గురుపౌర్ణమికి సాయిబాబాకూ ఏమైనా సంబంధం ఉందా ? అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో తెలుసుకోండి

గురు పౌర్ణమి… గురువారం ఎలాగైతే సాయివారం అయిపోయిందో… గురువు అనగానే సాయిబాబా గుర్తుకురావడం సహజమైపోయింది… ప్రత్యేక పూజలు, దర్శనాలు గట్రా… సాయిబాబా గుళ్లు కిక్కిరిసిపోతాయి… గుడ్… వెళ్లండి… దర్శించండి… పూజించండి… తప్పులేదు… ఎంతోకొంత ఆధ్యాత్మిక భావన మీ మెదళ్లలో పెరిగితే మంచిదే… అయితే నిజానికి గురు పౌర్ణమికీ సాయిబాబాకూ సంబంధం ఏమిటి..? నిజంగా విశ్లేషిస్తే ఏమీ లేదు… కాకపోతే అనేకులు సాయిబాబాను గురువుగా భావించి పూజిస్తారు కాబట్టి గురు పౌర్ణిమ నాడు సాయిబాబా పూజకు ప్రాధాన్యం ఇస్తారు… సరే, మంచిదే… ఓసారి గురు పౌర్ణమి అంటే కూడా తెలుసుకుందాం మరి… గురువు అంటే ఎవరో ఓసారి నిర్వచించుకుందాం… చాలామందికి నచ్చకపోయినా సరే ఓ విశిష్ట తిథి ప్రాశస్త్యమేమిటో, ఓ పండుగ పరమార్థం ఏమిటో, ఓ సందర్భం ఎందుకో తెలియకపోతే ఎలా..? అదే ఈ కథనం ఉద్దేశం…
‘‘ఆషాఢ పూర్ణిమను గురు పూర్ణిమగా పిలవటానికి జ్యోతిష్య శాస్త్రరీత్యా ఉన్న కారణం… ఈ పూర్ణిమకు చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటాడు… దాని అధిపతి బృహస్పతి దేవ గురువు… ఈ రోజు సాధారణంగా ఉండే నక్షత్రం పూర్వాషాఢ… ఈ పూర్వాషాఢ నక్షత్ర అధిపతి శుక్రుడు, రాక్షస గురువు… అలాగే దీని అర్థభాగమైన ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు, ధనుస్సు రాశికి భాగ్యస్థానాధిపతి, అంటే గురు స్థానం… అంతే కాకుండా ధనుస్సు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి, అంటే గురువు… మనస్సుకు కారకుడైవ పూర్ణ చంద్రుడు ఇలా గురు స్థానంలో సంచరించే సమయంలో గురు ఆరాధన చేయటం వలన మనసు పూర్తిగా గురువుపై లగ్నమవటమే కాకుండా గురు అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది… అందుకే దీన్ని గురు పౌర్ణమి అంటారు… ఈ గురు పౌర్ణమి రోజు మీ గురువులను శ్రద్ధాభక్తులతో ఆరాధించి గురు అనుగ్రహానికి పాత్రులు కండి…’’
ఎస్… సాయిబాబా దర్శనం చేసుకొండి… పూజలు చేయండి… దత్తాత్రేయ స్వామిని పూజించండి… అంతేకాదు… మరోపని కూడా చేయండి… మీకు చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన ఓ గురువును తలుచుకొండి… వీలు కలిగితే వాళ్లింటికి వెళ్లండి… కాళ్లు మొక్కండి పర్లేదు… కృతజ్ఞతలు తెలపండి… వీలైతే ఓ బొకే ఇవ్వండి… గురుశిష్యులిద్దరిలోనూ ఓ అనిర్వచనీయ అనుభూతి తథ్యం… ఆ గురువు మిమ్మల్ని కౌగిలించుకుని ఆనందబాష్పాలు రాల్చకపోతే నన్నడగండి… అదో అనుభూతి… దానికి నిర్వచనం లేదు… అంతకుమించి గురపౌర్ణమికి సార్థకత ఏముంటుంది..? అరచేతిలో బెత్తాల దెబ్బలతో జీవితాన్ని లైన్‌లో పెట్టిన చిన్నప్పటి గురువుల్ని దర్శించండి… అది మరింత ఆనందం… అసలు కోదండం వేయించిన గురువును అస్సలు మరవకండి… ఆఫ్టరాల్… వాళ్లకు అనిర్వచనీయం… మీకూ అద్భుతం… అది అన్నింటికీ మించిన అద్భుతమైన గురు పౌర్ణిమ…!!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)