వీటిని తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యం కూడా... ఇవి వంటింట్లోనే ఉంటాయి.. వాటి కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు

బరువు తగ్గేందుకు కావలసిన పదార్థాలు వంటింట్లోనే ఉన్నాయి. కాబట్టి వాటి కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు అంటున్నారు నిపుణులు. వీటిని తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అవేంటంటే...
పెసరపప్పు:- ఇందులో ఎ, బి, సి, ఇ విటమిన్లు ఉన్నాయి. కాల్షియం, ఐరన్‌, పొటాషియం వంటి మినరల్స్‌ కూడా బోలెడు ఉన్నాయి. అందుకని కొవ్వుపదార్థాలకు బదులుగా ఈ పప్పుని తినమంటున్నారు డైటీషియన్లు. బరువు తగ్గించే పెసరపప్పులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలం. అందుకే కాబోలు పెసరపప్పు ఒక గిన్నెడు తింటే పొట్ట నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు కూడా. బరువు తగ్గించడంతో పాటు జీవక్రియలు, వ్యాధినిరోధక వ్యవస్థల్ని మెరుగుపరచడమే కాకుండా ప్రాణాంతక వ్యాధులనుంచి కాపాడుతుంది కూడా. ఈ పప్పుని చపాతీలతో తినొచ్చు. అలా నచ్చలేదంటే వీటిని మొలకెత్తించి అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ కారం, చాట్‌ మసాలా, ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం, ఉప్పు కలుపుకుని తిన్నా రుచిగానే ఉంటుంది.

పాలకూర:- ఈ ఆకుకూరలో పీచుపదార్థం, నీరు, యాంటాక్సిడెంట్స్‌, కె, ఎ విటమిన్‌లతో పాటుగా మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ వంటి మినరల్స్‌ కూడా మెండుగా ఉంటాయి. ఒక కప్పు కూరలో పది కెలొరీలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బరువు తగ్గించడంలో ఇదెంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గిన్నె పాలకూర తింటే చాలు కడుపు నిండిపోతుంది. మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియా మార్గాన్ని శుభ్రం చేస్తుంది. వంద గ్రాముల కూరలో 26 కిలో కెలొరీలు, రెండు గ్రాముల ప్రొటీన్లు, 2.9 గ్రాముల కార్బోహైడ్రేట్స్‌, 0.7 గ్రాముల కొవ్వు, 1.14 మిల్లీగ్రాముల ఐరన్‌ ఉంటుంది.

కాకరకాయ:-
పేరు వినగానే అబ్బో చేదు అనేయొద్దు. సరిగ్గా వండితే రుచిగా ఉంటుంది. కాకరకాయని భోజనంలో చేర్చడం వల్ల మీరు ఖర్చు చేయాల్సినదానికంటే తక్కువ కెలొరీలు తింటారు. అందుకని కాకరకాయని వెజిటబుల్‌ సూప్స్‌లో, స్టూస్‌లో చేర్చండి. లేదా లీన్‌ ప్రొటీన్‌ అంటే చికెన్‌ బ్రెస్ట్‌, చేప, సోయా ఆధారిత వెజిటేరియన్‌ బర్గర్లతో పాటు సైడ్‌ డిష్‌గా తినొచ్చు. కాకరకాయ ముక్కల్ని ఉప్పు కలిపిన నీళ్లలో ఐదు నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల చేదు తగ్గుతుంది. ఆ తరువాత ఈ ముక్కల్ని సూప్‌, స్టూలలో వాడొచ్చు.

కాలీఫ్లవర్‌:-
శరీరంలోని వ్యర్థాలతో వీరోచితంగా పోరాడుతుంది ఈ ఫ్లవర్‌. ఇందులో ఉండే ఇండోల్స్‌, గ్లూకోసినోలేట్స్‌, థయోసయనేట్స్‌ శరీరంలో వ్యర్ధంగా పడి ఉన్న చెత్తను బయటికి పంపుతాయి. కాలీఫ్లవర్‌లో కెలోరీలు తక్కువగా, పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది.

క్యాబేజీ:-
బరువు తగ్గించడంలో దీనికి సాటి మరే ఇతర కూరగాయ ఉండదు. మలబద్ధకం, చర్మ, కంటి సంబంధిత వ్యాధులు, వృద్ధాప్యం, కడుపులో అల్సర్లు, అల్జీమర్‌ వంటి వాటితో పోరాడుతుంది. తక్కువ కెలోరీలతో, ఎక్కువ పీచు పదార్ధాన్ని అందిస్తుంది. విటమిన్‌-సి మెండుగా ఉంటుంది. దీన్ని ఆహారంలో చేర్చడం వల్ల డయాబెటిస్‌ రాకుండా నివారించొచ్చు అంటారు కొందరు.

టొమాటో:-
  టొమాటోను తిన్న ప్రతిసారీ మీ శరీరం నుంచి కొలెసిస్టోకినిన్‌ అనే హార్మోను విడుదలవుతుంది. ఇది పొట్టకి, పేగులకి మధ్య ఉన్న వాల్వ్‌ను బిగుతుగా చేస్తుంది. దాని ఫలితంగా పొట్టనిండిన భావన కలిగి మితంగా తింటారు. శక్తిని ఇవ్వడమేకాకుండా రక్తంలో చక్కెర శాతాన్ని స్థిరపరుస్తుంది. జీర్ణశక్తిని క్రమపరిచి, శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. కొలెస్ర్టాల్‌ను తగ్గిస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)