చంద్రశేఖర్ ఆజాద్ చెప్పిన ఒక్క మాట నెహ్రు చేసుంటే ఆ రోజు ఇండియా పరిస్థితి మరోలా ఉండేది

దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడిగా బ్రిటీషువారి గుండెల్లో రైల్లు పరిగెత్తించిన ఈయన మనదేశం గర్వించదగ్గ అసమాన వీరుడు. భగత్ సింగ్‌కు మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తిపేరు చంద్రశేఖర సీతారామ్ తివారి. ఈయన పండిత్‌జీగా కూడా పేరుపొందారు. మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లా, బావ్రా గ్రామంలో పండిట్ సీతారామ్ తివారి, జగరానీ దేవీ దంపతులకు 1906 జులై 23న చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత ఈయన వారణాసిలోని సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు.
1919 జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలతచెందిన ఆజాద్ దీనికి నిరసగా మహాత్మాగాంధీ 1921లో నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు పదిహేనేళ్ల వయసులో జైలుకు వెళ్లారు. విచారణ సందర్భంగా న్యాయస్థానంలో మెజిస్ట్రేట్ "నీ పేరేంటి?" అని అడిగితే నా పేరు "ఆజాద్", మా నాన్నపేరు స్వతంత్రం, మా ఇల్లు జైలు అంటూ గొంతు చించుకుని చెప్పారు. దీంతో మెజిస్ట్రేట్ 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. అయితే ప్రతి కొరడా దెబ్బకు ఆయన భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినదించారు. ఇక అప్పటి నుంచి చంద్రశేఖర్ ఆజాద్‌గా ఆయన పేరు స్థిరపడిపోయింది.
సహాయ నిరాకరణోద్యమం ఆజాద్‌లోని విప్లవవాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే దేశాన్ని బ్రిటీష్‌వారి కబంధ హస్తాల నుంచి కాపాడి, భారతమాతకు దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించాలని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. 1924 ఆగస్టు 9 న జరిగిన కకోరి కుట్ర కేసుతో అజాద్ పేరుతో దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ కేసులో కొంత కాలానికి ఆజాద్ తప్ప మిగతా ఆ విప్లవవీరులు పోలీసుల చేతికి చిక్కారు. ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను స్థాపించి భగత్ సింగ్, సుఖదేవ్ లాంటి దేశభక్తులకు మార్గనిర్దేశకుడిగా మారారు.
1928లో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన పంజాబ్ కేసరి లాలాలజపతిరాయ్ మృతికి ప్రతికారం తీర్చుకోవాలని భావించారు. దీనికి కారణమైన స్కౌట్స్ అనే పోలీస్ అధికారి హత్యకు తన అనుచరులై రాజ్ గురు, భగత్ సింగ్‌లతో కలిసి పథకం వేశారు. అయితే స్కౌట్ తృటిలో తప్పించుకున్నా, సాండర్స్ అనే అధికారిని కాల్చి చంపగా, అతడి వెంట వచ్చిన హెడ్ కానిస్టేబుల్ రాండ్‌ను అజాద్ కాల్చి చంపాడు. ఈ ఘటనలో ఆజాద్, భగత్‌సింగ్, రాజ్‌గురులపై కేసు నమోదు చేశారు. అంతే కాదు యూపీ, పంజాబ్ ప్రభుత్వాలు ఆజాద్‌ను సజీవంగా పట్టుకునే ప్రయత్నం చేశాయి. ఆయనను ప్రాణాలతో తీసుకొచ్చినా లేదా చంపినా రూ.30 వేల రివార్డు ప్రకటించాయి.
ఇంతలో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు పార్లమెంటుపై దాడి కేసులో న్యాయస్థానం వారికి ఉరి శిక్ష విధించింది. ఈ సంఘటనతో ఆజాద్ ఎంతో కలత చెంది, వారిని విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా 1931 పిబ్రవరి 27 తెల్లవారుజామున జవహర్‌లాల్ నెహ్రూని కలిసిన ఆజాద్ ఈ ముగ్గురి వీరులను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు. కాని నెహ్రూ ఏ సమాధానం చెప్పలేదు.
దీంతో నిరాశ చెందిన ఆజాద్ అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్కులో తన అనుచరులతో భగత్ సింగ్ తదితరులను ఎలా విడిపించాలో చర్చలు జరుపుతున్నాడు. ఆ చర్చల్లో పాల్గొన్న వారిలో పోలీసులున్నారని ఆజాద్‌కు అనుమానమొచ్చింది. వెంటనే తన దగ్గరున్న తుపాకితో ముగ్గురు పోలీసులను హతమార్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు అజాద్‌ను చుట్టుముట్టారు. తన తుపాకీలో ఒక తూటానే మిగిలి ఉంది. అది మరొకని ప్రాణం మాత్రమే తీయ గలదు. ఆ తర్వాత తాను పట్టుబడటం ఖాయం అని తెలిసిపోయింది. వీరికి పట్టుబడటం కంటే ఆత్మార్పణం చేయడమే ఉత్తమని భావించిన ఆజాద్, పోలీసుల వైపు గురిపెట్టబడిన తన తుపాకి తన తలవైపునకు మళ్లించి అసువులు బాసాడు. 25 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన చంద్రశేఖర ఆజాద్ అమరుడయ్యాడు.. ఇది జరిగిన రోజుకి సరిగ్గా 25 రోజుల తర్వాత భగత్ సింగ్‌ను ఉరి తీశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)