మీ వ్యాపారానికి స్వైపింగ్ మెషిన్ కావాలా ? స్వైపింగ్ మెషిన్ పొందాలంటే ఎలా తీసుకోవాలి ? పూర్తి వివరాలు మీ కోసం

పెద్దనోట్ల రద్దు.. చిల్లర కష్టాలతో వ్యాపారులందరూ నగదు రహిత లావాదేవీలవైపు చూస్తున్నారు. మంచిదే. దీంతో వ్యాపారం సులభమవుతుంది. మరి ఆ నగదు రహిత లావాదేవీలు ఎలా చేయాలి..? అనేది ఇప్పుడు చాలా మంది వ్యాపారులను తొలుస్తున్న ప్రశ్న. మరికొందరు అసలిది మేం చేయగలమా అని అనుకొంటూ ఉంటారు.

your transaction was successfully processed..
your transaction was declined.

ఈ రెండు లైన్లు చదివి అర్థం చేసుకోగలిగితే చాలు మీరు క్యాష్‌లెస్‌ లావాదేవీలను సులభంగా చేయగలరు. ఇందుకు కావాల్సిందల్లా ఈ పోస్‌ యంత్రం. ఓ స్మార్ట్‌ ఫోన్‌ లేదా ఒక ల్యాండ్‌ లైన్‌. ఓ బ్యాంకు ఖాతా. మరి ఈ యంత్రాన్ని ఎలా తీసుకోవాలి.. ఎలా వాడాలి అనుకుంటున్నారా.. అదీ సులభమే.

ఎలా దరఖాస్తు చేయాలి.. ఏం డాక్యుమెంట్లు ఇవ్వాలి?
బ్యాంకుకు వెళ్లి అడిగితే అక్కడి సిబ్బందే మీ నుంచి రిక్వెస్ట్‌ తీసుకుంటారు. వ్యాపారం చేస్తున్నట్లు నిర్ధారించే ఏదైనా ఆధారం, వ్యక్తిగత ఐడీ, షాపు పేరుమీద అడ్రస్‌ ఫ్రూఫ్‌ వివరాలు అందిస్తే చాలు. బ్యాంకులు మొదట కరెంట్‌ అకౌంట్‌ను ఇస్తాయి. ఆ తరవాతే ఈడీఆర్‌ మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న వ్యాపారుల విషయంలో అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు లేకపోతే వారికి కొంత వెసులుబాటు ఉంటుంది. వారు వ్యక్తిగత కరెంటు అకౌంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాతాకు సదరు వ్యక్తి వివరాలు ఇస్తే చాలు. కరెంటు అకౌంట్‌ ఓపెన్‌ చేసి.. ఆ తరవాత ఈపాస్‌ మిషన్‌ అందిస్తారు.

ఎంత ఖర్చవుతుంది!
స్వైపింగ్‌ మిషన్ల ద్వారా చేసే లావాదేవీలపై మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(ఎండీఆర్‌) వసూలు చేస్తారు. ఇది బ్యాంకులకు చెందుతుంది. మిషన్‌ పెట్టిన బ్యాంకుకు నిర్వహణ కోసం అద్దె చెల్లించాల్సి ఉంటుంది. జీపీఆర్‌ఎ్‌సతో నడిచే మూవబుల్‌ ఈడీఎస్‌ మిషన్లకు రూ.400 నుంచి రూ.600 వరకు నెల అద్దె వసూలు చేస్తాయి. మొబైల్‌ సిమ్‌, ఇంటర్నెట్‌ ఛార్జీలు బ్యాంకులు భరిస్తున్నందున అద్దె ఎక్కువగా వసూలు చేస్తారు. అదే వైరు కనెక్టు చేసుకునే ఈపాస్‌ మిషన్‌కు కొంత తక్కువ రెంట్‌ ఉంటుంది. రూ.150 నుంచి రూ.250 వరకు అద్దె వసూలు చేస్తారు. ఎంస్వై్‌పకు కొంత తక్కువ మొత్తంలో వసూలు చేస్తారు. ఎంస్వై్‌పలను కొన్ని బ్యాంకులే అందిస్తున్నాయి. ఈఛార్జీలు బ్యాంకును బట్టి, లావాదేవీల సంఖ్యను బట్టి స్వల్పంగా మారుతుంటాయి.

