ప్రపంచ మంతటా ఉన్న ఎన్నో అంతు చిక్కని రహాస్యాలు అద్భుత మిస్టరీల గురించి మీకు తెలుసునేమో చూడండి.

అందమైన ప్రకృతిలో అద్భుతాలెన్నెన్నో! గమనించాలే కానీ ప్రతీదీ ఒక రహస్యమే! ఆ రహస్యాలను ఛేదించేందుకే మనిషి తన మేధస్సును పదునెక్కించాడు. ఆ పొరలన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. కానీ శతవిధాల యత్నిస్తున్నా మానవ మేధకు అందని అపూర్వమైన మిస్టరీలు కొన్ని అలాగే మిగిలిపోయాయి. వాటిని బైటపెట్టాలనే తపన పెరిగిపోయింది. అదో తపస్సుగా మారింది. ఆ నిరంతర తపోశోధన అజరామరంగా కొనసాగుతూనే ఉంది. కాలచక్రంలో తెలియకుండా మిగిలిపోయిన మిస్టరీలు కొన్నింటిని కనుక్కోవడానికి ఎన్నో యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనదేశంలోనే కాదు ప్రపంచ మంతటా ఉన్న ఇలాంటి మిస్టీరియస్‌ మిస్టరీలు మానవ మేధస్సును సవాల్‌ చేస్తూ మనముందు నిలిచు న్నాయి. అలాంటి అద్భుత మిస్టరీల గురించి తెలుసుకుందాం రండి!

డెత్‌వ్యాలీ
డెత్‌వ్యాలీగా పిలిచే ఈ ప్రాంతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. సముద్ర మట్టానికి 1130 మీటర్ల ఎత్తులో ఉన్న ఎండిపోయిన విశాలమైన సరస్సు ఉంటుంది. దీన్నే డెత్ వ్యాలీ అని పిలుస్తారు. ఇక్కడ మనుషులు కానీ జంతువులు కానీ ఉండవు. విచిత్రం ఏంటంటే ఈ ప్రాంతంలో బండ రాళ్లు వాటంతట అవే కదులుతూ ఉంటాయి. భూమిలోని ఒత్తిళ్ళ కారణంగానే ఇక్కడ బండ రాళ్ళు ఇలా కదులుతాయని ఇటీవల శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయినా దీనిపై మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇదే కాలిఫోర్నియాలోని మరో డెతవ్యాలీలో అయిదు వేల ఏళ్లనాటి ఒక అండర్‌గ్రౌండ్‌ పట్టణం ఉంది. ఈ భూగర్భ పట్టణంలో పురాతన కాలానికి చెందిన అనేక రకాల మమ్మీలు, ప్రాచీన కళాఖండాలు ఉన్నాయి. వాటన్నింటినీ భూగర్భ పరిశోధకులు పరిశీలించారు. వీటన్నింటినీ ఈ విధంగా ఎవరు భద్రపరిచారు? ఎందుకు భద్రపరిచారు? ఇదంతా ఎలా చేయగలిగారు? అనే విషయాల్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు.


బెర్ముడా ట్రయాంగిల్‌
గగనతలంలో ఎగురుతూ వెళ్ళే విమానాలు ఆ ప్రాంతానికి చేరుకోగానే అకస్మాత్తుగా అదృశ్యమైపోతాయి. ఎవరో లాగినట్టుగా బిలంలో పడిపోతాయి. అప్పటివరకు హాయిగా ప్రయాణించే నౌకలు అకస్మాత్తుగా అడ్రస్‌ లేకుండా పోతాయి. అమెరికన్ నౌకాదళానికి చుక్కలు చూపించిన ఆ ప్రాంతం పేరే బెర్ముడా ట్రయాంగిల్‌. దీనిమీద ఇప్పటికే ఎన్నో కథనాలు వెలువడ్డాయి. కొందరు ఇది నిజం అని నమ్మితే మరికొందరు ఊహాజనితం అంటారు. కానీ ట్రయాంగిల్‌లోకి వచ్చిన నౌకలు, విమానాలు అదృశ్యమైపోయాయి. ఒక పక్క మియామి, రెండవ పక్క బర్ముడా, మూడో పక్క సానజువాన్ ప్యూర్టోరికోలకి మధ్య త్రికోణాకారంలో ఉన్న ప్రాంతాన్నే బెర్ముడా ట్రయాంగిల్‌ అంటారు. దీని విస్తీర్ణం అయిదు లక్షల చదరపు మైళ్లు. ఈ ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి విమానాలన్నీ కుప్పకూలిపోతున్నాయట. ఎందుకు ఇలా జరుగుతున్నదన్న విషయం ఇప్పటికీ మిస్టీరి యస్‌గానే మిగిలిపోయింది.


