పార్థివ శరీరాలకు ధర్మనిష్టల ప్రకారం స్వేచ్ఛగా ఖననం చేసుకునే అవకాశాన్ని చట్టం కల్పించింది. బిల్డింగ్ లీజ్ రెంట్ ఎవిక్షన్ కంట్రోల్ యాక్టు-1960 ప్రకారం అద్దెదారులకు కొన్ని హక్కుల్ని చట్టపరంగా కల్పించారు. ఇందులో జీవించే, మరణానంతరం కర్మలకు సంబంధించిన హక్కులుంటాయి.
ఇంటి యజమానితో సమానమైన హక్కుల్ని ఆ భవనంపై కిరాయిదారులు కలిగి ఉంటారు. తాము నివసించే భవనంలో యజమానికి ఎలాంటి వసతులుంటాయో, స్వేచ్ఛ ఉంటుందో అదే కిరాయిదారులకు కూడా వర్తిస్తుంది. కిరాయిదారు కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఇంట్లోకి రానివ్వకుండా మృతదేహాన్ని అడ్డుకునే అధికారం యజమానికి ఉండదని న్యాయనిపుణులు చెబుతున్నారు. సొంత ఇల్లు, అయిన వారు లేని సమయంలో అద్దె భవన కుటుంబం, చుట్టుపక్కల నివసించే వారి సహకారంతో ధర్మనిష్టల ప్రకారం ఖననం చేసుకోవచ్చని చట్టం చెబుతున్నది. వీటిని ఉల్లంఘిస్తే అది చట్టవిరుద్ధమవుతుంది.
పాశ్చాత్య దేశాల్లో..
పాశ్చాత్య దేశాల్లో స్వేచ్ఛగా జీవించే అవకాశాలు కల్పించడంతో పాటు మరణానంతరం ఎంతో పవిత్రంగా మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఎక్కడా మృతదేహాల పట్ల నిర్లక్ష్యం, అశ్రద్ధ కనిపించదు. మన దగ్గర తరచూ కనిపించే అమానవీయ ఘటనలు అక్కడ ఒక్కటి చోటుచేసుకున్నా దాన్ని ఆ దేశాలు చాలా తీవ్రమైన అంశంగా పరిగణించి అప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడతాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా దేశాల్లో ఇలాంటి పరిస్థితులున్నాయి.
నష్ట పరిహారం
అంతిమ సంస్కారాలకు భంగం కలిగించి, కుటుంబ సభ్యులను వ్యథకు గురిచేసిన సందర్భంలో ఇంటి యజమానిపై నష్టపరిహారాన్ని కోరవచ్చు. తమ మత విశ్వాసాలకు భంగం కలిగించడంతో పాటు, అంతిమ సంస్కారాలు జరగకుండా తమ మనోభావాలు దెబ్బతీశారంటూ కోర్టును ఆశ్రయించవచ్చు. మృతదేహాన్ని అవమానిస్తే మానవ హక్కుల కమిషన్‌ను సంప్రదించవచ్చు.
- ఎమ్మడి పార్వతీ దేవి, అడ్వకేట్, హైకోర్టు
ఫిర్యాదు చేయవచ్చు
పార్థీవ శరీరాలకు జరిగాల్సిన క్రియలన్నీ సక్రమంగా జరపాలి. అలా కాకుండా అడ్డుకుంటే హక్కుల్ని కాలరాసినట్లే. అలా ఎవరు చేసినా హక్కుల ఉల్లంఘన జరిగిందని రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు
-సాయికృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్
అరిష్టం జరుగుందనే భయంతో..
ధనిష్ట పంచమి(దోషాలు) వల్ల ఇబ్బందులు కలుగతాయనే భావన చాలా మందిలో ఉంటుంది. మంగళ, శని దోషాలను నమ్ముతారు. శవం తోడు కోరుకుంటుందని చెబుతుంటారు. అందుకే చాలా మంది శవాన్ని ఇంట్లోకి తేనివ్వడం లేదు. మూఢ నమ్మకంతో ఇలా చేస్తున్నారు. శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్లిన తరువాత ఉండే దోషాలను పోగొట్టుకుంటే సరిపోతుంది. అయినా మానవత్వం ముందు ఏదీ పనికిరాదు.
