పొట్టకూటి కోసం 30 ఏళ్లుగా సజీవ విగ్రహంలా నిలబడ్డాడు.. అతనికి ఎదురైన కొన్ని సంఘటనలు తెలిస్తే మీకు కూడా కన్నీళ్లు వస్తాయేమో

చెన్నైలోని విజిపి గోల్డెన్‌ బీచ్‌ ఎంట్రన్స్‌ వద్దకు రాగానే పెద్ద తలపాగా, రాజుల కాలం నాటి వస్త్రధారణ, చేతిలో కర్రతో ద్వార పాలకుడిలా ఉన్న విగ్రహం ఒకటి కనిపిస్తుంది. నిజానికి అది విగ్రహం కాదు... జాగ్రత్తగా చూస్తే మనిషని అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఎవరెంతగా పలకరించాలని చూసినా ఆ మనిషి చలించడు. మూడు దశాబ్దాలకు పైగా లక్షలమందిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్న ఆ సజీవ విగ్రహం పేరు మహ్మద్‌ రఫీ.

మద్రాసు పట్టణం... చెన్నైగా మారింది. ముఖ్యమంత్రులు అనేకమంది మారారు. నగరం ఎంతగానో విస్తరించింది. వాటితో ఏమీ సంబంధం లేకుండా ఉన్న చోటే నిలబడి ప్రపంచాన్ని వీక్షిస్తున్న మౌన ప్రేక్షకుడు అతను. పొట్టకూటి కోసం 1982లో అక్కడ విగ్రహంలా నిలబడటం మొదలుపెట్టాడు మహ్మద్‌ రఫీ. ప్రారంభంలో సందర్శకులు తక్కువగా వచ్చినపుడు పది, 15 నిమిషాలు నిలుచుని, వాళ్లు వెళ్లిపోగానే కూర్చునేవాడట. తర్వాత టూరిస్టుల తాకిడి పెరిగేసరికి నిలుచునే సమయం నిమిషాలు దాటి గంటల్లోకి వెళ్లిపోయింది. ఒక్కోసారి నాలుగు గంటల పాటు కూడా విరామం లేకుండా నిలబడాల్సి వచ్చేది. అయినా అంతసేపూ విగ్రహంలా నిలబడి ఉండేవారాయన. ఇదంతా ఎలా సాధ్యం అంటే... ‘‘మనసును కంట్రోల్‌ చేసుకోవడం వల్లే’’ అంటారాయన.

కదలకుండా, కనురెప్ప మూయకుండా నిమిషం పాటు ఉండటమే కష్టం. అలాంటిది గంట దాకా కూడా రెప్ప మూయకుండా నిలబడ గలరు రఫీ. ‘‘మామూలుగా కనురెప్ప వేయకుండా ఎక్కువ సేపు ఉండటం సాధ్యం కాదు. కానీ నేను దాన్ని సవాల్‌గా తీసుకున్నాను. కళ్లు మండుతున్నా, కన్నీరు వస్తున్నా రెప్ప మూయకూడదని గట్టిగా సంకల్పించుకున్నా. అందుకే దాదాపు గంట వరకూ కనురెప్ప వేయకుండా ఉండగలుగు తున్నా. ఇపుడు నా కంటి సమీపంలో ఈగలు వాలినా నా రెప్ప మాత్రం మూతపడదు’ అని చెప్పారు రఫీ. ఇలా విగ్రహంలా నిల్చునే సమయంలో రఫీకి చాలా పరీక్షలు ఎదురవుతాయి. కొంతమంది చక్కిలిగింతలు పెడతారు. మరికొంతమంది పొడుస్తారు. పగలబడి నవ్వాల్సిన జోకులు పేలుస్తారు. అయినా ఆయనలో కించిత్తైనా చలనం ఉండదు.

‘‘ఒకసారి ఓ గమ్మత్తైన సంఘటన జరిగింది. ఓ విదేశీయుడు నా దగ్గరకు వచ్చి ముట్టుకుని చూశాడు. నాలో చలనం లేదు. కనురెప్ప వరకూ వేలిని తీసుకెళ్లాడు. అయునా కళ్లు మూయకపోయేసరికి అనుమానమొచ్చి... మనిషైతే శ్వాస ఆడాలి కదా అని ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. ఏం తెలియలేదు. ఇక నన్ను విగ్రహమే అని నిర్ధారించుకుని కెమెరాతో చిత్రించసాగాడు. కాసేపటికి గైడ్‌ వచ్చి... విగ్రహం కాదు మనిషే అని చెప్పాడు. కాదు అది విగ్రహం అని గైడ్‌తో గొడవపెట్టుకున్నాడు. చివరికి నేను కదిలి ఆయన దగ్గరకు వెళ్లేసరికి కెమెరాని అక్కడే వదిలి పరిగెత్తాడు. కాసేపటి తర్వాత తిరిగొచ్చి నన్ను తిట్టుకుంటూ కెమెరాని తీసుకెళ్లాడు’ అంటూ ఆ రోజుల్ని జ్ఞాపకం చేసుకున్నారు.

ఇవేకాదు... కొన్నిసార్లు బాధాకరమైన సంఘటనలు కూడా ఎదురవుతాయట. తాగిన వాళ్లు వచ్చి అసభ్యంగా మాట్లాడతారట. మరికొంతమంది గిచ్చుతారట. సిగరెట్టుతో చేతిపై కాల్చేవాళ్లు కూడా ఉంటారట. అయినా సాధ్యమైనంత వరకూ చలించరు రఫీ. ఒకసారి ఓ తాగుబోతు హఠాత్తుగా బ్లేడు తీసుకుని చేతులపై దాడి కూడా చేశాడట.

ఇలాంటి కొన్ని చేదు అనుభవాలు ఉన్నా... ఇంత నిబద్ధతతో ఎలా ఉండగలుగుతున్నారని ప్రశ్నిస్తే... ‘‘ఒకసారి కొంతమంది తెలుగువాళ్లు వచ్చి నన్ను బాగా పరికించి, వాళ్లల్లో వాళ్లు ‘దేవుడు, దేవుడు’ అనుకుంటూ నా పాదాలపై డబ్బులుంచారు. ఆ సంఘటన తర్వాత నాకు నా వృత్తిపై మరింత గౌరవం పెరిగింది. అదే నాకు స్ఫూర్తి అని చెప్పాలి’’ అన్నారు రఫీ. ఇప్పటికీ తెలుగువాళ్లు మద్రాసు వచ్చి ఇలా పాదాలపై డబ్బులు పెట్టి వెళుతుంటారట.

నిజానికి రఫీ పొట్టకూటి కోసం ఆ పని చేయడం మొదలుపెట్టినా... ఇప్పుడు మాత్రం అదొక్కటే కారణం కాదు. పొట్టకూటి కోసమే అయితే ఈసరికే ఆయన మరో పని వెదుక్కుని ఉండేవారు. కాని అలా విగ్రహంలా నిలబడటాన్ని ఓ పవిత్రమైన బాధ్యతగాచూస్తున్నారాయన. అందుకే దాదాపు ముప్ఫై నాలుగు సంవత్సరాలుగా సజీవ విగ్రహంలా నిలబడే ఉన్నారాయన. కింద ఈ వీడియో చూడండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)