మరి ఎండీఆర్‌ ఎంత ఉంటుంది!
ఈ నెలాఖరు వరకు (డిసెంబర్‌ 31 వరకు) వసూలు చేయరు. సాధారణంగా డెబిట్‌ కార్డులకు రూ.2వేల లోపు లావాదేవీకి 0.75 శాతం, ఆ పైన లావాదేవీకి ఒక శాతం ఎండీఆర్‌ ఛార్జులను బ్యాంకులు తీసుకుంటాయి. క్రెడిట్‌ కార్డ్‌ అయితే 1.25 నుంచి 1.75 శాతం వరకు ఎండీఆర్‌ వసూలు చేస్తారు. ఇవీ బ్యాంకులను బట్టి మారుతుంటాయి.

యంత్రం రిపేరొస్తే..!
వాడే మిషన్‌కు రిపేరొచ్చినా.. అందులో వాడే కాగితపు రోల్స్‌ కావాలన్నా.. సాంకేతిక సమస్యలొచ్చినా బ్యాంకే బాధ్యత తీసుకుంటుంది. చిన్న సమస్యలకు ఛార్జీలు వసూలు చేయకుండా సర్వీసు ఇస్తుంది. పెద్ద సమస్య వస్తే రూ.500 లోపు ఛార్జీలు విధిస్తుంటాయి. ప్రతి బ్యాంకుకు సంబంధిత కస్టమర్‌ కేర్‌ నంబర్లు ఉంటాయి. వాటికి ఫిర్యాదు చేస్తే వారే వచ్చి రిపేరు చేసి వెళతారు.

ఈ యంత్రం వద్దనుకుంటే!
మిషన్‌ తీసుకున్న తరవాత దాన్ని తిరిగి బ్యాంకుకే ఇవ్వాలన్నా డీ ఇన్‌స్టాలేషన్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలలోపు అయితే రూ.500 వరకు ఛార్జీ ఉంటుంది. ఆరునెలల తరవాత అయితే రూ.150 ఉంటుంది. ఏడాదిపైన అయితే రూ.300 వరకు ఉంటుంది. ఇవి బ్యాంకును బట్టి స్వల్ప మార్పులుంటాయి.

స్వైపింగ్‌ మిషన్‌ ఎలా పొందొచ్చు?
ఈ యంత్రాన్ని బ్యాంకులే ఇస్తాయి. బ్యాంకుల ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. విడిగా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండదు. బ్యాంకులు కూడా అద్దె రూపంలో ఈ యంత్రాలను ఇచ్చి నగదు రహిత వ్యాపార లావాదేవీలకు అవకాశమిస్తాయి.

ఈ మిషన్‌ వచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది!
సాధారణంగా మూడు నుంచి ఏడు రోజుల్లో ఈ యంత్రాన్ని బ్యాంకులు దుకాణాదారునికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు 10 నుంచి 15 రోజులు తీసుకునేవారు. ఇప్పుడు డిమాండు దృష్టిలో పెట్టుకుని త్వరగా ఇచ్చేందుకు అన్ని బ్యాంకులు కృషి చేస్తున్నాయి. ప్రస్తుత అవసరానికి తగిన స్థాయిలో మిషన్లు అందుబాటులో లేకపోవడంతో కొంత ఆలస్యం అవుతుంది.

ఎటువంటి మిషన్లు ఎంచుకోవాలి..!
స్వైపింగ్‌ యంత్రాలు(ఎలక్ర్టానిక్‌ డాటా కాప్చర్‌(ఈడీసీ)) మూడు రకాలుగా ఉంటాయి. వాటిలో ఎక్కువగా వినియోగంలో ఉన్నవి ఇంటర్నెట్‌ ఉన్న ల్యాండ్‌ ఫోన్‌ కనెక్షన్‌ ద్వారా పనిచేసేవి. ఇవి పెట్టిన చోట నుంచి కదిపేందుకు వీలుండదు. వీటికి అప్‌డేటెడ్‌ వర్షన్‌గా మొబైల్‌ సిమ్‌ను ఆధారం చేసుకుని పని చేసే కార్డ్‌లెస్‌ ఈడీఎస్‌ మిషన్లు వచ్చాయి.. వీటితోపాటు లేటె్‌స్టగా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్టు చేసే ఎంస్వైప్‌ మిషన్లు కూడా వినియోగంలోకి వచ్చాయి. మన వ్యాపార అవసరాలకు తగిన విధంగా వీటిని ఎంచుకోవచ్చు.

Popular Posts

Latest Posts