-సత్యం, పూజారి, న్యూరామాలయం, నల్లకుంట
ఇంట్లోకి రానీయకుండా చేయడం మహా పాపం
పార్థివ దేహాన్ని ఇంట్లోకి రాకుండా ఆపడం కానీ, అవమానించడం గానీ, రోడ్డుపైన పెట్టడం గానీ చేయకూడదు. దానికి శాస్ర్తోక్త సంస్కారాలు జరిగేలా చూడడం ప్రతి ఒక్కరి విధి. అంతే తప్ప ఏ రకంగా కూడా అడ్డుతగలకూడదు. చనిపోయిన వారిని ఏ రూపంలో అవమానించినా పితృదేవతలు క్షోభిస్తారు. అలా చేసిన వారికి అది మంచి చేకూర్చదు. నిజానికి.. భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకురావడం దాన్ని బంధుమిత్రుల సందర్శన కోసం ఉంచడం అత్యంత మానవీయ కార్యం. అందరూ ఆచరించదగినది. అంతే తప్ప ఇంటికి శవాన్ని రానీయకపోవడం, అపార్టుమెంట్లలో.. శవాన్ని పంపించేందుకు తొందరపెట్టడం మన మానసిక మరుగుజ్జుతనానికి నిదర్శనం. కిరాయిదారులు కావొచ్చు లేదా వీధిలో పక్కింటివాళ్లు కావొచ్చు. శవాన్ని ఇంట్లోనే ఉంచడం, కర్మక్రతువులకు సహకరిస్తే ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుంది. అశౌచపద్ధతుల పట్ల అవగాహన రాహిత్యం వల్లే ఇలాంటి అధర్మపు ఆలోచనలు బలపడుతున్నాయి. అది ముమ్మాటికీ తప్పు.
- గొల్లపెల్లి సంతోష్‌కుమార్ శర్మ, ఆధ్యాత్మిక వేత్త
అది మూఢత్వమే
పెళ్లికి వెళ్లి అభినందనలు చెప్పడం కంటే కూడా... చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం, అంతిమక్రియల్లో పాల్గొనడమే ముఖ్యమైంది. ఎలాంటి శత్రుత్వమైనా మరణంతో పోతుంది. రావణాసుడికి దహన సంస్కారాలు నిర్వహించడానికి అతడి తమ్ముడు విభూషణుడు నిరాకరించినప్పుడు శ్రీరాముడే రావణాసురుడి దహనసంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమవుతాడు. అంతిమ సంస్కారాలకు ఉండే ప్రాధాన్యత అది. ఈ విషయంలో రాముడే స్ఫూర్తి. అందుకే... చనిపోయిన వారిని అవమానించడం తగదు. అది మానవత్వాన్ని మరిచి మూఢత్వంతో వ్యవహరించడమే.
- డాక్టర్ రంగరాజన్, చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు
పార్థివ దేహాన్ని గౌరవించండి
హిందూ ధర్మ శాస్రాలు ఏం చెబుతున్నాయంటే పుట్టుక, మరణమూ రెండూ ఒకటే. ఈ లోకంలోకి రావడమూ ఈ లోకం నుంచి పోవడమూ రెండు సృష్టి ధర్మమే. శవాన్ని చూసి చీదరించుకోవడం మహా పాపం. అది.. లోకం విడిచి వెళ్లిపోయిన వ్యక్తులను అవమానించడమే. గరుడ పురాణం ప్రకారం భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించడం మహా పుణ్యాన్ని సంప్రాప్తింపజేసే ప్రక్రియ. ఎటువంటి దోషమూ ఉండదు. బంధువులైనా కాకపోయినా, స్నేహితులైనా కాకపోయినా, పరిచితులైనా; అపరిచితులైనా అంత్యక్రియలను నిర్వర్తింపజేసేందుకు చుట్టుపక్కల వాళ్లు సహకరించాలి. వాళ్లను ఇబ్బంది పెట్టేలా కర్మకాండకు అభ్యంతరపెట్టడం మహాపాపం. ధర్మం పట్ల వారికున్న అజానమే తప్ప మరొకటి కాదు. పార్థివ దేహాన్ని, కర్మకాండను గౌరవించడం భారతీయ సంస్కృతి అని మరిచిపోకూడదు
-బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి, ఆధ్యాత్మిక ప్రవచకుడు
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)