ఈజిప్ట్‌ మమ్మీలు

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా ఆశ్చర్యచకితుల్ని చేస్తున్న మహాద్భుత నిర్మాణం ఈజిప్ట్‌ పిరమిడ్లు. అవే అద్భుతమంటే అందులో భద్రపరిచిన మమ్మీలు మహా అద్భుతాలు. ఇందులో ఇప్పటివరకు చనిపోయిన వారి భౌతిక కాయాల్ని రసాయనపదార్థాల లేపనం ద్వారా చెక్కుచెదరకుండా కాపాడుతూ వచ్చారు. ఇలా ఈజి్‌ప్టలో క్రీస్తుపూర్వానికి సంబంధించిన అనేక కట్టడాలు, వాటి వెనక రహస్యాలు అనేకం దాగున్నాయి. ఈజిప్ట్‌లో నిర్మించిన పిరమిడ్లు ఒక అద్భుతమైతే, ఈజిప్ట్‌ కోటల మీద చెక్కిన ఈజిప్ట్‌ పురాతన లిపి మరో మహాద్భుతం! ఆ లిపి ఏమిటో మాత్రం శాస్త్రవేత్తలకు ఇప్పటివరకు అంతు చిక్కని ప్రశ్న. ఇప్పటివరకు ఆ లిపిని అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు చేశారు.


భూగర్భంలో లాబ్రినాథ్‌
అదేవిధంగా మరో మిస్టీరియస్‌ మిస్టరీ ప్రాంతం లాబ్రినాథ్‌. ఈ ప్రాంతాన్ని భూగర్భంలో ఎవరు నిర్మించారో తెలియజేసే సరైన ఆధారాలు ఇప్పటివరకు దొరకలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకార మైతే, మొసళ్ళు నివసించేందుకు నిర్మించిన పవిత్ర ప్రదేశం. మొత్తం 12 మంది రాజులు వీటిని నిర్మించారని చెబుతారు. ఈ లాబ్రినాథ్‌పై పరిశోధనలు చేసేందుకు మాత్రం ఈజిప్ట్‌ ప్రభుత్వం అనుమతించడం లేదట.


ది ఓరా లిండా బుక్‌
చిన్న పిల్లలు, రాయడం తెలియని వారు పుస్తకాలపై రాస్తే ఎలా ఉంటుంది? ఏం రాశారో వారికే తెలియక అర్థం కాకుండా గజిబిజిగా ఉంటుంది కదా! సరిగ్గా ది ఓరా లిండా బుక్‌ కూడా అలాగే ఉంటుంది. అసలు ఆ బుక్‌ ఏంటి అన్న విషయం ఇప్పటికీ అంతుచిక్కలేదు. కానీ అదేమీ చిన్న పిల్లలు రాసిన బుక్‌ కాదండోయ్‌! ఎంతో విలువైన సమాచారం అందులో ఉంది. ఈ పురాతన పుస్తకంలో ప్రిజియన భాషలో చేతిరాతతో రాసిన చారిత్రక, పౌరాణిక, మతపరమైన అంశాలెన్నో ఉన్నాయి. అంతేకాక కెటాస్ర్టోఫిజమ్‌, నేషనలిజమ్‌, మాట్రి యార్కి, మైథాలజీలకు సంబంధించిన వివరాలు కూడా ఇందులో రాసి పెట్టారు. ఈ పుస్తకంలోని అక్షరాలన్నీ క్రీ.పూ. 2194 నుంచి క్రీ.శ. 803 మధ్యకాలంలో పొందు పర్చినట్టు పరిశోధకులు తేల్చారు. భూదేవిని పూజించే వాళ్లు ఈ పుస్తకం రాశారని అంటుంటారు. కానీ ఈ లిఖిత పుస్తకంలోని లిపిని ఇంతవరకు ఎవరూ డీకోడ్‌ చేయలేకపోయారు. అందుకే ఆ బుక్‌లోని కాగితాల వెనుక ఉన్న అక్షర సర్వస్వం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.


