ఏసీ వల్ల తీవ్రమైన సమస్యలు.. ఆరోగ్యానికి విపరీతమైన నష్టాలు

ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి చాలా సౌకర్యంగా అనిపించే ఏసీ, మరికొందరి ఆరోగ్యానికి అనర్థాలు తెచ్చిపెట్టవచ్చు. ఏసీ వల్ల ఐదు ప్రధానమైన సమస్యలు వస్తాయి. అవి...
తీవ్రమైన అలసట: చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పని ముగిసే సమయానికి తీవ్రమైన తలనొప్పి, భరించలేనంత నిస్సత్తువగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు.
పొడి చర్మం: సుదీర్ఘకాలం పాటు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది. దాంతో వారి చర్మం పొడిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తమ చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకుంటూ ఉండటం మంచి పరిష్కారం.
దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం: కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే తక్కువ రక్తపోటు (లో బ్లడ్ ప్రెషర్), ఆర్థరైటిస్, న్యూరైటిస్ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ.
అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం: నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు (గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ) ఇక ఏమాత్రం వేడిమిని భరించలేదు. వేసవిలో బయటకు రావడమే వారికి కష్టంగా అనిపిస్తుంది. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు.
శ్వాస సమస్యలు: చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం వల్ల తేలిగ్గా శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అదే ఆరోగ్యకరం.

Popular Posts

Latest Posts