ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అదనపు సంపాదన కోసం ఆన్‌లైన్‌లో బోలెడు అవకాశాలు.. ఆ వివరాలు మీ కోసం

ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అదనపు సంపాదన కోసం ఆన్‌లైన్‌లో బోలెడు అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
  • ఇంటర్నెట్‌ ఉంటే చాలు యూట్యూబ్‌ వీడియోలు చూసేందుకు సమయం కేటాయిస్తారు. అలా కాకుండా మీకు కొంచెం చిన్న సినిమాలు, సందేశాత్మక వీడియోలు తీసే నైపుణ్యం ఉంటే మీరే వీడియో తీసేందుకు ప్రయత్నించవచ్చు. మీ వీడియోకు సగటు వీక్షకుల సంఖ్య పెరిగిన తర్వాత మానిటైజింగ్‌ ట్యాబ్‌ను నొక్కడం ద్వారా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం మీ యూట్యూబ్‌ చానల్‌కు యాడ్‌సెన్స్‌ అకౌంట్‌ ఉండాల్సిన అవసరం ఉంది. తద్వారా మీ మానిటైజ్‌డ్‌ వీడియోలకు డబ్బు సంపాదించవచ్చు. కాలం గడిచే కొద్దీ యూట్యూబ్‌ వీక్షకుల సంఖ్య పెరిగి వారు ప్రకటనలపైన క్లిక్‌ చేయడాన్ని బట్టి మనకు చెల్లింపులు వస్తాయి.
  • ఆన్‌లైన్‌ టీచింగ్‌ /ట్యూటర్‌ - ప్రస్తుతం గూగుల్‌లో వెతికితే ఎన్నో ఆన్‌లైన్‌ టీచింగ్‌ అవకాశాలు లభిస్తున్నాయి. ఇందులో మీకు అనుకూలమైనది ఏమిటంటే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు పాఠాలు చెప్పవచ్చు. ఆన్‌లైన్‌ ట్యూటర్‌ వెబ్‌సైట్లలో నమోదు చేసుకునేందుకు కొన్ని ఉచితంగా అవకాశాలు కల్పిస్తుండగా కొన్ని రుసుములు వసూలు చేస్తున్నాయి. ఒకసారి ఆ వెబ్‌సైట్లలో ట్యూటర్‌గా నమోదు చేసుకున్న తర్వాత మీకు అనుకూలమైన సమయాన్ని అందులో పేర్కొనవచ్చు. స్టేట్‌ సిలబస్‌, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పదో తరగతిలోపు పిల్లలకు పాఠాలు చెప్పేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని కోసం ఇండీడ్‌, అర్బన్‌ప్రో, వేదాంతు, షైన్‌ వంటి వెబ్‌సైట్లలో మీరు పేరు నమోదు చేసుకోవచ్చు.
  • ఆన్‌లైన్‌ రైటింగ్‌ - ఎస్‌ఈవో రిలేటెడ్‌ కంటెంట్‌ అవసరమైన చాలా పోర్టల్స్‌ కంటెంట్‌ రైటర్లకు మంచి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఒక్కో పదానికి రూ. 40 పైసల నుంచి రూ. 1.00 వరకూ డబ్బు చెల్లిస్తారు. ఇలాంటి వెబ్‌సైట్లు వారం, నెలవారీగా చెల్లింపులు చేస్తుంటాయి. వారం వారం చెల్లింపు విధానాన్ని ఎంచుకోవడం మంచిది. ఈ విధంగా ఇప్పటికే చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు. మీకు రాయటంలో ఆసక్తి, నైపుణ్యం ఉంటే ప్రయత్నించవచ్చు.
  • ఆన్‌లైన్‌ అనువాదం - అనువాదకులకు మన దేశంలో చాలా డిమాండ్‌ ఉంది. దేశంలో భాషలు ఎక్కువగా ఉండటం మూలంగా మనకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆన్‌లైన్‌ అనువాదకులకు సైతం ఎన్నో వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో లేఖఖా ఒకటి.
  • స్టాక్‌ ట్రేడింగ్‌ - మీరు ఉద్యోగంతో పాటు అదనపు డబ్బు(లిక్విడ్‌ క్యాష్‌) ఉన్న వారు స్టాక్‌ ట్రేడింగ్‌ను సైతం ప్రయత్నించవచ్చు. అయితే మీకు స్టాక్‌ మార్కెట్‌పై సరైన అవగాహన లేకపోతే ఇది మంచి ఆప్షన్‌ కాదు. మీ ఉద్యోగానికి ఆటంకం కలగకుండా ఉండేట్టు దీన్ని చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే ఉద్యోగం సరిగా చేయలేరు, ట్రేడింగ్‌ సరిగా చేయలేరు.
  • నైట్‌ జాబ్స్‌ - రాత్రుల్లో పని చేయగలిగితే వీటిని ప్రయత్నించ వచ్చు. కాల్‌సెంటర్స్‌లో చేసే సమయం, ఓపిక ఉంటే ఈ ఉద్యోగాలు చేయవచ్చు. అయితే మీ రోజు వారీ ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్ట్లు చూసు కోవాలి. దీని ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ మీరు సమర్థవంతంగా మేనేజ్‌ చేయగలిగితేనే ఇటువైపు ఆలోచించండి.
  • ఫైనాన్షియల్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ - సర్వీసెస్‌ బీమా కంపెనీలకు ఏజెంట్లుగా ఉండొచ్చు. మీ ఉద్యోగం సాయంత్రం 5,6 గంటలకల్లా ముగిస్తే వివిధ వ్యక్తులను కలిసి బీమా పాలసీలను అమ్మవచ్చు. ఎల్‌ఐసీని ఈ కేటగిరీలో ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. జీవిత బీమా సంస్థ కూడా గౌరవప్రదమైన కమిషన్లనే ఇస్తుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇతర ఆర్థిక సాధనాలకు సంబంధించిన ఏజెన్సీలను సైతం ఎంచుకోవచ్చు.
  • ఇతర కన్సల్టెన్సీ సేవలు - మీకు ఒక రంగంలో నైపుణ్యం ఉందని భావిస్తే దానికి సంబంధించి ఒక కన్సల్టెన్సీని నిర్వహించుకోవచ్చు. ఉదాహరణకు వెబ్‌ డిజైనింగ్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, యాప్‌లకు సంబంధించి మీకు వృత్తి నైపుణ్యం ఉంటే దానికి సంబంధించి మీకు మీరుగా ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లో కరపత్రాల ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. ఇంకా రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ, ఆర్కిటెక్చర్‌ ఈ కోవలోకి వస్తాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)