రబ్బరు బంతులు కాదు రాయి బంతులు
బంతి అనగానే రోజూ క్రికెట్‌, ఫుట్‌బాల్‌ ఆడే బంతులే గుర్తొస్తున్నాయా? కానీ అక్కడ ఉన్నవన్నీ రాతి బంతులే. ఒకసారి అరటి తోటలు పెంచే ఉదే ్దశంతో కోస్టారికాలో దట్టమైన అడవుల్ని తగులబెట్టి, నేలను చదునుచేస్తున్న సమయంలో అక్కడ వింత ఆకారంలో ఉన్న రాతిబంతులు అనేకం బయటపడ్డాయట. అవన్నీ టెన్నిస్‌ బంతి సైజులో మొదలుపెట్టి 16 టన్నుల బరువున్న బంతుల దాకా అనేక రకాల పరిమాణాల్లో బయటపడ్డాయట. వేల సంవత్సరాల నాటివే ఇవన్నీ. ఎవరు ఎందుకు వీటిని తయారు చేశారో అంతుచిక్కడం లేదు.


ది వేలీ ఆఫ్‌ వేపర్స్‌
వేడినీటి చెలమలు, చల్లని నీటి చెలమల గురించి మనందరికీ తెలిసిందే. కొన్ని కారణాల వల్ల భూమిలోంచి వేడినీరు ఉబికి వస్తూ ఉంటుంది. అయితే ఆగ్నేయ అమెరికాలోని ఆర్కాన్‌సాస్‌ ఉవాచిత పర్వతశ్రేణిలో ది వేలీ ఆఫ్‌ వేపర్స్‌ అనే ప్రాంతం ఉంది. ఈ నీటిలో స్నానం చేస్తే రోగాలు నయమవుతాయట. ఇప్పటికి చాలామంది స్నానాలు చేస్తూ తమ వ్యాధులు నయం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం హాట్‌ స్ర్పింగ్‌ నేషనల్‌ పార్క్‌ అనే పేరుతో రూపుమారింది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని అనేక తెగల ప్రజలు పరమపవిత్రంగా భావించేవారు. ఈ ప్రాంతంలో స్నానం చేసేవారు. ఇందులో నిత్యం 143 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎనిమిది లక్షల గాలన్ల నీరు బైటకు ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎందుకు అలా వెలువడుతుందన్న విషయం ఇప్పటివరకు అంతుచిక్కలేదు. ఎటువంటి జియోథర్మల్‌ యాక్టివిటీ లేకుండా నాలుగు వేల సంవత్సరాలుగా భూగర్భ పొరల్లోంచి నిరంతరాయంగా ఆ నీరు వెలువడుతోంది. అది కూడా వడబోసిన నీరంత స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే, చల్లని నీటి గుండం కూడా ఉంది. దీన్ని ముద్దుగా స్లీపింగ్‌ వాటర్స్‌ అని పిలుచుకుంటారు. ఆనాటి కాలం నుంచి నేటి వరకు ఈ ప్రాంతం అదే పేరుతో పిలవబడుతోంది. ఇలా ఒక పక్కన వేడి నీళ్లు ఉబికి రావడం, మరో పక్క చల్లని నీటి సెలయేరు ఉండడం ఈ రెండూ రోగాల్ని నయం చేయడం అంతా ఒక మిస్టరీ...! ఇప్పటి వరకు ఈ మిస్టరీ ఏమిటో ఎవరూ కనిపెట్టలేకపోయారు. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే ఎంతో అరుదైన అరవై రకాల ఖనిజాలు దీనికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఒకేచోట లభిస్తున్నాయి. కిలోమీటర్‌ వ్యాసార్థంలో ఈ ఖనిజాలు విస్తరించి ఉన్నాయి. ఈ విధంగా ఈ ప్రాంతం మాగ్నెటిక్‌ కేవ్‌గా మిస్టరీకి ఆలవాలమైపోయింది.


