బిల్ గేట్స్ ఇంటి ప్రత్యేకతలు ఏంటో చూస్తారా ?

ప్రపంచంలో నెంబర్‌వన్‌ శ్రీమంతుడు ఎవరనగానే గుర్తుకొచ్చే మొదటి పేరు ‘బిల్‌గేట్స్‌’. సంపన్నుడో, బీదోడో.. ఎవరైతేనేం.. ప్రతి మానవుడి మొదటి కల ‘ఓ ఇల్లు’. ప్రపంచ కుబేరుడైనా బిల్‌గేట్స్‌కు ఓ డ్రీమ్‌ హౌజ్‌ ఉంటుంది కదా! అదే ‘జానాడు 2.0’. బిల్‌గేట్స్‌ తన కలల ఇంటిని ఏడు సంవత్సరాల పాటు కష్టపడి నిజం చేసుకున్నాడు.

ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తన కలల సౌధాన్ని అమెరికాలోని వాషింగ్టన్‌లో మెడినాలో నిర్మించుకున్నారు. కోట్ల డాలర్లు వెచ్చించి ఆ ఇంటిని కట్టారు. ‘జానాడు 2.0’గా పిలిచే ఆ ఇల్లే ఓ అద్భుతం. 66,000 చదరపు అడుగుల్లో నిర్మితమైన ఆ ఇల్లు మయసభను తలపిస్తుంది.

వేడిని తగ్గిస్తాయ్‌
బయటి ఉష్ణోగ్రతలు తీవ్రమైనపుడు కూడా ఈ ఇంటి పరిసరాలు మాత్రం చల్లగానే ఉంటాయి. అదే దీని ప్రత్యేకం.

పుస్తకాల కోసమే..
ఇందులోని గ్రంథాలయం అందర్నీ ఆకట్టుకుంటుంది. దాదాపు ఇది 2,100 చదరపు అడుగుల్లో ఉంటుంది. లియోనార్డో డావిన్సీ పదహారో శతాబ్దంలో రచించిన మనుస్ర్కిప్ట్‌ కూడా ఈ లైబ్రరీలో ఉంది. 1994లో జరిగిన వేలంలో బిల్‌గేట్స్‌ ఈ పుస్తకాన్ని 30.8 మిలియన్‌ డాలర్లు పెట్టి కొన్నాడట. ఈ గ్రంథాలయంలో రెండు రహస్య బుక్‌ కేస్‌లు కూడా ఉన్నాయి.

కొలనులో సంగీతం
60 అడుగుల స్విమ్మింగ్‌ పూల్‌ ఆ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అందులోని గ్లాస్‌ వాల్‌ కింద ఉన్న నీటిలో ఈత కొట్టుకుంటూ.. నేరుగా టెర్రస్‌ పైకి రావొచ్చు. అంతేకాదు అండర్‌వాటర్‌ మ్యూజిక్‌ సిస్టమ్‌ కూడా ఉంది. లాకర్‌ గదితో పాటు, నాలుగు షవర్లు, రెండు బాత్రూమ్స్‌ ఉండటం విశేషం.

టచ్‌ చేస్తే చాలు..
ఇంటిలోని ప్రతి గోడ ఓ కాన్వాసే. ఎవరైనా ఆ గోడను టచ్‌ చేస్తే చాలు.. అక్కడున్న కంప్యూటర్‌ స్ర్కీన్‌ ఆన్‌ ఆవుతుంది. అందులో లక్షల ఫొటోలు, పెయింటింగ్‌లు ఉంటాయి. ఎవరికిష్టమైన పెయింటింగ్‌ను వారు పెట్టుకోవచ్చు. ఆ ఇంట్లో దాదాపు 5 కోట్ల విలువ చేసే కంప్యూటర్‌ స్ర్కీన్లు ఉన్నట్లు అంచనా.

ఇంపోర్టెడ్‌ బీచ్‌ సాండ్‌
ఇంటి ముందే ఓ బీచ్‌ ఉంటుంది. ఆ బీచ్‌లోని ఇసుకను ప్రతి సంవత్సరం సెయింట్‌ లూసియా నుంచి ఇంపోర్ట్‌ చేసుకుంటారు.

జలకాలాటలలో
ఈ విల్లాలో మొత్తంగా 24 స్నానపు గదులు ఉన్నాయి.

కసరత్తులకో రూమ్‌
వ్యాయామం కోసమే ప్రత్యేకంగా.. ట్రంపొలిన్‌ గది ఉంది. 2,500 చదరపు అడుగుల వైశాల్యంలో వ్యాయామం సాధన చేయొచ్చు. అందులోనే ఆవిరి గదితో పాటు, పురుషులకు, స్ర్తీలకు ప్రత్యేక లాకర్‌ గదులున్నాయి.

ఆ చెట్టంటే గేట్స్‌కు ప్రాణం
ఈ ఇంటి ఆవరణలో 40 సంవత్సరాల క్రితం నాటి ఆపిల్‌ చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టంటే గేట్స్‌కు చాలా ఇష్టం. అందుకే కంప్యూటర్‌ సాయంతో దానికి 24 గంటలు రక్షణ కల్పిస్తారు. ఆ చెట్టు కాస్త వాడిపోయినట్టు అయితే చాలు.. ఆటోమేటిక్‌గా దానికి నీళ్లు పంప్‌ అవుతాయి.

ఆ గ్యారేజ్‌ ఎంతో భిన్నం..
ఈ విల్లా చుట్టూ ఎన్నో గ్యారేజ్‌లున్నాయి. కానీ అండర్‌గ్రౌండ్‌లో గుహలా నిర్మించిన గ్యారేజ్‌ మాత్రం ఎంతో ప్రత్యేకమైంది. ఇందులో తనకు ఇష్టమైన పది కార్లను పార్కు చేస్తాడట. ఇక మిగతా గ్యారేజ్‌లలో 23కు పైగా కార్లున్నాయి.

సంవత్సరంలో ఓ రోజు
ఏడాదిలో ఓ రోజు మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులు తమ వస్తువులను వేలం వేస్తారు. ఆ వేలంలో వచ్చిన డబ్బును.. కంపెనీ ఛారిటబుల్‌ ఫండ్‌లో జమ చేస్తారు. గేట్స్‌ తన ఇంటికి వేలం ద్వారా ఒకర్ని ఆహ్వానిస్తాడు. ఎన్నో వేల కోట్లు కుమ్మరించి మరీ ఆ ఇంటిని చూడటానికి వస్తారట.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)