పురాతన శిలాజాలు
కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే శిలాతలం కింద శిలాజాలు రూపు దాల్చాయి. అయితే ఉలాలో 110 మిలియన సంవత్సరాల నాటి ఒక మనిషి హస్తముద్ర లభించింది. అలాగే దొరికిన ఒక మనిషి పాదముద్ర 600 మిలియన సంవత్సరాల నాటిదని అంచనా వేశారు. అంటే అప్పటికే మనుషులు పాదరక్షలు ధరించేవారా? లేక వాళ్లు ఎవరై ఉంటారు. అనేది ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. అంతేకాదు అక్కడ చేసిన అనేక తవ్వకాల్లో మనిషి గోరు, ఇనుపకుండ లాంటి వస్తువులు బయటపడ్డాయి. ఇవన్నీ ఎప్పటివీ? ఎవరివీ? అనే విషయం ఇప్పటివరకు తేలలేదు.
అమెరికాలోని మిస్సోరి ఒక పురాతన నగరం. ఈ నగరంలో రాక్షసులు నివసించారని చెబుతారు. అక్కడ మహాకాయాలు గల మనుషుల అస్థికలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు ఎవరన్నది మాత్రం ఇప్పటికి మిస్టరీయే!


ది వస్ట్‌ తక్లామకన్ ఎడారి
ఎడారిలో ఎంత సేపు నడిచినా ఇసుక మేడలు తప్ప ఏమీ ఉండవు. చైనాలో ఉన్న ఈ ఎడారిలో ఏదారినైనా వెళ్లారనుకోండి మళ్లీ తిరిగి అదే దారిన రావడానికి దారి తెలియదట. అక్కడ ఇసుకతో నిర్మించిన పురాతన దేవాలయాలు ఉన్నాయట. అదేంటి ఎడారిలో దేవాలయాలేంటని అనుకుంటున్నారా? ఈ ఆలయాలను ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? అనే విషయం ఇప్పటివరకు తేలలేదు. అంతేకాదు ఆ దేవాలయాలు ఇసుకతో ఎలా నిర్మించారన్నది మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న.

లోతైన ఓ అద్భుతం క్రుబేరా గుహ!
గుహల సౌందర్యం, వాటి అద్భుతాలు తెలియంది కాదు. బొర్రాగుహలు, ఎలిఫెంటా, అజంతా గుహలు ఎన్నో అద్బుతాల గురించి వివరిస్తాయి. కానీ ప్రపంచంలోనే అతి లోతైనదిగా పేరొందిన గుహ క్రుబేరా గుహ. 2,197 మీటర్లు అంటే సుమారు 7,208 అడుగుల లోతు వరకు ఉంటుందీ గుహ. భూమి మీద అతి లోతైన గుహగా క్రుబేరా పేరొందింది. భూమి పొరల్లో వచ్చిన మార్పుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. జార్జియా దేశంలోని అబ్ఖజియా ప్రదేశంలో ఉన్న ఈ గుహలు 1960లో బైటపడ్డాయి. అబ్ఖజియా ప్రాంతం రష్యా నుంచి వెళితే దగ్గర. మాస్కో నుంచి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో ఇక్కడ చల్లగానూ, వాతావరణం అనువుగానూ ఉంటుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)